సుమారు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ‘నిర్భయ’ దోషులు ఉరికంబం ఎక్కారు. ఆ ఆరుగురు కీచకులకు మరణదండన అమలు కావడంలో నిర్భయ తల్లిదే ప్రధాన పాత్ర. కడుపుకోతను దిగమింగుతూ ఆమె చేసిన అవిశ్రాంత పోరాటం ఫలితంగానే దోషులకు ఉరిశిక్ష పడిందని చెప్పవచ్చు. అయితే ఆమెతో పాటు మరో మహిళ కూడా ఏకధాటిగా ఏడేళ్ల పాటు నల్ల దుస్తులు వేసుకుని మరీ న్యాయం కోసం పోరాడింది. డిఫెన్స్ లాయర్ల ఎత్తుగడలు తిప్పికొడుతూ క్షమించరాని తప్పు చేసిన ఆ మానవ మృగాలకు మరణశాసనం లిఖించింది. ఆ లాయరే సీమా కుష్వాహా. అలా అని అమె ప్రొఫెషనల్ లాయరేమీ కాదు. ట్రెయినీగా ప్రాక్టీస్ చేస్తూనే.. చేపట్టిన తొలి కేసులోనే విజయం సాధించింది. ‘నిర్భయ’కు న్యాయం జరగగడంలో కీలకపాత్ర పోషించి ప్రస్తుతం అందరి అభినందనలు అందుకుంటున్న ఆ ట్రెయినీ లాయర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

ఐఏఎస్ అవ్వాలనుకుని..!
2012లో దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన ‘నిర్భయ’ ఉదంతం అందరినీ కలచివేసింది. ఆడపిల్లల భద్రతపై సందేహాలు రేకేత్తించిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను వెంటనే ఉరితీయాలని దిల్లీలోనూ నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా ఇండియా గేట్, రాష్ర్టపతి భవన్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అలా నిర్భయకు న్యాయం జరగాలని పోరాడిన నిరసన కారుల్లో సీమ కూడా ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నగరానికి చెందిన ఆమె ఆ సమయంలో దిల్లీ యూనివర్సిటీలో న్యాయవాద విద్య అభ్యసిస్తు్న్నారు. అయితే భవిష్యత్‌లో మరే ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగకూడదని నిశ్చయించుకున్న ఆమె.. అందుకోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. అప్పటికే కన్న కూతురిని కోల్పోయి న్యాయం కోసం ఒంటరిగా పోరాడుతోన్న నిర్భయ తల్లికి అండగా నిలవాలనుకుంది. తను అభ్యసించిన న్యాయవాద వృత్తితో నిర్భయకు సరైన న్యాయం చేయాలని అనుకుంది సీమ.
సవాల్‌గా తీసుకుంది!
సాధారణంగా న్యాయవాద వృత్తి అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కోర్టులో తమ వారి తరఫున సమర్థంగా వాదనలు వినిపిస్తూనే.. డిఫెన్స్ లాయర్ల ఎత్తుగడలను తిప్పికొట్టాల్సి ఉంటుంది. అలాంటిది లాయర్‌గా ఎలాంటి అనుభవం లేకున్నా.. కేవలం ఓ ఆడపిల్లకు జరగాల్సిన న్యాయం కోసం ఏడేళ్ల పాటు పోరాటం చేసింది సీమ. 2014లో అధికారికంగా ఈ కేసును స్వీకరించిన సీమ.. దీన్ని ఓ సవాల్‌గా తీసుకుంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించింది. పటియాలా కోర్టు, దిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులలో నిర్భయ తల్లి తరఫున గట్టిగా తన వాదనలు వినిపించింది. ఆమె కారణంగానే మూడేళ్ల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం దోషులకు మరణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
దోషులకు శిక్ష పడేలా!
అయితే కొన్ని కాలం చెల్లిన చట్టాల కారణంగా దోషులు ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకున్నారు. మరణ దండన నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించారు. ఇందులో భాగంగా వారి లాయర్ల సహాయంతో వరుసగా రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజుల్లో అయితే మరిన్ని ఎత్తుగడలు పన్ని అందరూ ఒక్కసారిగా కాకుండా.. ఒక్కొక్కరుగా క్యురేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసి శిక్ష నుంచి తప్పించుకునేందుకు శత విధాలా ప్రయత్నించారు. అలా మూడేళ్లుగా దోషుల మరణ శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. అయితే వారి ప్రయత్నాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిన సీమ న్యాయం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూసింది. నిర్భయ తల్లితో కలిసి అవిశ్రాంతంగా పోరాడుతూ దోషులను ఉరికంబం ఎక్కించింది.

ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు!
ఈ కేసులో భాగంగా నిర్భయ తల్లి ఆశాదేవి వెంట అనుక్షణం ఉంటూ ఆమెకు అండగా నిలిచింది సీమ. ఆమె తరఫున ఏడేళ్ల నుంచి వాదిస్తున్నా లాయర్‌గా కనీసం ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోలేదామె. ఇక నలుగురు దోషుల ఉరితీత అనంతరం సీమ మాట్లాడుతూ.. ‘దేశ రాజధాని దిల్లీలో ఇలాంటి ఘోరం చోటుచేసుకోవడం దారుణం. నిర్భయను కాపాడుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అయితే దోషులకు శిక్ష పడడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ కేసు విచారణ, దర్యాప్తులో భాగంగా నేను చాలా విషయాలు తెలుసుకున్నా. చట్టంలో ఉన్న కొన్ని లోపాలు కూడా అర్థమయ్యాయి. వాటి ద్వారానే దోషులు మూడు సార్లు డెత్ వారెంట్ల నుంచి తప్పించుకోగలిగారు. అయితే వారెన్ని ప్రయత్నాలు చేసినా తమకు విధించిన శిక్ష అమలును కాస్త వాయిదా వేయగలిగారే తప్ప ఇంకేమీ సాధించలేకపోయారు’ అని చెప్పుకొచ్చింది.
అదే నా నెక్ట్స్ కేసు!
* ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీమకు అలహాబాద్ హైకోర్టులో బార్ అసోసియేషన్ మెంబర్‌గా సభ్యత్వం కూడా ఉంది. * 2014లో దిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయవాద వృత్తిలో డిగ్రీ సంపాదించిన ఆమె.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తోంది. * అదే ఏడాది ‘నిర్భయ జ్యోతి లీగల్ ట్రస్టు’లో సభ్యురాలిగా చేరిన ఆమె రేప్ బాధితులకు ఉచితంగా న్యాయ సలహాలు అందించింది. అంతేకాదు వారి తరఫున కోర్టుల్లో వాదించింది కూడా! * ఇక ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రజలకు సేవలందించడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్న ఆమె అందుకోసం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కూడా ప్రిపేరవుతోంది. * నిర్భయ తల్లి తరఫున ఏడేళ్లుగా వాదించిన సీమ ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోలేదు. ‘ఈ ఏడేళ్ల కాలంలో నిర్భయ కుటుంబం నాకెంతో దగ్గరైంది. వారు నన్ను కన్న కూతురిలా చూసుకున్నారు. మరే ఆడపిల్లకూ ఇలాంటి అన్యాయం జరగకూడదన్న కారణంతోనే నేను ఈ కేస్‌ను స్వీకరించాను’ అని చెబుతోందీ లాయర్. * ఇక నిర్భయ మాదిరిగానే గతేడాది చివర్లో బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఓ 11 ఏళ్ల అమ్మాయి హత్యాచారానికి గురైంది. ఆరుగురు వ్యక్తులు ఆ బాలికను దారుణంగా రేప్ చేశారు. అనంతరం గొంతుకోసి చంపేశారు. ఇదే తాను స్వీకరించే తదుపరి కేసు అని.. దాన్ని ఛేదించి బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు రడీ అవుతున్నానని అంటోంది సీమ.
|