చైనాలో పుట్టిన కరోనా ఖండాలు దాటింది. ప్రపంచాన్ని వణికిస్తోంది... కానీ పక్కనే ఉన్న తైవాన్ మాత్రం ఆ మహమ్మారిని సమర్థంగా నిలువరించింది.. కరోనాని కట్టడి చేసి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ విజయంలో దేశ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ది కీలక పాత్ర...
ఈ జనవరిలో తైవాన్లో అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందే చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ ప్రబలిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న త్సాయ్ రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేదు. డిసెంబరు 31నే ప్రపంచ ఆరోగ్య సంస్థకు వుహాన్లో అంటువ్యాధి ప్రబలింది అని స్పష్టంగా సమాచారం అందజేశారు. ఆ సంస్థ చైనాకు భయపడి తైవాన్ మాటలను పెడచెవిన పెట్టింది. డబ్ల్యూహెచ్ఓని నమ్ముకునే బదులు దేశంలోని 2.4 కోట్ల మంది ప్రజల ప్రాణాల బాధ్యత తనదే అని గుర్తెరిగిన త్సాయ్ సత్వర చర్యలు చేపట్టారు. చైనాకు 130 కి.మీ దూరంలోనే ఉండటం.. అక్కడి వారితో స్థానికులకు బంధుత్వాలు ఉండటంతో డిసెంబరు 31 నుంచే చైనా నుంచి వస్తున్న వారిని పరీక్షించడం ప్రారంభించారు. జనవరిలో ఎన్నికలు ముగియగానే మరో అంశం లేకుండా కరోనాపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించారు. సెంట్రల్ ఎపిడమిక్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జనవరి 21న తొలి కరోనా కేసును గుర్తించగానే ఆ వ్యక్తి కాంటాక్ట్ హిస్టరీని వెతికి పట్టుకొని వారిని క్వారంటైన్ చేశారు. ప్రజల శరీర ఉష్ణోగ్రతలను నిత్యం గమనించేలా ఏర్పాట్లు చేశారు. చైనా చెప్పే సమాచారంలో నిజం ఎంతో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్కు బాగా తెలుసు. అందుకే ఆమె ఎవరి మీదా ఆధారపడకుండా సొంత ప్రయత్నాలు ప్రారంభించారు.
గతం నేర్పిన పాఠాలు
2003లో సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) సాప్రపంచాన్ని కుదిపేసినప్పుడు తైవాన్ చిగురుటాకులా వణికిపోయింది. దక్షిణ చైనా, హాంకాంగ్లతోపాటు అప్పుడు అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో తైవాన్ ఒకటి. ఆ సమయంలో లక్షలకొద్దీ జనం హోం క్వారంటైన్లో ఉన్నారు. 181 మంది మృత్యువాత పడ్డారు. సార్స్ కనుమరుగైనా అది మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఆ దేశం మర్చిపోలేదు. అప్పుడే పీపీఈ కిట్ల ప్రాధాన్యం గుర్తించిన తైవాన్ ఈసారి వాటి కొరత రాకుండా ముందే తయారీ కంపెనీలను అప్రమత్తం చేసింది. మాస్కుల ధరలు తగ్గించింది. ప్రతి వ్యక్తి వారానికి రెండు మాస్కులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించారు. దేశంలోని 6,000 డ్రగ్ స్టోర్లలో నేషనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డును చూపిన వారికే వీటిని విక్రయించాలని స్పష్టంగా ఆదేశించారు.
చైనా పర్యటకులపై ఫిబ్రవరి 6న నిషేధం విధించారు. ఈ చర్యలన్నీ ఫలితాన్ని ఇచ్చాయి. ప్రజలను రక్షించుకోవడానికి త్సాయ్ నేతృత్వంలోని సర్కారు 124 రకాల చర్యలను అమలు చేసిందంటే ఆమె ఎంత వేగంగా స్పందించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా చైనాకు అత్యంత సమీపంగా ఉన్నా తైవాన్లో ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు 400 లోపే ఉన్నాయి. కొవిడ్-19ని కట్టడి చేయగానే తైవాన్ ఇతర దేశాలకు మాస్కులను అందించి సాయం చేసింది. సాయం అందుకున్న వాటిలో అమెరికా, ఐరోపాలోని అగ్రదేశాలు ఉన్నాయి. ఉక్కు మహిళ త్సాయ్ గురించి చెప్పుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. అవసరమైతే ఏ దేశాన్నైనా బెదిరించే చైనా ఆటలు త్సాయ్ వద్ద సాగలేదు. ఎంత భయపెట్టినా, ‘తైవాన్ మా దేశంలో అంతర్భాగం’ అని చైనా చెబుతున్నా దాన్ని తైవాన్ ఒప్పుకోవడం లేదు. తన వైఖరికి అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా చైనా పన్నిన ప్రచార కుట్రలను ఛేదించి విజయం సాధించారు. త్సాయ్ ఇంగ్ వెన్ 2016 నుంచి ఆ దేశ అధ్యక్షురాలిగా ఉన్నారు.
Photo: Twitter