2015 క్రికెట్ వరల్డ్ కప్!
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ర్టేలియా, భారత్ జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరుగుతోంది..
భారత క్రికెట్ అభిమానుల ఆశలన్నీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి!
అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్నాడు విరాట్!
ఆ మ్యాచ్‌లో భారత జట్టు 95 పరుగుల తేడాతో ఓటమి పాలైంది..!
భారత ఆటగాళ్ల సమష్టి వైఫల్యమే ఈ పరాజయానికి కారణమని క్రీడా పండితులు కూడా విశ్లేషించారు.
కానీ అనుష్క కారణంగానే కోహ్లీ త్వరగా ఔటయ్యాడని, అందుకే భారత జట్టు పరాజయం మూటగట్టుకుందని చాలామంది ఆమెను ఆడిపోసుకున్నారు. ఈ సందర్భంలోనే కాదు.. కోహ్లీ క్రికెట్లో ఫెయిలయినప్పుడల్లా చాలామంది అనుష్కనే బాధ్యురాలిని చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈక్రమంలో భర్త వైఫల్యానికి భార్యను ఎలా బాధ్యురాలిని చేస్తారు అని ప్రశ్నిస్తోంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.
షోయబ్ మాలిక్ సతీమణిగా తాను కూడా ఇలాంటి నిందారోపణలు ఎదుర్కొన్నానని, మహిళలను బలహీనులుగా భావించడం సరికాదని హితవు పలికింది. భారత జట్టు స్టార్ క్రికెటర్లు స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్ నిర్వహిస్తోన్న ‘డబుల్ ట్రబుల్’ వెబ్ షోకు హాజరైన సానియా.. సమాజంలోని కొన్ని సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది.
అందుకే అలా ‘ట్వీట్’ చేశాను!
2020 మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ర్టేలియా-భారత జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్ర్టేలియా స్టార్ క్రికెటర్ అలీసా హీలీ ఆటను స్వయంగా చూడడానికి ఆమె భర్త, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన మ్యాచ్‌కు డుమ్మా కొట్టి మరీ హాజరయ్యాడు. ఈక్రమంలో సానియా అతడిని ప్రశంసిస్తూ ‘జోరు కా గులాం’ (భార్యా విధేయుడు) అని ట్వీట్ పెట్టింది. తాజాగా ‘డబుల్ ట్రబుల్’ వెబ్ షోకొచ్చిన సానియా ఈ ట్వీట్ వెనకున్న అసలు కథను ఇలా షేర్ చేసుకుంది. ‘భారత ఉపఖండంలో భార్యా విధేయుడిని ‘జోరు కా గులాం’ అంటారు. అందుకే నేను అలా సరదాగా ట్వీట్ చేశాను. ఈ విషయంతో నాకు, అనుష్కా శర్మకు చాలా దగ్గరి సంబంధం ఉంది. సాధారణంగా భర్తలు బాగా ఆడితే.. అది వారి గొప్పతనంగా భావిస్తారు. వారు సరిగ్గా రాణించకపోతే మాత్రం వారి భార్యలను నిందిస్తారు. అసలు ఏ ఆధారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తారో అర్థం కావడం లేదు. సమాజం మహిళలను ఇంకా బలహీనులుగానే భావిస్తోందనడానికి ఇదే నిదర్శనం’- అని చెప్పింది.
అందులో చాలా అర్థం ఉంది!
‘నేను అప్పుడప్పుడు నా భర్త మ్యాచ్‌లు చూడడానికి వెళతాను. ఒకవేళ ఆ మ్యాచ్‌లో మా ఆయన సరిగ్గా ఆడకపోతే నన్ను నానా మాటలు అంటారు. ఇక స్టార్క్ లాగా నేను ఆడే మ్యాచ్‌కు షోయబ్ వస్తే అతడిని కూడా వదిలిపెట్టరు. భార్యకు బానిసగా మారాడంటూ మాట్లాడతారు. అనుష్క దంపతులది కూడా ఇదే పరిస్థితి. అందుకే ఆ సందర్భంలో స్టార్క్‌ను ఉద్దేశిస్తూ అలా ట్వీట్ చేశాను. ఇది మనకు జోక్‌గా అనిపించచ్చు. కానీ అందులో చాలా అర్థం ఉంది’ అని చెప్పుకొచ్చిందీ హైదరాబాదీ ప్లేయర్.
అందుకే టెన్నిస్‌ను ఎంచుకున్నా!
తన కుటుంబ సభ్యులందరికీ క్రికెట్ అంటే ఇష్టమున్నా.. తాను ఇష్టపడి మరీ టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానంటోంది సానియా. ‘మా నాన్న చాలా బాగా క్రికెట్ ఆడతారు. మా అంకుల్‌కు రంజీ ట్రోఫీలో ఆడిన అనుభవం ఉంది. అజహరుద్దీన్ అయితే భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఇక నా భర్త షోయబ్ కూడా క్రికెటర్. అయితే గత పదేళ్లలో క్రీడా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. క్రీడలకు సంబంధించి నా తల్లిదండ్రులు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. చిన్నప్పుడు నాకు రోలర్ స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ అంటే చాలా ఇష్టం. అయితే మిగతా రెండు ఆటలతో పోల్చుకుంటే టెన్నిస్ బాగా ఆడేదాన్ని. అందుకే దానిని కెరీర్‌గా ఎంచుకున్నా’ అని గుదిగుచ్చింది సానియా.
అందుకే హైదరాబాద్ అనుకూలం!
సానియా, పీవీ సింధు, మిథాలీ రాజ్.. భారత్‌లోనే కాదు ప్రపంచ క్రీడా పటంలో ‘హైదరాబాద్’ పేరు పెద్దక్షరాలతో కనిపిస్తుందంటే అందుకు ఈ ముగ్గురే ప్రధాన కారణం. ఈక్రమంలో మిగతా నగరాలతో పోల్చుకుంటే క్రీడలకు సంబంధించి భాగ్యనగరంలో బోలెడు అవకాశాలు ఉన్నాయంటోంది సానియా. ‘నాతో పాటు సింధు, మిథాలీ, సైనా, గోపీచంద్, అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు...ఇలా హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారులందరూ తమ ప్రతిభ ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి కారణం ఏమిటని అడిగితే నా వద్ద ఒక ఫన్నీ థియరీ ఉంది. మిగతా మెట్రో నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ పార్టీలు, ఫంక్షన్లు తక్కువగా ఉంటాయి. ఒకవేళ అలాంటివి ఉన్నా మా దృష్టంతా ఆటపైనే కేంద్రీకరిస్తాం. విరామం అనేది లేకుండా కొన్ని గంటల పాటు టెన్నిస్ కోర్టుల్లో గడుపుతాం. అలాగే చిన్న నగరాల నుంచే ఎక్కువమంది ఛాంపియన్లు రావడానికి ఇదే ముఖ్య కారణం అనుకుంటా’ అని చెప్పుకొచ్చిందీ టెన్నిస్ సెన్సేషన్.
తెల్లవారుజామున 2 గంటలకు!
ఇజాన్‌కు జన్మనిచ్చాక భారీగా బరువు పెరిగింది సానియా. అయితే ఆ తర్వాత కేవలం 4 నెలల్లోనే 26 కేజీలు తగ్గింది. సానియా 2.0గా మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టి ఘనంగా పునరాగమనం చేసింది. ఓ తల్లిగా, క్రీడాకారిణిగా రెండింటినీ సమన్వయం చేసుకోవడంపై ఇలా స్పందించింది.
‘ఇక్కడ మీరు నమ్మినా, నమ్మకపోయినా ఓ విషయం చెప్పాలి. ఇజాన్‌కు జన్మనివ్వడానికి రెండు రోజుల ముందు అనుకుంటా. ఆరోజు తెల్లవారుజామున 2 గంటలకు మెలకువ వచ్చింది. ఎందుకో చాలా అసౌకర్యంగా అనిపించింది. నాన్న, చెల్లి సహాయంతో ఇంట్లోనే టెన్నిస్ కోర్టుకు వెళ్లాను. సుమారు 25 నిమిషాల పాటు టెన్నిస్ బంతితో సాధన చేశాను. అప్పుడే నా మనసు చాలా తేలికపడింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే మహిళా అథ్లెట్లకు మానసిక బలంతో పాటు శారీరక బలం కూడా అధికంగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఇక ఇజాన్‌కు జన్మనిచ్చాక మొదటిసారి ట్రెడ్మిల్ ఎక్కినప్పుడు ఓసారి నా బరువును చెక్ చేసుకున్నా. 89 కిలోలు అని చూపించింది. ఓ క్రీడాకారిణికి అంత బరువు అసలు మంచిది కాదని అప్పుడే అర్థమైంది. అయితే డెలివరీ అయ్యాక ఒకేసారి కష్టసాధ్యమైన ఎక్సర్సైజులు చేయకూడదు. అందుకే బరువు తగ్గేందుకు ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాను. దీంతో పాటు రోజూ రెండున్నర గంటల పాటు స్పెషల్ కార్డియో ఎక్సర్సైజులు చేశాను. ఆరువారాల తర్వాత ఓ ప్రత్యేక ట్రైనర్‌ను నియమించుకున్నా. టెన్నిస్ శిక్షణను కూడా క్రమంగా ప్రారంభించాను. రోజుకు 3 గంటల పాటు టెన్నిస్ కోర్టులోనే గడిపాను. అలా ఇజాన్‌కు జన్మనిచ్చిన ఐదు నెలలకు పూర్తిస్థాయిలో టెన్నిస్ ఆడడం మొదలుపెట్టాను..’ అని చెప్పుకొచ్చిందీ టెన్నిస్ సెన్సేషన్.
‘పీటీ ఉష’ పేరు మాత్రమే వినిపించేది!
ఇక క్రీడల్లో మహిళల ప్రాతినిథ్యం ఇంకా పెరగాలని చెబుతోంది సానియా. ‘నేను టెన్నిస్ ఆడడం మొదలు పెట్టినప్పుడు మహిళల క్రీడల్లో కేవలం పీటీ ఉష పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు మిథాలీ, సింధు, సైనా, సాక్షీ మలిక్, దీపా కర్మాకర్ ఇంకా చాలామంది మహిళా అథ్లెట్ల పేర్లు వినిపిస్తున్నాయి. అప్పటి పరిస్థితులతో పోలిస్తే మనం అభివృద్ధి చెందామని చెప్పడానికి వీరే నిదర్శనం. అయితే మహిళలు స్వతంత్రంగా క్రీడల్ని తమ కెరీర్‌గా ఎంచుకునే స్థాయికి ఎదగాలి. ఈ విషయంలో పురోగతి సాధించినప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది’ అంటూ చక్కటి సందేశం ఇచ్చింది సానియా.