
అమ్మాయిలకు అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నాం. గౌరవం ఇస్తున్నాం అంటూ ఎన్ని చెప్పుకున్నా..అదంతా నాణానికి ఒకవైపే అంటారు సామాజిక ఉద్యమకారిణి డా.మమతా రఘువీర్. మరోవైపు సమాజాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారిన బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసను రూపుమాపేందుకు ఆమె తరుణి పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.వరంగల్ జిల్లాలో 500 గ్రామాల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలానే మహిళలకు వృత్తివిద్య, స్పోకెన్ ఇంగ్లిష్, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1500 బాల్యవివాహాలను అడ్డుకొని సదరు బాలికల ఉన్నతవిద్యకు సాయమందించారు. సుమారు 4వేల మంది బాలకార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు.
అలానే మహిళలు, బాలలకు న్యాయ సహాయం అందించేందుకు 'నీలా'(నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిస్ట్స్)పేరిట 2015లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. 2011-13 మధ్యకాలంలో వరంగల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అధ్యక్షురాలిగా మమతా రఘువీర్ పనిచేశారు. మహిళలు, బాలలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ నగర పోలీసుశాఖ ప్రారంభించిన 'భరోసా' కేంద్రానికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు.

పనిప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఏర్పాటైన అంతర్గత ఫిర్యాదుల కమిటీల్లో, తెలంగాణా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 1967లో నల్గొండ జిల్లాలో మమతా రఘువీర్ జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు. ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీఏ, ఎల్ఎల్బీ, పీజీ డిప్లొమా ఇన్ రిసోర్స్ మేనేజిమెంట్ పట్టాలు పొందారు. 2003, 2008లో ఉత్తమ సామాజిక కార్యకర్తగా వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి పురస్కారం అందుకున్నారు. 2013లో దూరదర్శన్ 'సప్తగిరి సబలా పురస్కారం' అందజేసింది. 2016, మార్చిలో యూఎస్ కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ వారి 'వుమెన్ ఆఫ్ ది హిస్టరీ మంత్' పురస్కారానికి ఎంపికయ్యారు.