ఆమె రెండు కాళ్లు పనిచేయకపోయినా బైక్‌పై రయ్... రయ్‌మంటూ దూసుకెళ్లి రికార్డులు సృష్టించింది. శరీరం సహకరించకపోయినా పారా అథ్లెట్‌గా పారాలింపిక్స్‌లో మన దేశానికి పసిడి పతకం అందించింది. చక్రాల కుర్చీకే పరిమితమైనా తన వాక్పటిమతో తనలాంటి వారిలో స్ఫూర్తినింపింది. ఇలా సానుకూల దృక్పథముంటే ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా అధిగమించవచ్చని నిరూపించింది దీపా మలిక్. పారా అథ్లెట్‌గా ప్రపంచ క్రీడాపటంలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న ఆమె తాజాగా ఆటకు వీడ్కోలు పలికింది. విజయానికి వయసు, వైకల్యం అడ్డుకావని నిరూపించి అపురూప విజయాలు సొంతం చేసుకున్న ఈ క్రీడాకారిణి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
ఒలింపిక్స్‌లో తొలి పతకం!
2016 రియో పారాలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి పతకం సాధించి చరిత్ర సృష్టించింది దీపా మలిక్. మహిళల షాట్‌పుట్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకున్న ఆమె.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. తద్వారా విశ్వ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జెండా మురిసేలా చేసింది. శారీరక వైకల్యాన్ని అధిగమించి నాలుగు పదుల వయసులోనూ ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొన్న ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
ఆటుపోట్లు ఎదురైనా!
పారా అథ్లెట్ దీపా మలిక్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. మరెన్నో ఆటుపోట్లు! అయినా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ, సానుకూల దృక్పథంతో ముందడుగు వేసిందామె. వెన్నెముకలో ఏర్పడిన కణతి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె 'నా జీవితమింతే' అని సరిపెట్టుకోలేదు. తనలోని శక్తిని కూడదీసుకొని, ఆసక్తులకు పదునుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. నాలుగు పదుల వయసులోనూ బైక్ రైడర్‌గా, పారా అథ్లెట్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా రాణిస్తూ.. విజయాలు సాధించడానికి వయసు, శారీరక వైకల్యం అడ్డుకావని నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది.
నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహంతో!
దీపా మలిక్ జీవితాన్ని పరిశీలిస్తే మొదట్నుంచీ సంతోషం, విషాదం వెనువెంటనే తొంగిచూడడం మనం గమనించచ్చు. హుషారుగా నడక నేర్చుకొనే వయసులో స్పైనల్ ట్యూమర్ రావడంతో నడకకు దూరమైంది. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు వైద్యులు సర్జరీ చేసి కణతిని తొలగించడంతో అందరిలాగా నడవడం, పరిగెత్తడం ప్రారంభించింది. అంతేకాదు.. బైకింగ్పై ఇష్టం పెంచుకొని బైక్ రైడింగ్ కూడా నేర్చుకుంది దీప. ఆ రోజుల్లో మహిళలు పురుషుల బైక్ నడుపుతోంటే కాస్త వింతగానే చూసేవారట! అయితే తండ్రి కల్నల్ బీకే నాగపాల్ తనలో నింపిన స్ఫూర్తితో ఆమె ముందుకు సాగిపోయింది. చిన్నవయసు నుంచే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అలవాటు చేసుకుంది దీప. ఇరవై ఏళ్ల వయసులో ఆర్మీ అధికారి కల్నల్ విక్రమ్‌ని వివాహం చేసుకుందామె. ఆయన కూడా దీపను అన్ని విధాలుగా ప్రోత్సహించే వారు. సంతోషంగా సాగిపోతున్న దీప జీవితంలోకి మరింత ఆనందాన్ని తీసుకొచ్చింది ఆమె కూతురు దేవిక. ఏడాది వరకు ఆ పాప బాగానే ఉన్నా.. అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం కారణంగా ఆ చిన్నారి శరీరంలోని ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. ఈ సంఘటనతో తల్లిగా దీప తల్లడిల్లినా.. వైకల్యం తాలూకు ప్రభావం చిన్నారిపై పడకుండా పెంచాలని నిర్ణయించుకుంది. అలా మరో మూడేళ్లు గడిచిన తర్వాత రెండో కూతురు అంబికకు జన్మనిచ్చింది దీప.
అనునిత్యం పోరాటమే..
అందమైన కుటుంబంతో హాయిగా సాగిపోతున్న దీప జీవితంలో అనుకోకుండా ఓ పెద్ద కుదుపు వచ్చింది. ఎప్పుడో చిన్నతనంలో ఆమె వెన్నెముక నుంచి తొలగించిన ట్యూమర్ తిరిగి పెరిగినట్లుగా వైద్యులు గుర్తించారు. దాన్ని తొలగిస్తే.. ఆమె ఛాతీ కింద భాగం చచ్చుబడిపోతుందని, ఇకపై దీప నడవలేదని కూడా చెప్పారు. అప్పటికి ఆమె పెద్ద కూతురు దేవిక వయసు ఏడేళ్లు. అంబిక మూడేళ్ల పాప. ఆమె భర్త కల్నల్ విక్రమ్ కార్గిల్ యుద్ధంలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన భర్త అహోరాత్రాలు యుద్ధభూమిలో పోరాడుతుంటే; జీవితమనే యుద్ధంలో గెలవడానికి సిద్ధమైంది దీప. 1999లో జరిగిన ఆపరేషన్ తర్వాత మంచానికే పరిమితమైన ఆమె కొత్త జీవితానికి అలవాటు పడటానికి, తన పని తాను తిరిగి చేసుకోవడానికి సుమారుగా రెండేళ్ల సమయం పట్టిందట! ఓవైపు తన జీవితాన్ని మలచుకుంటూనే.. మరోవైపు పక్షవాతానికి గురైన తన కూతురు దేవికకు సేవలు చేస్తూ ఉండేది. అయితే ఆ సమయంలో ఇతరులు ఆమెను చూసి జాలిపడేవారట. కానీ అది ఆమెకు నచ్చేది కాదు. అందుకే తనను చూసి ఇతరులు స్ఫూర్తి పొందేలా ఉండాలని నిర్ణయించుకొని తనలో నిద్రాణమై ఉన్న శక్తిని వెలికితీసింది దీప. తన ఆసక్తులకు తిరిగి పదును పెట్టింది.
|
బైక్ రైడింగ్‌లో రికార్డులే రికార్డులు!
తనని తాను నిరూపించుకోవాలని భావించినప్పుడు దీప మనసు మొదట పరిగెత్తింది బైక్ రైడింగ్ వైపే. అలా 36 ఏళ్ల వయసులో బైక్ రైడింగ్‌తో పునఃప్రయాణం ప్రారంభించింది. రెండు కాళ్లు పనిచేయలేని స్థితిలో ఉన్న ఆమె.. బైక్ ఎలా నడపగలిగందనే సందేహం రావడం సహజమే. దీనికోసం దాతల సహకారంతో ఆమె క్వాడ్బైక్ను సమకూర్చుకుంది. దానిపై సుమారుగా 19 నెలల పాటు సాధన చేసిన తర్వాత లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వైద్యుడు నివేదిక సమర్పించిన తర్వాతే దీపకు లైసెన్స్ లభించింది. ఆ తర్వాత ఫెడరేషన్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి ర్యాలీ వెహికల్ లైసెన్స్ అందుకొని నేవిగేటర్‌గా, డ్రైవర్‌గా తిరిగి తన కెరీర్‌ను కొనసాగించింది. ఈ రెండు ఘనతలు సాధించిన తొలి దివ్యాంగురాలిగా ఆమె గుర్తింపు పొందింది. ఎంతో కష్టమైనవిగా భావించే కార్ ర్యాలీల్లో సైతం ఆమె పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 2009లో క్వాడ్బైక్ని నడపడం ద్వారా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకున్న ఆమె.. ఆ స్ఫూర్తితో మరిన్ని రికార్డులు నెలకొల్పింది. 2010లో జరిగిన డిజర్ట్ రేస్‌లోనూ ఆమె పాల్గొంది. 2011లో లేహ్-లడఖ్ రహదారిపై తొమ్మిదిరోజుల పాటు ప్రయాణించి రోడ్డు మార్గం ద్వారా అత్యంత ఎత్తయిన ప్రదేశానికి చేరుకొనే ప్రయత్నం చేసిన తొలి దివ్యాంగురాలిగా ప్రపంచ గుర్తింపు సాధించింది. అంతేకాదు ఈ ఫీట్‌తో రెండోసారి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. 2013లో చెన్నై నుంచి దిల్లీ వరకు సుమారుగా 3,278 కి.మీ దూరం ప్రయాణించి.. అత్యధిక దూరం కారు నడిపిన తొలి దివ్యాంగురాలిగా ముమ్మారు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు’ను సైతం ఆమె సొంతం చేసుకుంది.
|
పరిధి మరింత విస్తరించుకుంటూ..
అంగవైకల్యంతో బాధపడుతున్నా చెదరని సంకల్పంతో బైక్, కారు రైడింగ్‌లో తన సత్తా చాటిన దీపా మలిక్ అక్కడే ఆగిపోకుండా తన పరిధిని క్రీడల్లోనూ విస్తరింప చేసుకోవాలనుకుంది. అందుకే ఈతలో నైపుణ్యం సాధించడానికి శిక్షణ తీసుకుంది. బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, ఫ్రీస్టయిల్ విభాగాల్లో తన ప్రతిభ చూపడం ప్రారంభించింది. అంతేకాదు స్విమ్మింగ్‌లోని ఈ మూడు విభాగాల్లో ఆమె జాతీయ రికార్డులు సైతం నెలకొల్పింది. యమునా నదిలో ప్రవాహానికి వ్యతిరేక దిశలో కి.మీ. దూరం మేర ఈది ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో మళ్లీ స్థానం సంపాదించింది. ఓవైపు ఈతలో రాణిస్తూనే మరోవైపు అథ్లెటిక్స్‌లో సైతం శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్‌పుట్‌లో ఆరితేరి తనదైన శైలిలో రాణిస్తూ.. ఈ మూడు విభాగాల్లోనూ జాతీయ స్థాయి రికార్డులు నెలకొల్పింది. 2010లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని ఈ క్రీడల్లో పతకమందుకొన్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లోనూ వరుసగా పతకాలు సాధించింది. తద్వారా ఏషియన్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2018లో దుబాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో జావెలిన్ త్రోలో పసిడి అందుకుని మరోసారి సంచలనం సృష్టించింది దీప. ఈక్రమంలో ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 58 పతకాలు, అంతర్జాతీయ స్థాయిలో 23 పతకాలు అందుకుందీ పారా అథ్లెట్.
|
ఫ్యాషన్‌పై మోజు..!
దీప కొన్నేళ్లపాటు వ్యాపారవేత్తగానూ రాణించింది. 2003 నుంచి 2010 వరకు క్యాటరింగ్, రెస్టరంట్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆ సమయంలో 'స్వావలంబన్' పురస్కారాన్ని సైతం అందుకుందామె. అయితే 2010లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రమంలో శిక్షణ తీసుకోవడానికై తన వ్యాపారాన్ని వదులుకుంది. దీపా మలిక్‌కు ఫ్యాషన్ అంటే అమితమైన ఆసక్తి. కొత్త తరహా ఫ్యాషన్లను అందిపుచ్చుకొని వాటిని అనుసరిస్తూ ఉంటుంది. ర్యాంప్ వాక్ చేయడమన్నా ఆమెకు మక్కువే. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె ఓ అందాల పోటీలో విజేతగా కూడా నిలిచింది. తన వాక్పటిమతో మోటివేషనల్ స్పీకర్‌గానూ రాణించింది. తనలా శరీరం సహకరించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో స్ఫూర్తి నింపడానికి 'వీలింగ్ హ్యాపీనెస్' పేరుతో ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించింది దీప. దీని ద్వారా దివ్యాంగులకు సాయమందించడం, వారికోసం ప్రత్యేకంగా పోటీలు నిర్వహించడం లాంటివి చేస్తుంటుంది. అంతేకాకుండా మంచానికే పరిమితమైన పేదవారికి అవసరమైన పరికరాలను అందిస్తూ చేయూతనందిస్తోంది. ఈ సంస్థ బాధ్యతలను దీప తన ఇద్దరు కూతుళ్లకు అప్పగించింది.
|
సహకరించని శరీరం..
ఇన్ని విజయాలు సాధిస్తున్న దీపకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించదంటే మీరు నమ్మగలరా? గత పదిహేనేళ్లలో మూడుసార్లు వెన్నెముకకు సర్జరీ జరిగింది. దానికి గుర్తుగా ఆమె భుజాల మధ్య 183 కుట్లు ఉంటాయి. ఆమె శరీరంలో చేతులు, మెడ, తల తప్ప ఏ ఇతర భాగాలూ సరిగ్గా పనిచేయవు. ఇలా ఇన్ని ఇబ్బందులున్నా.. ఆమె ఎవ్వరూ సాధించలేనన్ని ఘనతలు అందుకుంది. నడవలేని స్థితిలో మంచానికి పరిమితమైనా క్రీడల్లో రాణిస్తూ.. క్షణం తీరిక లేకున్నా ఏనాడూ తన కూతుళ్లను పెంచడంలో అశ్రద్ధ చేయలేదామె. ఓ దివ్యాంగురాలిగా అపూర్వ విజయాలు సాధిస్తూ వారికి ఆదర్శంగా నిలిచింది. దీప పెద్ద కుమార్తె దేవిక సైతం పారా అథ్లెట్‌గా రాణిస్తోంది. వీరిద్దరూ కలిసి 2014లో జరిగిన చైనా ఓపెన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారు.
|
సాధించిన అవార్డులివే!
శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తూ.. క్రీడారంగానికి దీప చేస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డు(2012)తో సత్కరించింది. 42 ఏళ్ల వయసులో ఈ అవార్డు అందుకొని.. ఈ పురస్కారం స్వీకరించిన అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందిందామె. బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న దీప ఖాతాలో సుమారుగా 25కి పైగా పురస్కారాలున్నాయి. వాటిలో ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్ రత్న(2019), పద్మశ్రీ (2017), ప్రెసిడెంట్ రోల్ మోడల్ ఆఫ్ ఇండియా(2014), డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ ఆసియా ఎక్స్‌లెన్స్ అవార్డు(2014), కరమ్వీర చక్ర (2013), స్త్రీ శక్తి పురస్కార్ (2011), మహారాష్ట్ర ఛత్రపతి అవార్డు (2010), నారీ గౌరవ్ పురస్కార్(2009) ముఖ్యమైనవి.
|
పారా అథ్లెట్ల అభివృద్ధే నా ధ్యేయం!
ప్రస్తుతం గుర్గావ్లో సహాయ కోచ్‌గా పనిచేస్తోన్న దీప తాజాగా క్రియాశీల క్రీడల్లో పాల్గొనని ప్రకటించింది. ఈక్రమంలో భారత పారాలింపిక్ కమిటీ (PCI) అధ్యక్షురాలిగా పూర్తిస్థాయిలో సమర్థంగా పనిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చిందీ లెజెండరీ స్పోర్ట్స్ వుమన్. ‘ఆటకు గుడ్‌బై చెప్పినందుకు చాలా బాధగా ఉంది. నాకెంతో ఇచ్చిన పారా అథ్లెటిక్స్‌కు సేవ చేసే సమయం వచ్చింది. దేశంలో పారా అథ్లెట్ల అభివృద్ధే నా ధ్యేయం’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది దీప.
|
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో ఆటుపోట్లు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లింది దీప. విజయాలు సాధించడానికి వయసు, వైకల్యం అడ్డుకాదని నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. క్రియాశీల క్రీడలకు దూరమైనా భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా మరో ఇన్నింగ్స్ ప్రారంభించనుందీ లెజెండరీ స్పోర్ట్స్ వుమన్. ఈ బాధ్యతను సైతం ఆమె సమర్థంగా నిర్వర్తించి విజయం సాధించాలని మనమూ మనస్ఫూ్ర్తిగా కోరుకుందాం!!ఆల్ ది బెస్ట్ దీపా మలిక్!!
Photo: twitter