సహనానికి నిలువెత్తు రూపం స్త్రీ అంటారు. అందుకే అమ్మయ్యాక కూడా ఇంటి పని, వంట పని, భర్త బాగోగులు చూస్తూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది మహిళ. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ఓ వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే... మరోవైపు ఉద్యోగినిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈక్రమంలో చాలామంది మహిళలు ఎలాంటి పరిస్థితులెదురైనా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు మహిళా కానిస్టేబుల్ అల్కా దేశాయ్. లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో పద్నాలుగు నెలల కూతుర్ని చేతిలో పట్టుకుని మరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారామె. కూతురి క్షేమంతో పాటు వృత్తిధర్మం కూడా తనకు ముఖ్యమేనంటోన్న ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
కూతురిని ఎత్తుకునే డ్యూటీ చేస్తోంది!
అమెరికా, ఇటలీ, ఇంగ్లండ్ లాంటి అగ్రదేశాలను వణికిస్తోన్న కరోనా భారత్‌లోనూ విస్తరిస్తోంది. అయితే ఆ దేశాల కంటే ఇండియా కాస్త మెరుగైన స్థితిలో ఉంది. అందుకు కారణం లాక్డౌన్. మహమ్మారి తీవ్రతను పసిగట్టిన భారత ప్రభుత్వం దేశమంతా పకడ్బందీగా లాక్డౌన్ అమలుచేస్తోది. దీంతో కోట్లాదిమంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్డౌన్ సమర్థంగా అమలుకావడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయం అని చెప్పవచ్చు. వైరస్ వ్యాప్తి మరింత తీవ్రం కాకుండా కంటి మీద కునుకులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మండుటెండల్లో రోడ్లపైనే తింటూ, అహర్నిశలూ గస్తీ కాస్తున్నారు. వైరస్ ముప్పు ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో అల్కా దేశాయ్ కూడా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా వృత్తి ధర్మానికే ప్రాధాన్యమిస్తోంది. ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ర్టంలోని భుజ్ మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది. తనకు జియా అనే 14 నెలల కూతురుంది. ఆమె భర్త గౌతమ్ నరోడా కూడా కానిస్టేబుల్. అతను ప్రస్తుతం భుజ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో ఇంటి దగ్గర పాపను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో కూతురిని తనతో పాటే తెచ్చుకొని డ్యూటీ చేస్తోంది అల్కా దేశాయ్.
అందుకే మాకు తోడెవరూ లేరు!
అల్కా, గౌతమ్లది ప్రేమ వివాహం. చదువుకునే సమయంలో మొదట స్నేహితులుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా చిగురించింది. వెంటనే మూడుముళ్ల బంధంతో ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అయితే కలిసి జీవించాలన్న వారి కోరికను కులం గోడలు అడ్డుకున్నాయి. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో అల్కా కుటుంబీకులు ఈ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. కానీ పెద్దలను ఎదిరించి మరీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారీ లవ్లీ కపుల్.
‘నా కూతురు జియా నిజంగా ఓ యోధురాలు.. ఎందుకంటే తను నా కడుపులో పడినప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. నేను ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు మా సోదరుడి కారణంగా ఎవరికీ కనిపించకుండా రహస్యంగా బతకాల్సి వచ్చింది. హైకోర్టు రక్షణ కల్పించిన తర్వాతే మేం బయటకు వచ్చాం. మా కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక జియా గర్భంలో ఉన్నప్పుడే గౌతమ్ నాన్న కన్నుమూశాడు. కొద్ది రోజులకే వాళ్ల అమ్మ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అందుకే ప్రస్తుతం మాకెవరూ తోడు లేరు. లాక్డౌన్ విధుల్లో భాగంగా నా భర్తకు భుజ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డ్యూటీ కేటాయించారు. ఇంతకుముందు నేను బయటకు వెళ్లాల్సి వస్తే నా కూతురిని నా సహచర ఉద్యోగిణులకు అప్పగించి వెళ్లేదాన్ని. కానీ లాక్డౌన్ కారణంగా ఇప్పుడు వాళ్లందరూ నాతో పాడే రోడ్లమీద విధులు నిర్వహిస్తున్నారు. అందుకే బయట వైరస్ ముప్పు పొంచి ఉన్నా వేరే అవకాశం లేకపోవడంతో జియాను నాతో పాటు తీసుకురావాల్సి వస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేస్తోందీ లేడీ కానిస్టేబుల్.
నా ఆందోళనంతా నా కూతురి గురించే!
రోజూ పొద్దున్నే నిద్ర లేవడం, ఇంటి పని, వంట పని పూర్తిచేయడం, జియాను రడీ చేయడం పది గంటల కల్లా డ్యూటీకి వెళ్లిపోవడం... ఇదీ అల్కా దేశాయ్ దినచర్య. విధి నిర్వహణలో భాగంగా అల్కా మండుటెండల్లో రోడ్లమీద గస్తీ కాస్తుంటే... కారులో బొమ్మలతో ఆడుకోవడమో లేదా పడుకోవడమో చేస్తోంది జియా.
‘దేశానికి సేవ చేయడానికే నేను పోలీస్‌గా పనిచేస్తున్నా. ముఖ్యంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను సెలవులు తీసుకోలేను. అయితే మా ఎస్పీ నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నా పోలీస్ స్టేషన్ సమీపంలోనే నేను విధులు నిర్వర్తించే అవకాశం కల్పించారు. అయినా ప్రజా శ్రేయస్సు కోసం నేను ఎక్కడ పనిచేయడానికైనా సిద్ధం. నా కూతురిని వెంట పెట్టుకునే విధులు నిర్వర్తిస్తాను. అయితే కరోనా భయం నన్ను వెంటాడుతోంది. నాకేమైనా ఫర్వాలేదు. కానీ నా కారణంగా నా ముక్కుపచ్చలారని కూతురికి ఏదైనా అనుకోని అపాయం వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. అందుకే జియాను జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేస్తున్నా. తను ఆడుకునే బొమ్మలు, వస్తువులను కూడా క్లీన్‌గా ఉంచుతున్నా. ఓవైపు పోలీస్‌గా డ్యూటీ చేస్తూనే.. మరోవైపు ఓ అమ్మగా తనను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా’ అని అమ్మ ప్రేమను చాటుతోందీ సూపర్ మామ్.
ఓవైపు పోలీసుగా విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు అమ్మగా తన రెండేళ్ల కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది అల్కా దేశాయ్. ఈ క్రమంలో వృత్తి ధర్మం, అమ్మ ప్రేమను సమన్వయం చేసుకుంటూ కరోనా యోధురాలిగా అందరి మన్ననలూ అందుకుంటోందీ గ్రేట్ కాప్. ఆపత్కాలంలో ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ఇలాంటి తల్లులందరికీ ‘హ్యాట్సాఫ్’!
Image Courtesy: twitter.com/GujaratPolice/