వారు గెలిచారు...
అంతులేని శ్రమతో...
తరగని చిత్తశుద్ధితో...
వారు నిలిచారు
తమ రంగంలో మేటిగా...
అందరికీ స్ఫూర్తిగా...
కలం పట్టినా, హలం పట్టినా, సేవ చేసినా ఉద్యోగం చేసినా, వాణిజ్యంలో రాణించినా, పరిశ్రమలు స్థాపించినా, వారికి వారేసాటి... ఇది ‘ఈనాడు- వసుంధర’ విజేతల ప్రస్థానం.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రామోజీ ఫిలింసిటీలో శనివారం వసుంధర పురస్కారాల వేడుకను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, చిత్రంలో ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ సంచాలకులు అంజనా సిన్హా, సైబరాబాద్ ‘షీ’బృందం డీసీపీ సి.అనసూయ

మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు... ఆహ్లాదకరమైన సంగీత విభావరి... శాంత స్వరూపులైన అమ్మలు.. దుష్టశిక్షణలో శక్తి స్వరూపిణులుగా మారి.. దుర్మార్గులు, అసురులను అంతమొందించిన పురాణ ప్రదర్శనలు...సాధారణ వ్యక్తుల్లా జీవన ప్రయాణాన్ని ప్రారంభించి అసాధారణ విజయాలను సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్న లబ్ధప్రతిష్టులు... ఉల్లాసం, ఉత్సాహం.. కేరింతల నడుమ ప్రపంచ మహిళా దినోత్సవం రామోజీ ఫిలింసిటీలో శనివారం అంగరంగ వైభంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ సంచాలకులు, ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, అతిథిగా సైబరాబాద్ ‘షీ’బృందం డీసీపీ సి.అనసూయ హాజరయ్యారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, వసుంధర పురస్కారాల జ్యూరీ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న, ప్రతిభను ప్రదర్శిస్తున్న మహిళలు.. యువతులు... చిన్నారులకు వసుంధర పురస్కారాలు అందించారు.సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ వేడుకల్లో సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, కళాకారులు, రామోజీ గ్రూప్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలు పాల్గొన్నారు.

మహిళలే ప్రపంచానికి స్ఫూర్తి..

భిన్న నేపథ్యాలు, విభిన్నమైన కుటుంబ పరిస్థితులకు ఎదురొడ్డి ప్రతిభను ప్రదర్శించిన మహిళలే ప్రపంచానికి స్ఫూర్తి. ఆత్మవిశ్వాసంతో ఉన్నతంగా ఎదిగే ప్రతి యువతి, మహిళా సమాజానికి ఆదర్శమే. ఇటీవలి కాలంలో ప్రతిభ ప్రదర్శిస్తున్న యువతులు, మహిళలు వారి పరిసరాలు, పరిస్థితులను అవగాహన చేసుకుని ఎదుగుతున్నవారే. ఒక్కసారి పని ప్రారంభించాక విశ్రమించకుండా వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
- అంజనా సిన్హా ఐపీఎస్, జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ(నిసా) డైరెక్టర్
వినూత్నంగా ఆలోచిస్తున్నారు

మహిళలు, యవతులు, చిన్నారులు తాము ఎంచుకున్న రంగాల్లో విభిన్నంగా ఎదిగేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సాటి మహిళలు, యువతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. కలలో కూడా ఊహించని ఆవిష్కరణలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత విధానాలను కొత్తగా ఆవిష్కరించి బిల్‌గేట్స్ దృష్టిని ఆకర్షించిన వారు ఒకరైతే.. కేవలం రెండు నెలల సాధనలోనే కిలిమంజారో పర్వతాన్ని మరొకరు అధిరోహించారు. కళారంగంలో చాలా మంది ఉన్నా విభిన్నంగా ఆలోచించి ఉన్నతంగా ఎదిగేందుకు నిరంతరం శ్రమిస్తున్నవారు మరి కొందరు, రోగులకు సేవలందించడం వైద్యుల సాధారణ విధులైనా.. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి వారి బాధలను తొలగిస్తున్న వైద్యులు నిజంగా ఆదర్శనీయులు. మా నాన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మేమంతా ఆమె వద్దే ఉన్నాం.‘‘మీరందరూ నా కళ్లెదురుగా ఉన్నా నా నొప్పిని మీరు తీసుకోలేరుగా’’ అన్నారామె. ఆ మాటలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి.
- శైలజా కిరణ్, ఎండీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్
పడిన ప్రతిసారీ పట్టుదలతో...

ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా పడిన ప్రతిసారీ పట్టువదలక తెగువచూపిన మగువలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు .కుటుంబ బాధ్యతలను మనం నిర్వహిస్తున్నా ప్రతి మార్పూ మననుంచేనని ప్రకృతి నమ్మింది. ఎందుకంటే మార్పు మనతోనే సాధ్యం. మనం సాధించిన ఘనతలను గుర్తు చేసుకునేందుకు, మరింత గుర్తింపు పొందేందుకు ఈ మహిళా దినోత్సవం మనకు గొప్ప అవకాశం. అన్ని భాధ్యతలను నిర్వహిస్తునే మరింత ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ వేడుక స్ఫూర్తినింపుతోంది. ప్రతి మహిళ విజయంలో ఆమెకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. విజేతలకు అభినందనలు మీరు చూపిన దారిలో నడవాలి, నడవగలం అనే ప్రతి అమ్మాయి తరఫున కృతజ్ఞతలు.
- సహరి, డైరెక్టర్, ప్రియా ఫుడ్స్
మహిళా సాధికారిత అన్నిరంగాల్లో..

అన్నిరంగాల్లో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో వారిలో నిబిడీకృతమైన శక్తిని వెలికి తీసేందుకు, మహిళలు, యువతుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈనాడు పత్రికలో వసుంధర అనుబంధాన్ని రామోజీరావు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘వసుంధర’ మహిళా వాణిగా కొనసాగుతోంది. వసుంధరను మహిళలకు మరింత చేరువ చేర్చేందుకు గతేడాది నుంచి ‘వసుంధర పురస్కారాల’ను ప్రారంభించాం. విభిన్న రంగాలకు చెందిన వారిని సత్కరిస్తున్నాం.
- బృహతి, ఈటీవీ భారత్ డైరెక్టర్.
2020 - ‘వసుంధర’ పురస్కార గ్రహీతలు

‘వసుంధర’ పురస్కారాల విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలు వీరే




