కవి, నిర్మాత డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి మనవరాలు, ప్రఖ్యాత సినీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనయే శ్రీదీప్తి రెడ్డి. పదేళ్లుగా బుల్లి తెరపై వినోదాన్ని పంచుతూ... ఈటీవీతో కలిసి నడుస్తున్నారు. చిన్న వయసులోనే దీప్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఆమె నిర్మాణ సారథ్యంలో ప్రసారమవుతోన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్..
దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న రియాలిటీ షోలు. ఎంతోమంది కళాకారులకు వేదిక పంచడమే కాదు.. వారికి జీవితాల్ని కూడా ఇచ్చారు. దీప్తికి ఇంజినీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరాలా.. ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు చివరికి తండ్రి బాటలోనే అడుగులు వేయాలనుకున్నారు. అలాగని నేరుగా వచ్చేయలేదు. మంజులానాయుడి దగ్గర మూడు నెలలు శిక్షణ పొందారు. ఆ తరువాత స్వయంగా 'శ్రావణ మేఘాలు' అనే సీరియల్‌ని నిర్మించారు.

అక్కడితో ఆగిపోకుండా.. మల్లెమాల సంస్థను.. 'మల్లెమాల టెలీ ఎంటర్ప్రైజెస్'గా బుల్లి తెరకు మరలించారు. అప్పుడే ఈటీవీ ఒకేసారి ఎనిమిది సీరియళ్లను ప్రసారం చేసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకొంది. వాటిలో దీప్తి ఒక సీరియల్ నిర్మించే అవకాశం సొంతం చేసుకున్నారు. అది హిట్టయ్యింది. ఆ కిక్‌తో తనదైన ముద్రతో రియాలిటీ షో చేయాలనుకున్నారు. ఇలా వచ్చిందే 'ఢీ' కార్యక్రమం. ప్రస్తుతం ఢీ 11గా ఈటీవీలో ప్రసారమవుతోంది. ఆ తరువాత 'అదుర్స్' ప్రోగ్రామ్ని ఎనిమిది భాషల్లో తీశారు. దానికి బెస్ట్ ఫీచర్‌గా నంది అవార్డు వచ్చింది. ఈటీవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రసారం చేసే 'స్టార్ మహిళ' బాధ్యతల్నీ దీప్తిరెడ్డి తన భుజాల మీద వేసుకున్నారు. అంతేకాదు ఈటీవీలో అత్యంత ఆదరణ ఉన్న ధారావాహిక 'మనసు మమత' మల్లెమాల నిర్మాణ సంస్థ తరఫున తొమ్మిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది.