ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. చనిపోయింది పిల్లలైతే ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభం కాదు. అలాంటిది 13 ఏళ్లు అపురూపంగా పెంచుకున్న కన్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోతే ఓ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో అసలు వూహించలేం. ఆ బాధ నుంచి కోలుకుని సాధారణ స్థితికి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. అలాంటిది కూతురు మరణించిన రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి విధులకు హాజరైంది ఓ మహిళా హోంగార్డ్. కడుపుకోతను దిగమింగుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూనే కరోనా వైరస్‌పై పోరాడేందుకు సిద్ధమైంది. తన వృత్తి నిబద్ధతతో అందరి మన్ననలు అందుకుంటోన్న ఆ సూపర్ పోలీస్ గురించి మనమూ తెలుసుకుందాం రండి!
పంటి బిగువునే బాధను భరిస్తూ!
కరోనాపై పోరులో భాగంగా డాక్టర్లు, నర్సులు అహర్నిశలూ శ్రమిస్తూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అదే సమయంలో పోలీసులు లాక్డౌన్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తూ మహమ్మారి వ్యాప్తిని అరికడుతున్నారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. ఎండనక – వాననక, పగలూ-రాత్రి అనే తేడాల్లేకుండా రోడ్లమీద గస్తీ కాస్తున్నారు రక్షకభటులు. ఇక ఒడిశాలోనూ ఈ మహమ్మారి మెల్లగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు కుమార్తె మరణించిన రెండు రోజులకే విధుల్లో చేరింది గౌరీ మెహ్రా. ప్రస్తుతం పూరీ జిల్లాలోని పిపిలీ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తోందామె. అయితే ఆమె కూతురు లోపాముద్ర ఇటీవల కాలేయ క్యాన్సర్‌తో పోరాడి చనిపోయింది. సాధారణంగా ఇలాంటి విషాదం నుంచి కోలుకొని మామూలు స్థితికి రావాలంటే చాలా కాలం పడుతుంది. అయితే గౌరి మాత్రం తన ఆవేదనను పంటి బిగువునే దాచుకుంది. ప్రజల శ్రేయస్సు కోసం రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి విధుల్లో చేరింది.
ఆటుపోట్లను ఎదుర్కొంటూ!
ఎవరి జీవితంలోనైనా కష్టసుఖాలనేవి సాధారణం. అమావాస్య చీకటి తర్వాత పున్నమి వెలుగు వచ్చినట్లు.. కష్టం, సుఖం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతుంటాయి. అయితే గౌరి జీవితంలో మాత్రం అమావాస్య చీకటి తప్ప టార్చిలైట్ వేసి వెతికినా ఓ చిన్న వెలుతురు కూడా కనిపించదు. 1998లో ఒడిశా పోలీసు శాఖలో హోంగార్డుగా చేరింది గౌరి. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త కన్నుమూయడంతో కూతురిని తీసుకుని తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. అయితే వారు కూడా మంచాన పడడం, సోదరుడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆ కుటుంబ నిర్వహణ భారమంతా ఆమెపైనే పడింది. అయినా ఉన్నంతలో తన నెలసరి సంపాదనతో కూతురితో పాటు తన కుటుంబాన్ని బాగానే పోషించింది. అలా చీకటి తర్వాత సూర్యకాంతిలా కొద్దికొద్దిగా వారి జీవితాల్లో కూడా సంతోషమనే వెలుగు ప్రసరించింది.
కన్నీళ్లు మిగిల్చిన క్యాన్సర్!
ఈ తరుణంలోనే గతేడాది గౌరి కూతురు లోపాముద్ర కాలేయ క్యాన్సర్ బారిన పడింది. దీంతో ఆ కుటుంబంలో ఉన్న కొద్ది పాటి ఆనందం కూడా ఆవిరైపోయింది. అయినా తన కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే విధులకు హాజరయ్యిందామె. అయితే లాక్డౌన్ విధుల్లో ఉన్న గౌరికి ఇటీవల ఇంటి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘లోపాముద్ర ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది, వెంటనే వచ్చెయ్’ అని ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో వెంటనే తన సైకిల్ మీద మూడు కిలోమీటర్ల దూరంలోనున్న తన ఇంటికి బయలుదేరింది గౌరి. అయితే ఆమె అక్కడకు చేరుకునే సరికే... తన కూతురు తుదిశ్వాస విడిచింది. పదమూడేళ్ల పాటు అపురూపంగా పెంచుకున్న కన్న కూతురు నిర్జీవంగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరైందా తల్లి హృదయం. అయినా దుఃఖాన్ని దిగమింగుకుంటూ, గుండె దిటవు చేసుకుని కుమార్తెకు దహన సంస్కారాలు పూర్తి చేసింది.
ఆమె స్ఫూర్తి అభినందనీయం!
కూతురి మరణం నుంచి పూర్తిగా కోలుకోవడం అనేది ఏ తల్లికీ అంత సులభం కాదు. అయితే గౌరి మాత్రం తన కర్తవ్య దీక్షను పాటిస్తూ రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి విధులకు హాజరైంది. కరోనాపై పోరులో భాగంగా లాక్డౌన్ విధులు నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈక్రమంలో ఆమె వృత్తి నిబద్ధత గురించి తెలుసుకున్న ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. తన బిడ్డ ఇక లేదన్న బాధను దిగమింగుకొని సేవలందిస్తోన్న గౌరి స్ఫూర్తి అభినందనీయం. ఆమె తన వృత్తిధర్మంతో చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఆమె త్యాగం వెలకట్టలేనిది’ అని రాసుకొచ్చారు. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ఆమె సేవలను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కూతురి మరణం కుంగదీసినా ఆ బాధనంతా పంటి బిగువున భరిస్తూ తిరిగి లాఠీ పట్టి కరోనాపై పోరుకు సై అంటోందీ మహిళా హోంగార్డ్. ఆపత్కాలంలో ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ఇలాంటి కరోనా యోధులందరికీ మనమూ ‘హ్యాట్సాఫ్’ చెబుదాం!!