నీ కలలో నిజాయతీ ఉంటే..
నీ సంకల్పం బలమైనదైతే ప్రకృతి శక్తులన్నీ ఏకమై దాన్ని నిజం చేస్తాయంటారు...
ఆమెకు భరించడం తెలుసు...
ఆమెకు జయించడం తెలుసు...
ఆమెకు సాధించడం తెలుసు...
మృత్యువు ఎదురుగా నిలుచున్నా సంకల్పాన్ని వదల్లేదు...
ప్రాణాలు కొడిగడుతున్నా పట్టుదలను వీడలేదు..
అందుకే అతి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడింది.
అదే వ్యాధిపై పరిశోధనలకు సమాయత్తమవుతోంది.
ఇది డాక్టర్ గుణశ్వేత కథ..
2006
మీ పాప పేరు..?
గుణశ్వేత...
ఏం చదువుతోంది?
ఇంటర్లో జాయిన్ చేశామండీ...
మీ అమ్మాయికి ఆస్టియోసార్కోమా... అడ్వాన్స్ డ్ స్టేజ్‌లో ఉంది... బతకడం కష్టం...
డాక్టర్ చెప్పిన మాట విన్న ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి..
గుణశ్వేత తండ్రి సత్యసుందర బాబు భారత పత్తి సంస్థలో ఉద్యోగి. తల్లి శ్రీదేవి గృహిణి. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ వారిది. గుణశ్వేత చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేది. బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా రాణించేది. శాస్త్రీయ నృత్యంలో ప్రతిభ చూపేది.
కొద్ది రోజులుగా కాలి నొప్పితో ఆమె విలవిల్లాడుతుంటే పదోతరగతి పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు తగిలిన బల్ల దెబ్బ తీవ్రమైందనుకున్నారు.
కానీ ఆమె శరీరంలో ఇంత తీవ్రమైన వ్యాధి పెరుగుతుందనుకోలేదు. కొంచెంకొంచెంగా తొలిచేసే ఆ క్యాన్సర్ వ్రణం తమ చిట్టి తల్లిని తొలిచేస్తుందని వారు ఊహించనే లేదు. ఇంతలో వైద్యులు మరోమాట చెప్పారు. ఒక పని చేద్దాం ఆ కాలును తొలగించేద్దాం... కీమోతో ప్రయత్నిద్దాం.
తిరిగి క్యాన్సర్ కణితి రాకుండా ఉంటే ఆమె అదృష్టవంతురాలే...
డాక్టర్ చెప్పే మాటలు వారికి మింగుడు పడడం లేదు.. ఏం చేయాలి? బంగారం లాంటి భవిష్యత్తున్న పిల్ల కాలు తొలగించాలా?
మరోవైపు శ్వేత పరిస్థితీ అలాగే ఉంది.. ఇప్పటికే ప్రాణాలు కొడిగడుతున్న దీపంలా ఉన్నాయి. శరీరం దేనికీ సహకరించడం లేదు. నాలుగు అడుగులు వేస్తే ఆయాసం, నీరసం... కీమోథెరపీ చేస్తున్నప్పుడు, కొన్ని మందులు వాడుతున్నప్పుడు కలిగే బాధ కన్నా మరణమే మేలనిపిస్తోంది.
అయినా నేనేం పాపం చేశాను? నేను ఇప్పుడే ఎందుకు చచ్చిపోవాలి? ఆమె మనసంతా ఇవే ఆలోచనలు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుంటే ఆ బాధ మరింత పెరుగుతోంది.
అమ్మా, నాన్నా... ఒకసారి ఇలా రండి... నేను చెప్పేది జాగ్రత్తగా వినండి... డాక్టర్ చెప్పింది నాకర్థమైంది. పోయేది నా కాలే కదా... ప్రాణం కాదు... నా సంకల్పం చాలదూ ఈ వ్యాధిని గెలవడానికి?
ఒక్కకాలు చాలదూ మీ బిడ్డ ఎదగడానికి?
డాక్టర్లను వాళ్ల పని వాళ్లను చేయనివ్వండి...
నాకిష్టమైన బాస్కెట్ బాల్ ఆడలేకపోవచ్చు. శాస్త్రీయ నృత్యం చేయలేకపోవచ్చు... కానీ మీరు గర్వపడేలా ఎదుగుతాను...
నాకీ అవకాశం ఇవ్వండి...
ఇంత చిన్నవయసులో, అదీ మృత్యువు అంచున నుంచి తమ బిడ్డ చెబుతున్న మాటలను వారు కాదనలేకపోయారు...

2020
డాక్టర్ గుణశ్వేత...
ఆమెకు ఇప్పుడు కాలు ఒకటే కావచ్చు...
కానీ ఆమె కలలు ఎంతోమందికి ఊరట కలిగించేవి. ఆమె అక్షరాలా మృత్యువునే జయించింది.
పద్నాలుగేళ్ల క్రితం కబళించే క్యాన్సర్ నుంచి బయపడింది. దీనికోసం ఆమె అంతులేని బాధను ఓర్చుకుంది. సూదులు శరీరాన్ని తూట్లు పొడుస్తున్నా తట్టుకుంది.
కీమో థెరపీ శరీరాన్ని బలహీనం చేస్తున్నా తన కలలను వదల్లేదు. బతకాలనే కోరికను చంపుకోలేదు.
శరీరంతోపాటు మనసునూ దృఢం చేసుకుంది. కాలు తీసేశారనే బాధ దరిచేరనీయకుండా రెట్టింపు ఉత్సాహంతో ఉండడానికి ప్రయత్నించింది.
ఆత్మన్యూనతను జయించేందుకు చదువుపై దృష్టి సారించింది. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తిచేసింది. కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ తన ప్రతిభను కొనసాగించింది. అక్కడ మైక్రోబయాలాజీ పీజీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అదే సమయంలో ఆమె ప్రొఫెసర్ ముంజం శ్రీనివాస్ సూచనతో పీహెచ్డీ పరిశోధనకు దరఖాస్తు చేసుకుంది. అయిదేళ్ల పాటు తెలంగాణ పరిధిలో ‘ఐసోలేటెడ్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్రెష్ వాటర్ సైనో బ్యాక్టీరియా’ అనే అంశంపై పరిశోధన చేసింది. ఇందుకు గానూ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)కింద రెండేళ్ల పాటు నెలకు రూ.25 వేల చొప్పున, మరో మూడేళ్ల పాటు సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(ఎస్ఆర్ఎఫ్) కింద నెలకు రూ.28వేల చొప్పున అందుకుంది.
తాను చేసిన పరిశోధనల్లో క్యాన్సర్ కారకాల గురించి కూడా ఉంది. ఈ పరిశోధనలకు సంబంధించి 350 పేజీల థీసిస్‌ను సమర్పించింది. దానికి ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆమోదం లభించింది. ఇప్పుడు గుణశ్వేత పీహెచ్డీ సాధించిన డాక్టర్. పీహెచ్డీ చదువుకు ప్రభుత్వ ఫెలోషిప్ రావడంతో తల్లిదండ్రులకు నయాపైసా ఖర్చు కాలేదు. ‘క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో అంత బాధాకరమైంది. వైద్యం కూడా అత్యంత ఖరీదైంది. దీనిపై పరిశోధన చేయాలి. క్యాన్సర్ నివారణ విషయంలో ఏదైనా సాధించాలి. నేను పడ్డ బాధ మరెవ్వరికీ రాకుండా చేయగలిగితే నా జీవితానికి సార్థకత లభించినట్లే’ అనే శ్వేత హైలాండ్‌లోని క్యాన్సర్ వ్యాధికారక నియంత్రణ పరిశోధన కేంద్రంలో పోస్టు డాక్టరేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నదైనా తను అనుకున్నది సాధించగలనన్న నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు. నిజమే మరి.. మృత్యువునే జయించిన సంకల్పం ఆమెది.
-ఎం.మణికేశ్వర్, ఆదిలాబాద్