Representative Image
రంజాన్ మాసంలో ఉపవాసం (రోజా) పాటించే ముస్లింలు ఎక్కువగా బయట తిరగరు. ఏదైనా అవసరమొచ్చి బయటకు వెళ్లినా త్వరగా పనులు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఈ మాసమంతా ఇంట్లోనో, మసీదులోనో ప్రార్థనలు చేస్తూ, ఖురాన్‌ను పఠిస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో ఉపవాసం పాటిస్తూనే చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది దిల్లీకి చెందిన ఇమ్రాన్సైఫీ. కరోనా తెచ్చిన కష్టకాలంలో తన వంతు బాధ్యతగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇళ్లు, గుళ్లు, మసీదులు, గురుద్వారాల్లో స్వయంగా శానిటైజర్ స్ర్పే చేస్తోంది. ముస్లింలు సంప్రదాయంగా ధరించే బుర్ఖాతోనే పరిసరాలన్నింటినీ పరిశుభ్రం చేస్తోందీ సూపర్‌వుమన్. మరి కరోనా మహమ్మారిపై తనదైన పోరు సాగిస్తున్న ఈ యోధురాలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
మానవతా దృక్పథంతో...
కరోనా ఉత్పాతాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఆయా దేశాధినేతలు ఎప్పటికప్పుడు తమ దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ వారి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు కోట్లాది మంది ప్రజలు ఇంటికే పరిమితమైనా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు కరోనాపై నిరంతర పోరు కొనసాగిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీరితో పాటు కొంతమంది సామాన్య ప్రజలు కూడా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. మానవతా దృక్పథంతో తమకు తోచిన విధంగా సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది ఇమ్రానా. ప్రస్తుతం నార్త్ దిల్లీలో నివాసముంటున్న ఆమె రంజాన్ సందర్భంగా రోజా కూడా పాటిస్తోంది. అయితే మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలంటే ఆసక్తి చూపే ఆమె కరోనా తెచ్చిన ఆపత్కాలంలోనూ ప్రజలకు తన వంతు సహాయం చేయాలనుకుంది. ఈక్రమంలో స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ అందించిన శానిటైజర్ ట్యాంకును భుజాలకు తగిలించుకుని స్ర్పేను పట్టుకుని పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తోంది. తన కాలనీలోని మరో నలుగురు మహిళల సహాయంతో వీధుల్లోని ఇళ్లు, గుళ్లు, మసీదుల్లో శానిటైజర్ పిచికారీ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఏడో తరగతి వరకే చదివినా!
సాధారణంగా అంతో ఇంతో ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇమ్రానా ఆర్థికంగా సంపన్నురాలేమీ కాదు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. లాక్డౌన్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారీ భార్యాభర్తలు. అయితే ఏడో తరగతి వరకు చదువుకున్న ఇమ్రానాకు సమాజంలోని పరిస్థితులపై బాగానే అవగాహన ఉంది. తనవంతు సమాజానికి ఏదో చేయాలన్న తలంపుతో అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. గతంలో దిల్లీలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పెద్ద ఎత్తున హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో గాయపడిన వారిలో చాలామందికి సాయం చేసి తన మంచి మనసును చాటుకుందీ సూపర్ వుమన్.
‘కరోనా వారియర్స్’ టీంతో కలిసి!
కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం దేశ రాజధానిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ మహమ్మారి వేగంగా విస్తరిస్తో్ంది. ఈనేపథ్యంలో వైరస్‌నుంచి ప్రజలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది ఇమ్రానా. ఇందులో భాగంగా తన కాలనీలోని మరో ముగ్గురు మహిళలతో కలిసి ‘కరోనా వారియర్స్’ అనే పేరుతో ఓ టీం ను ఏర్పాటుచేసింది. స్థానికంగా ఉండే ఓ వెల్ఫేర్ అసోసియేషన్ వీరికి శానిటైజర్ ట్యాంకులను సరఫరా చేసింది. వీటిని భుజాన తగిలించుకుని రోజూ సమీప ప్రాంతాలను శానిటైజ్ చేస్తోంది ఇమ్రానా. మానవతా దృక్పథంతో ఆమె చేస్తున్న పనికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ‘కరోనా ఎంతటి ప్రమాదకరమో అందరికీ తెలుసు. ఇక శానిటైజేషన్ డ్రైవ్‌లో భాగంగా నేను గుడులు, గురుద్వారాల్లోకి వెళుతున్నప్పుడు ఎవరూ అడ్డుచెప్పలేదు. మనదేశంలో లౌకికవాదం ఉందనడానికి ఇదే నిదర్శనం. ఏదేమైనా ఈ మహమ్మారి మనమంతా ఒకటేనని, ఎల్లప్పుడూ ఇలాగే కలిసే ఉండాలన్న సందేశాన్ని ఇచ్చింది’ అని చెప్పుకొచ్చింది ఇమ్రానా.
సాధారణంగా ముస్లిం మహిళలు బయట తిరగాలంటే చాలా కట్టుబాట్లు అడ్డొస్తాయి. అయితే మానవత్వానికి, మతానికి సంబంధం లేదంటూ స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది ఇమ్రానా. ఆర్థికంగా సంపన్నురాలు కాకపోయినా మంచి పనులు చేస్తూ సాయానికి స్థాయి అడ్డురాదని నిరూపిస్తోంది. మరి ఆపత్కాలంలో సేవలందిస్తున్న ఇలాంటి కరోనా యోధులందరికీ మనం కూడా ‘హ్యాట్సాఫ్’ చెబుదాం.