వేలల్లో ప్రసవాలు చేసిన చేతులు.. పెద్ద ప్రాణానికి ఏ ముప్పూ రాకుండా కాపాడిన చేతులు.. అడ్డం తిరిగిన బిడ్డనూ అడ్డంకులు అధిగమించి ఈ లోకంలోకి తెచ్చిన చేతులు.. ఈసారి తల్లీబిడ్డలే కాదు.. ఆ వైద్యులూ ఆపదలో ఉన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి శస్త్రచికిత్సకు పూనుకున్నారు. గంటలోపు గండాన్ని దాటి.. శిశువుకు స్వాగతం పలికారు. కొవిడ్ బాధితురాలికి పురుడు పోసి వైద్యుల గొప్పదనాన్ని మరోసారి చాటారు. కరోనా బారినపడిన ఇద్దరు గర్భిణులకు అమ్మదనం ప్రసాదించారు. వారే గాంధీ ఆస్పత్రికి చెందిన వైద్యబృందం. దానికి నేతృత్వం వహించారు గాంధీ ఆస్పత్రి గైనకాలజీ హెచ్ఓడీ, ప్రముఖ వైద్యనిపుణురాలు డాక్టర్ మహాలక్ష్మి. ఈ సందర్భంగా వసుంధర ఆమెను పలకరించింది.
పెద్దలకు కరోనా వస్తే పెనుముప్పు. పిల్లలకు వస్తే పెద్దముప్పు. ఎవరికి వచ్చినా.. ముప్పే! అలాంటి మహమ్మారి గర్భిణికి సోకితేే? అమ్మకాబోతున్న ఆమెకు క్షణక్షణం నరకమే! అలాంటి వారికి చికిత్సనందించే వైద్యులకూ పెను సవాలే! ఈ సవాలును సగర్వంగా స్వీకరించారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. గర్భిణికి ఎలా చికిత్సనందించాలి. పురుడు ఎలా పోయాలి. ఇవే ప్రశ్నలు డాక్టర్ మహాలక్ష్మిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వేల ప్రసవాలు చేసిన అనుభవం ఆమెది. ఏదో గుబులు.. అయినా ధైర్యంగానే ఉంది. సాధిస్తాననే నమ్మకం ఉంది. తెలియందల్లా.. కరోనా బాధితులు పురుడు పోసేటప్పుడు ఎలా స్పందిస్తారు? వారికి ఎలాంటి ఇబ్బందులు రావొచ్చు..? పుట్టిన బిడ్డకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావొచ్చు? అన్నీ స్పష్టమైన జవాబులు లేని ప్రశ్నలే! కొత్తగా సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్నలే!!

ఏ ఇబ్బందీ రాకుండా..
మలక్‌పేటకు చెందిన ఓ మహిళ కరోనాతో మృతిచెందింది. ఆమె కొడుకు, కోడలికి పరీక్ష నిర్వహించారు. కోడలికి పాజిటివ్‌గా తేలింది. అప్పటికే నిండు చూలాలు ఆమె. ప్రసవ సమయం దగ్గరపడింది. కరోనా చికిత్స కోసం ఈ నెల ఏడున గాంధీ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించారు డాక్టర్ మహాలక్ష్మి. ఆలస్యం చేస్తే తల్లికీబిడ్డకీ ప్రమాదమని గ్రహించారు. మర్నాడు సిజేరియన్ చేయాలని నిర్ణయించారు. ‘ఎన్నో కేసులు డీల్ చేసిన అనుభవం నాది. క్లిష్టమైన పరిస్థితులెన్నో చూశా. ఇదివరకెన్నడూ చూడని కేసు ఇది. గర్భిణి ప్రాణాలు కాపాడాలి. బిడ్డనూ దక్కించుకోవాలి. అదే సమయంలో మా వైద్యులకు ఏ ఇబ్బందీ రాకూడదు. కొత్తగా వైద్యం మొదలుపెట్టినప్పుడు ఉన్న అనుభవం మళ్లీ ఎదురైనట్టనిపించింది’ అని చెబుతారు మహాలక్ష్మి. శస్త్రచికిత్సలో పాల్గొనే వైద్యులు, అనస్తీషియా నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. 30 మంది బృందం. వారిలో స్త్రీమూర్తులూ ఉన్నారు.
అనుక్షణం అప్రమత్తం..
ఆపరేషన్ మొదలైంది. థియేటర్ బయట ఎర్ర బుగ్గ వెలిగింది. కరోనా కాలంలో కొవిడ్ బాధితురాలికి ప్రసవం. లోపలా, బయటా అందరిలోనూ ఆసక్తి. వైద్యుల్లో తెలియని ఒత్తిడి. ఎవరూ బయటపడటం లేదు. ముందు జాగ్రత్తలన్నీ పక్కాగా చేసుకున్నారు. గర్భిణి గ్రూప్ రక్తాన్ని అందుబాటులో ఉంచుకున్నారు. అవసరమైన మందులన్నీ తెచ్చి పెట్టారు. శిశువుకు ఏ ఇబ్బంది ఉన్నా.. తక్షణ సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లూ చేసుకున్నారు. వైద్యులు, నర్సులు అందరూ పీపీఈలు ధరించారు. ప్రారంభించడానికి ముందు చిన్న సంఘర్షణ. దాన్ని దాటారు. ‘ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స కొనసాగించాం. ప్రతి దశలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. శస్త్ర చికిత్స గంటపాటు జరిగింది. మా శ్రమ వృథా కాలేదు. మా ఒత్తిడినంతా చిత్తు చేస్తూ పండంటి బాబు కేర్ మన్నాడు. మూడు కిలోల బరువుతో ఈ లోకంలోకి వచ్చాడు. శిశువును ప్రత్యేక వార్డులోకి తర లించి చిన్నారి నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించాం. చిన్నారికి నెగెటివ్ రావడం మా ఆనందాన్ని రెట్టింపు చేసింది. మా బృందంలో డాక్టర్ సంగీత, అనిత, ప్రసన్నలక్ష్మి, అపూర్వ, మృణాళిని, శ్రీలక్ష్మి, అశ్విని, షర్మిల, రాణి వంటి నిపుణులు ఉన్నారు. మా అందరికీ సంతోషమే. కానీ.. ఒకటే బాధ. బిడ్డను తల్లికి దూరంగా ఉంచడం మనసుకు కష్టంగా ఉంది. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ తల్లికి అరుదైన బహుమతి ఇస్తా’మంటున్నారు మహాలక్ష్మి.
పండంటి మగబిడ్డ..
తాజాగా కంటైన్మెంట్ జోన్ బహుదూర్‌పురా నుంచి ఓ గర్భిణి గాంధీ ఆస్పత్రికి వచ్చింది. కరోనా బాధితురాలామె. మర్నాడే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆరోసారి గర్భం దాల్చిన ఆమెకు అత్యంత జాగ్రత్తగా సిజేరియన్ చేశారు వైద్యులు. పండంటి బిడ్డ పుట్టాడు. శిశువును కరోనా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి నమూనాలు పంపించారు.
‘‘చాలామందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. నెల రోజులుగా ఇక్కడ 220 ప్రసవాలు అయ్యాయి. ఇక్కడికి వచ్చిన వారందరికీ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో పరీక్ష నివేదిక రాకముందే డెలివరీ చేయాల్సి వచ్చింది. అందుకే ప్రతి ప్రసవానికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పరీక్ష నివేదిక వచ్చేవరకూ తల్లీబిడ్డలను దూరంగానే ఉంచుతున్నాం’’