‘హ్యాపీనెస్ కరిక్యులం’... దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులతో పాటు అమలవుతున్న ఓ స్పెషల్ ప్రోగ్రాం. విద్యార్థుల్లో సృజనాత్మకతను మెరుగుపరిచే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలనిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఈ ‘హ్యాపీనెస్ క్లాస్’ కు హాజరయ్యారు. తరగతి గదుల్లోకి వెళ్లి చిన్నారులతో కలిసి సరదాగా ముచ్చటించిన ఆమె కొద్దిసేపు హ్యాపీనెస్ పాఠాలు విన్నారు. ఇక మెలానియా రాకతో ఆ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది.

బొట్టు పెట్టి స్వాగతం!
పర్యటనలో భాగంగా మొదటి రోజు సబర్మతీ ఆశ్రమం, తాజ్ మహల్‌ను సందర్శించారు ట్రంప్ దంపతులు. ఇక రెండో రోజు మొదట రాజ్‌ఘాట్‌ను సందర్శించిన వారు మహాత్ముడికి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వాణిజ్య చర్చల్లో భాగంగా ట్రంప్ హైదరాబాద్ హౌస్‌కు వెళ్లి ప్రధాని మోదీతో చర్చలు జరపగా, మెలానియా అక్కడి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. దక్షిణ మోతీబాగ్‌లోని సర్వోదయ కో-ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు వచ్చిన ఆమెకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు మెలానియా నుదుట కుంకుమ బొట్టు పెట్టి మంగళ హారతులతో ఆమెను పాఠశాలలోకి ఆహ్వానించారు. ఇక మెలానియాను స్వాగతిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక చిన్నారుల అపూర్వ స్వాగతానికి మురిసిపోయిన మెలానియా చిరునవ్వులు చిందిస్తూ తరగతి గదుల్లోకి అడుగుపెట్టారు. చిన్నారులతో కలిసిపోయి ‘హ్యాపీనెస్’ క్లాసులను విన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలిస్తూ తరగతుల నిర్వహణ గురించి మహిళా టీచర్లను అడిగి తెలుసుకున్నారు.

విద్యా విధానం చాలా బాగుంది!
సుమారు గంటకు పైగానే ఈ పాఠశాలలో ఉన్న మెలానియా అక్కడి విద్యార్థులు, టీచర్లు, సిబ్బందితో కలిసి సరదాగా మాట్లాడారు. ఈక్రమంలో చిన్నారులు స్వయంగా చేపట్టిన పలు ప్రాజెక్టు వర్క్‌లను ఆసక్తిగా గమనించారామె. ఇక శాస్త్రీయ సంగీతం, నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారుల దగ్గరికి వెళ్లి కొద్దిసేపు వారి నృత్యాన్ని తిలకించారు. అనంతరం పాఠశాల ఆవరణలో చిన్నారులు చేస్తున్న సూర్య నమస్కారాలను పరిశీలించి వాటి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రథమ మహిళకు విద్యార్థులు ప్రత్యేకమైన కానుకలు అందజేశారు. చిన్నారులు స్వయంగా గీసిన మధుబనీ పెయింటింగ్స్‌ను మెలానియాకు బహూకరించారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను!
‘నమస్తే.. ఈ అందమైన స్కూల్లో మీ అందర్నీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను. భారత పర్యటన పట్ల అధ్యక్షుడు ట్రంప్, నేను ఎంతో ఆనందిస్తున్నాం. దిల్లీ పాఠశాలల్లో హ్యపీనెస్ తరగతులు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రకృతితో మమేకమై విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం చాలా బాగుంది. విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న బోధకులందరికీ అభినందనలు. ఈ పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, టీచర్లు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. అమెరికాలో నేను కూడా చిన్నారులతో కలిసి ‘బీ బెస్ట్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మాదక ద్రవ్యాల కారణంగా ఎదురయ్యే ప్రమాదాలు, ఆన్లైన్ భద్రత, చిన్నారుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించాను ’ అని చెప్పుకొచ్చారీ అమెరికన్ ఫస్ట్ లేడీ.
మాకెంతో సంతోషం!
దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2018 జులై నుంచే ‘హ్యాపీనెస్’ క్లాసులు అమలవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఈ క్రమంలో మెలానియా పాఠశాల సందర్శనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘దిల్లీ పాఠశాలలోని ‘హ్యాపీనెస్’ క్లాసులను అమెరికా ప్రథమ మహిళ సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, దిల్లీ ప్రజలకు ఇదెంతో గొప్ప రోజు. గత కొన్ని శతాబ్దాలుగా ఇండియా ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను నేర్పింది. ఇప్పుడు అదే ఆనందకరమైన సందేశాన్ని మెలానియా మా పాఠశాల నుంచే తీసుకెళుతున్నారు. ఇది మాకెంతో సంతోషం కలిగించే విషయం ’ అని అందులో రాసుకొచ్చారు కేజ్రీవాల్. ఇక దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా మెలానియా పాఠశాల సందర్శనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పర్యటనకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.
‘హ్యాపీనెస్’ క్లాసులంటే...!

ఎప్పుడూ చదువు... చదువు.. అని వెంటపడే పాఠశాలల్నే చూసుంటాం. కానీ దిల్లీలోని ప్రభుత్వ బడులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. ‘హ్యాపీనెస్ కరిక్యులం’ పేరుతో పిల్లలతో రకరకాల కార్యక్రమాలు చేయిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా ఓ క్లాస్ ఉంటుంది. రెగ్యులర్ తరగతులతో పాటే విద్యార్థులకు ధ్యానం, వీధి నాటకాలు, ఆందోళన-ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం, విధేయతతో మెలగడం వంటి అంశాలను బోధిస్తారు. ఇంకా ఇక్కడి విద్యార్థులు ఏమేం చేస్తారంటే... * మనసును ప్రశాంతంగా మార్చుకోవడం కోసం కొంతసేపు ధ్యానం చేస్తారు. రెండు చేతులను బాగా రుద్దుకొని కళ్లపై పెట్టుకుంటారు. ఆ నిశ్శబ్దంలో ప్రకృతిలో జరిగే మార్పులు గమనిస్తారు. తమ గుండె చప్పుళ్లని వింటారు. శ్వాస మీద ధ్యాస పెడతారు.
 * మనసుకు హద్దులు ఉండవు. అది ఎక్కడికైనా పయనించగలదు. అలా మనసు చెప్పే ఊసులను, మదిలో కలిగే భావాలను ఒక పెన్ను, పేపర్ తీసుకొని కాగితం మీద పెడతారు. వారికి కలుగుతున్న అనుభూతులు రాయడానికి, గీయడానికి ప్రయత్నిస్తారు. * ఏ జంకూ లేకుండా స్నేహితులతో సరదాగా మాట్లాడతారు. కథలు చెప్పుకుంటారు. నాటకాలు వేస్తారు. ఒక అంశంపై మాట్లాడుతూ ఇది ఇలాగే ఎందుకు ఉండాలి?... అలా ఉండకూడదా?... అంటూ చర్చల్లోకి దిగుతారు. ఇవే కాదు.. మరెన్నో ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి.
|
ఒత్తిడి దూరం!
ఈ హ్యాపీనెస్ కరిక్యులం పిల్లల్లో ఉండే ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. బృంద చర్చల ద్వారా ప్రశ్నించడం, శ్రద్ధగా వినడం, వారి భావాలు వివరంగా వ్యక్తపరచడం వంటివి అలవడతాయి. సృజనాత్మకత మెరుగవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్రిటికల్ థింకింగ్, సమస్య సాధన వంటివి తెలుస్తాయి.