Representative Photo
లాక్డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కార్పొరేట్ కంపెనీలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. దినసరి కార్మికులు, వలస కార్మికులకు ఎలాంటి ఉపాధి పనుల్లేక పూట గడవడమే కష్టంగా మారింది. ఎవరైనా దాతలు ఆహారం అందిస్తే తప్ప కడుపు నింపుకోలేని పరిస్థితి. ఇలాంటి దీన పరిస్థితుల్లో వలస కార్మికుల కళ్ల్లల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చింది దిల్లీకి చెందిన రిచా ప్రశాంత్. దిల్లీలోని ఓ మురికి వాడలో నివాసముంటోన్న 2,300 మంది వలస కార్మికులకు వారి కడుపు నింపుకొనేందుకు అవసరమైన నిత్యావసర సరుకులను అందజేసింది. ఆమె చూపించిన సేవా స్ఫూర్తితో మరికొందరు దాతలు ఆ కార్మికుల కన్నీళ్లు తుడిచేందుకు ముందుకొస్తున్నారు.
కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకొని..
దేశ రాజధాని అయిన దిల్లీకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎన్నో కుటుంబాలు ఉపాధి కోసం వలస వస్తుంటాయి. అయితే మరి తల్లిదండ్రులు పనికి పోతే వారి పిల్లల సంగతేంటి? దిల్లీ మురికివాడల్లో అలాంటి పిల్లలు వేల సంఖ్యలో ఉన్నారు. ఎలాంటి సంరక్షకులు లేకపోతే ఆ పిల్లలు పెడదారి పట్టే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని పదేళ్ల క్రితమే గ్రహించిన రిచా ప్రశాంత్ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంది. ఇందుకోసం హ్యూలెట్-ప్యాకర్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. అనంతరం దిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ‘సునాయ్ ఫౌండేషన్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించింది. ఆమె స్ఫూర్తితో సుమారు వందమంది వలంటీర్లు ఆ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేందుకు ముందుకొచ్చారు. అదేవిధంగా దాతలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. ఆ విరాళాలతో చిన్నారుల కోసం ప్లేస్కూల్ నిర్వహిస్తూ, వారిని పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధం చేస్తోంది. అంతేకాదు.. ఈ క్రమంలో వారికి రెండు పూటలా భోజనం కూడా పెడుతోంది రిచా. పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు అందజేస్తూనే పిల్లల్ని పాఠశాలల్లో చేర్పిస్తోంది. ప్రస్తుతం సుమారు 500 మంది చిన్నారులు ఆమె ప్లేస్కూల్లో ఉన్నారు.
వారిని ఆదుకోవాలని!
కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక దిల్లీలో కూడా పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. రిచాతో పాటు తన సంస్థలో పనిచేస్తోన్న చాలామంది వలంటీర్లు కూడా ఇంటికే పరిమితం కావడంతో ‘సునాయ్ ఫౌండేషన్’ సేవా కార్యక్రమాలకు ఆటంకం ఎదురైంది. మరోవైపు కర్మాగారాలు మూతపడడంతో మురికివాడల్లో నివాసముంటోన్న వలస కార్మికుల జీవితాలు కూడా అధ్వాన్నంగా మారాయి. దీంతో వారి కోసం ఏదైనా సహాయం చేయాలనుకుంది రిచా. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వారికి ఎలాగూ భోజనం అందించే పరిస్థితులు లేవు.. కాబట్టి వారే స్వయంగా వంట చేసుకోవడానికి కావాల్సిన సరుకులను ఆ కుటుంబాలకే అందజేస్తే సరిపోతుందని నిర్ణయించుకుంది.
పిల్లలు పస్తులుండకూడదు!
అనంతరం తన సంస్థలో పనిచేసే కొంతమంది వలంటీర్ల సహాయంతో తన ఆలోచనను వెంటనే ఆచరణలోకి తెచ్చింది రిచా. ఇందులో భాగంగా 2,300 మంది వలస కార్మికుల కుటుంబాలకు కొన్ని రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలతో పాటు సబ్బులు వంటి నిత్యావసరాలను నేరుగా వారి ఇంటి దగ్గరికే వెళ్లి అందజేసింది. ఒక్కో కుటుంబానికి 5 కేజీల గోధుమ రవ్వ, 5 కేజీల బియ్యం, 2 కేజీల పప్పు, 2 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల ఉల్లి, కేజీ ఉప్పు, లీటర్ ఆయిల్, రెండు సబ్బుల చొప్పున ప్యాకింగ్ చేసి సరఫరా చేసింది. ‘లాక్డౌన్ కారణంగా మేం పిల్లలకు ఎలాంటి పాఠాలు చెప్పలేకపోతున్నాం. అయితే ఈ కారణంతో రెండు పూటలా మా దగ్గరే భోజనం చేసే చిన్నారులు పస్తులుండకూడదని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఉపాధి పనులు ఆగిపోవడంతో ఇక్కట్లు పడుతున్న వారి తల్లిదండ్రులకు మా వంతు సహాయం చేయాలనుకున్నాం. అందులో భాగంగానే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అందించాం. ఈ విషయంలో మాకెంతగానో సహకరించిన దిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు. అయితే మేం అందించిన సరుకులతో కొన్ని రోజులు మాత్రమే వారి కడుపు నిండుతుంది. కాబట్టి ఇలాంటి ఆపత్కాలంలో అలాంటి వారిని ఆదుకునేందుకు మరికొందరు దాతలు ముందుకు రావాలి..’ అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు రిచా. ఇలా ఆమె స్ఫూర్తితో దిల్లీలోని రామకృష్ణ మిషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలతో పాటు మరికొందరు దాతలు వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. తమ వంతు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇలాంటి కరోనా కష్ట కాలంలో వలస కార్మికులను తాను ఆదుకోవడంతో పాటు ఈ దిశగా మరింత మందిలో ప్రేరణ కలిగించిన ఈ సూపర్ వుమన్‌కి మనమూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!