Representative Photo
‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ ఆ భగవత్ స్వరూపులుగా పోల్చారు మన పెద్దలు. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది డాక్టర్లనే. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనాకు పగ్గాలు వేసేందుకు డాక్టర్లు, నర్సులు పడుతోన్న శ్రమను చూస్తుంటే ఈ మాటలు గుర్తుకురాక మానవు. ఆపత్కాలంలో అహర్నిశలూ వైద్య సేవలు అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారీ సూపర్ హీరోస్. ఇక విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ వైద్యులు కూడా కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులకు వూపిరిపోస్తున్నారు. ఈనేపథ్యంలో వైరస్ వ్యతిరేక పోరులో భాగంగా తనవంతు సహాయం చేసేందుకు బ్రిటన్‌కు పయనమవుతోంది బెంగళూరుకు చెందిన డాక్టర్ రూపా వెంకటేశ్. గతంలో అక్కడ వైద్యురాలిగా సేవలందించిన ఆమెకు బ్రిటన్ నుంచి పిలుపు రావడంతో ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రాణాలకు తెగించి మరీ వెళ్లడానికి సిద్ధమవుతోందీ లేడీ డాక్టర్.
మెయిల్ వచ్చిన మరుక్షణమే!
చైనాలోని వుహాన్‌లో ఊపిరిపోసుకున్న కరోనా వైరస్ బ్రిటన్‌కు పీడకలలా పరిణమించింది. ఆ దేశంలో ఇప్పటివరకు సుమారు 30 వేలమంది ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. మరో 2లక్షల మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో అక్కడి వైద్యులు పనిభారంతో సతమతమవుతున్నారు. నిద్రాహారాలు మాని మరీ సేవలందించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దేశంలో లైసెన్స్ ఉన్న వైద్యులందరి సేవలను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఆపత్కాలంలో తమను ఆదుకోవాలంటూ బెంగళూరుకు చెందిన రూపకు కూడా మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసింది బ్రిటన్. గతంలో బ్రిటన్‌లో 15 ఏళ్ల పాటు వైద్యురాలిగా పనిచేసిన ఆమెకు యూకే రెసిడెన్స్ పర్మిట్‌తో పాటు జనరల్ ప్రాక్టీషనర్ లైసెన్స్ కూడా ఉంది. అయితే కరోనా ఉపద్రవంతో ప్రస్తుతం బ్రిటన్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదులుతున్నారు. ఈక్రమంలో వైద్యం చేయడానికి అక్కడి వైద్యులే వెనకడుగు వేస్తున్నారు. కానీ రూప మాత్రం మెయిల్ వచ్చిన మరుక్షణమే ఎలాంటి ఆలోచన లేకుండా బ్రిటన్‌కు వెళ్లేందుకు అంగీకరించింది.
పెద్ద కుమారుడితో కలిసి!
బెంగళూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది రూప. ఆ తర్వాత 2002లో బ్రిటన్ వెళ్లి అక్కడే పీజీ పూర్తి చేసింది. అనంతరం భర్త డాక్టర్ వెంకటేశ్‌తో కలిసి 15 ఏళ్ల పాటు అక్కడే వైద్యురాలిగా స్థిరపడింది. అయితే 2016లో ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో నివాసముంటోన్న రూప.. భర్తతో కలిసి సొంత మెడికల్ క్లినిక్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో తన పెద్ద కుమారుడితో కలిసి ప్రయాణానికి రడీ అవుతోందీ డాక్టరమ్మ. తనతో పాటు తన పెద్ద కుమారుడు కూడా అక్కడ వలంటీర్‌గా పనిచేయనున్నట్లు రూప తెలిపింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.
కఠిన నిర్ణయమే.. కానీ!
గతంలో బ్రిటన్‌లో పనిచేసిన అనుభవం ప్రస్తుతం తనకు అక్కరకు వస్తుందని చెబుతోంది రూప. ‘నేను బ్రిటన్‌లో వైద్యురాలిగా చాలా ఏళ్లు పనిచేశాను. ఈనేపథ్యంలో అక్కడి స్వైన్‌ఫ్లూ రోగులకు స్వయంగా వైద్యం చేశాను. అదేవిధంగా ఇరాన్-ఇరాక్ దేశాల మధ్య జరిగిన కెమికల్ వార్‌లో గాయపడిన క్షతగాత్రులకు కూడా చికిత్స అందించాను. ప్రస్తుతం బ్రిటన్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నాలాంటి అనుభవమున్న వైద్యుల అవసరం కూడా చాలా ఉంది. సమాజ హితం కోసం ఏదైనా ఓ మంచి పని చేయాలన్న ఆలోచన నా మనసులో ఎప్పటినుంచో ఉంది. అది ఇప్పుడు నెరవేరబోతోంది..’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది రూప. కరోనా ఉగ్రరూపంతో బ్రిటన్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ దాకా అక్కడ వైద్య సేవలు అందించేందుకు సమాయత్తమవుతోంది రూప. అత్యవసర సేవల కోసం వెళ్లనున్న ఆమెకు ప్రత్యేక పాస్‌పోర్ట్ కూడా అందించనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈక్రమంలో పాస్‌పోర్ట్ రాగానే తన పెద్ద కుమారుడితో కలిసి బ్రిటన్ బయలుదేరనుందీ డాక్టరమ్మ.
ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా తన వృత్తిధర్మానికే ఓటేస్తూ ఖండాలు దాటడానికి సమాయత్తమవుతోన్న ఈ డాక్టరమ్మ నిర్ణయానికి మనమూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!