ఆమె ప్రసంగం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. యువతరానికి దిశానిర్దేశం చేసి, బాలికల్లో ఆత్మస్త్థెర్యాన్ని నింపగలరు. ఆమే కేజీవీ సరిత. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో అదనపు ఎస్పీగా విధులు చేపడుతూనే, సీఐడీ, మహిళా భద్రతా విభాగానికి ఇన్ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, స్ఫూర్తిని నింపే అంశాలపై సరిత చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమాల్లో అందరి మన్ననలను పొందుతున్నాయి. విద్యార్ధుల్లో స్ఫూర్తి నింపేలా ఇప్పటి వరకు 600కు పైగా ప్రసంగాలిచ్చారు. ఎక్కువగా బాలికలు, యువతుల సమస్యలపై స్పందిస్తారు. వీటి ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం ఈమె ప్రత్యేకత. బాధితులు, సమస్యలున్నవారు సరితను కలిస్తే, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కారం చూపుతారు.

సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసిన సరిత.. ఆ తరువాత ఎమ్మెస్సీ సైకాలజీని కూడా చదివారు. తన వృత్తిలో భాగంగానే మహిళల సమస్యలను తెలుసుకునేందుకు తన చదువు ఎంతో ఉపయోగపడుతోందని చెబుతారీమె. తన ప్రసంగాల్లో అధికంగా పురాణాలు, ఇతిహాసాల్లోని సారాంశాన్ని మిళితం చేసి వాటిని కథల్లాగా విద్యార్థులకు చెబుతారు. ఇవి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేలా ఉంటాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనుసరించాల్సిన జాగ్రత్తలు కూడా తన ప్రసంగాల ద్వారా చెబుతారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సబ్ డివిజనల్ పోలీసు అధికారిణిగా తొలుత బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, బాలికల వసతి గృహాల్లో వందలాది అవగాహన సదస్సులు నిర్వహించారు. అక్కడివారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటికి పరిష్కారాన్ని చూపించేవారు. ఏలూరులో విధులు నిర్వహించేటప్పుడు 'పల్లె నిద్ర' పేరుతో ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో రాత్రిపూట నిద్రించేవారు. పిల్లల సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. అలాగే రవాణా, మహిళాభద్రతపై ప్రసంగించారు. ప్రస్తుతం మహిళాభద్రత విభాగం అధిపతిగా తన వద్దకు సూచనలు, సలహాల కోసం వచ్చేవారికి భరోసా కల్పిస్తున్నారు.
చిన్నారులపై లైంగిక వేధింపుల అంశంపై దిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేశారు. 'డిజిటల్ యుగంలో బాలలపై లైంగిక వేధింపులు' అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏపీ పోలీసు ప్రతినిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎనిమిదో జాతీయ మహిళా పోలీసు సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం తరఫున హాజరై మాట్లాడారు. దీంతోపాటు 'మానవ అక్రమ రవాణా', 'బాలల అదృశ్యం' అంశాలపై దిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. వీరి సమస్యల పైనా పోరాడుతున్నారు.