కంటికి కనిపించకుండా ప్రపంచాన్నంతా కలవరపెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా, అత్యాధునిక వైద్య సదుపాయాలుండే ఇటలీ, ధనిక దేశాలైన స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఇక బ్రిటన్‌లోనూ కరోనా జూలు విదుల్చుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మహమ్మారి బారిన పడ్డారంటేనే అక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ దేశ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాన్కాక్, బ్రిటన్ యువరాజు చార్లెస్లకు కూడా ఈ వైరస్ సోకింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటే ఈ ఉపద్రవం నుంచి సులభంగా బయటపడవచ్చని ఇప్పటికే చాలామంది కొవిడ్ బాధితులు తమ స్వీయానుభవంతో నిరూపించారు. తాజాగా తాను కూడా ఈ జాబితాలో ఉన్నానంటోంది బ్రిటన్‌కు చెందిన తోబి అకింగ్‌బాడే. కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న ఈ 28 ఏళ్ల జర్నలిస్టు తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు, ఐసోలేషన్‌లో పడిన బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విట్టర్ వేదికగా సవివరంగా అందరితో పంచుకుంది.
అందుకే మీ ముందుకొచ్చాను!
‘హాయ్..నా పేరు తోబి అకింగ్‌బాడే. నేను యూకేలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా కరోనా సోకిన వ్యక్తిని నేరుగా కలవడంతో నేను కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాను. సుమారు 2 వారాల పాటు ఇంట్లోనే ఉన్నాను. సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి కరోనా నుంచి కోలుకున్నాను. అలా తాజాగా మెట్లు దిగి కిందికి వెళ్లాను. అక్కడి గార్డెన్లో సుదీర్ఘమైన శ్వాస తీసుకున్నా. ఇదొక గుడ్ న్యూస్. ఈ వ్యాధికి సంబంధించి నా అనుభవాలను అందరితో పంచుకుంటే ప్రయోజనముంటుందని భావించాను. అందుకే ఇలా మీ ముందుకొచ్చా. ప్రధానంగా కొవిడ్ టెస్ట్ కిట్ల కొరత కారణంగా వైద్య పరీక్షలు చేయించుకోలేని వారికి నా మాటలు చాలా ఊరటనిస్తాయని ఆశిస్తున్నా..’
నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా!
కొవిడ్ బారిన పడిన తోబి మొత్తం 12 రోజులు ఐసోలేషన్‌లో గడిపింది. ఈక్రమంలో మొత్తం తన రెండు వారాల అనుభవాలను వరుస ట్వీట్ల రూపంలో ఇలా షేర్ చేసుకుంది.
*కరోనా వైరస్ సోకిన వ్యక్తిని కలవడంతోనే నాకు ఈ మహమ్మారి సోకిందని నాకు అర్థమైంది. అయితే ఇది అంతగా భయపడాల్సిన విషయమేమీ కాదని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. ఎందుకైనా మంచిదని సామాజిక దూరం పాటించాలని అప్పుడే ఓ నిర్ణయానికొచ్చా.
* రెండో రోజు విపరీతమైన పొడి దగ్గు ప్రారంభమైంది. ఆరోజు రాత్రంతా దగ్గుతూనే ఉన్నా. 40 సెకన్లకు మించి మాట్లాడలేకపోయాను. నాకు రక్తహీనత ఉండడంతో శరీరం మరింత నిస్సత్తువగా అనిపించింది. తీవ్రమైన అలసటతో బాధపడ్డాను.
* మూడోరోజు ఛాతీలో నొప్పి మొదలైంది. నిద్ర కూడా పట్టలేదు. జ్వరంతో పాటు జలుబు కూడా ప్రారంభమైంది. నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా కష్టమైంది. వీటితో పాటు నా మెడ కండరాలు కూడా పట్టేశాయి.
ఆరోజు చాలా భయమేసింది!
*ఇది చాలా భయంకరమైన రోజు. నాలుగో రోజు నిద్ర లేవగానే నా శరీరంపై నుంచి ట్రక్కు వెళ్లినట్లు, కొండపై నుంచి ఎవరో నన్ను తోసేసినట్లు అనిపించింది. నా ముఖంలోని కండరాల్లో తీవ్ర నొప్పి మొదలైంది. కళ్ల పరిస్థితి కూడా అంతే. చాలా బాధించాయి. ఇక దగ్గు మరింత తీవ్రతరమైంది. ఆ తర్వాత మైగ్రైన్ కూడా వచ్చింది. ఇలా ఒకేసారి జ్వరం, దగ్గు, మైగ్రైన్ రావడంతో శ్వాస తీసుకోవడం మరింత సమస్యగా మారింది. నాకు చాలా భయమేసింది. వెంటనే నేషనల్ హెల్త్ సర్వీస్ అధికారులకు కాల్ చేశాను. వారు నన్ను పరీక్షించి నాకు కరోనా సోకిందని ధ్రువీకరించారు. కొన్ని మందులు కూడా వాడమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు.
ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయేమో!
*మందులు వేసుకోవడంతో ఐదో రోజు బాగా నిద్రపట్టింది. అయితే కళ్లు మాత్రం తీవ్రంగా బాధించాయి. ఫోన్ స్ర్కీన్‌ను చూడడానికి సన్‌గ్లాసెస్ వాడాల్సి వచ్చింది. ఎండ బాగా ఉండడంతో నా మైగ్రైన్ తలనొప్పి మరింత ఎక్కువైంది. ఒళ్లు నొప్పులు కూడా తీవ్రంగా బాధించాయి. శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో ఒకానొక సమయంలో ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయా అనిపించింది.
*ఆరో రోజున ఒళ్లు నొప్పులు తగ్గడం కోసం పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయించాను. కానీ అవి కూడా నా బాధ నుంచి నాకు విముక్తి ప్రసాదించలేకపోయాయి. శ్వాస తీసుకోవడం మరింత కష్టమైంది. కనీసం రెండు సెకన్లు కూడా శ్వాసను బిగబట్టుకోలేకపోయాను. దీంతో నిద్రపోవడానికి కూడా చాలా భయమేసింది.
*తినే ఆహార పదార్థాలను రుచి చూసే సామర్థ్యం కూడా తగ్గిపోయిందని ఏడో రోజు నాకు అర్థమైంది. శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుందని పళ్లు తోముకోవడం కూడా మానేశాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడే నాకు దిక్కనిపించాడు. ఇంత ఘోరమైన చావును ఎందుకు ఇస్తున్నావని ప్రార్థించడం మొదలుపెట్టాను.
వర్క్ ఫ్రం హోం ప్రారంభించాను!
*శ్వాస సంబంధిత సమస్యలను అధిగమించేందుకు ట్విట్టర్ సూచించిన కొన్ని సలహాలను పాటించాను. దీంతో ఎనిమిదో రోజున నా ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైంది. పూర్తిగా కాకపోయినా మైగ్రైన్ కూడా కొద్దిగా తగ్గింది. ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. శరీర ఉష్ణోగ్రత కూడా సాధారణ స్థాయికి చేరుకుంది. దగ్గు నుంచి ఊరట దొరికింది. దీంతో వర్క్ ఫ్రం హోం కూడా ప్రారంభించాను.
*తొమ్మిదో రోజు నుంచి శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోయాయి. వైద్యుల సూచనలు కూడా పాటించడంతో కరోనా లక్షణాలు క్రమక్రమంగా కనుమరుగయ్యాయి. అలా పన్నెండో రోజున పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాను.
*పదమూడో రోజున మెల్లగా మెట్లు దిగి గార్డెన్‌లోకి అడుగుపెట్టాను. దేవునికి కృతజ్ఞతలు చెప్పి తోట చుట్టూ తిరిగాను. చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్న అనుభూతి కలిగింది..’ అని తన అనుభవాలను గుదిగుచ్చిందీ బ్రిటన్ జర్నలిస్ట్.
అలసత్వం వద్దు!
కరోనా నుంచి కోలుకున్న తోబి ఈ మహమ్మారి బారి నుంచి రక్షించుకోవాలంటే మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ‘ఈ వ్యాధి కారణంగా నేను నా జీవితంలో చాలా రోజులను కోల్పోయాను. కానీ చాలామంది ప్రాణాలనే కోల్పో్తున్నారు. కాబట్టి ఈ మహమ్మారిని సరదాగా తీసుకుంటే ప్రాణాలనే హరించే ప్రమాదం ఉంది. అలసత్వ ధోరణి వీడండి. నాకిప్పుడు 28 సంవత్సరాలు. కరోనా నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. అయినా నేను ఇంట్లోనే ఉండి దీనితో పోరాడాను. మీరు కూడా ఇంట్లోనే ఉండి ఈ ఉపద్రవంపై విజయం సాధించండి’ అని రాసుకొచ్చిందీ బ్రిటన్ లేడీ.