‘ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అందరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే...! ‘ఠాగూర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ ఒక్కటి చాలు...డాక్టర్ల గొప్పతనమేంటో చాటి చెప్పడానికి..! ఇక ‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. ప్రస్తుతం చైనాలో కొవిడ్-19(కరోనా) బాధితులకు సేవలందిస్తున్న వైద్యులను, నర్సులను చూస్తే చాలామందికి ఈ మాటలే గుర్తుకువస్తాయి. వృత్తి ధర్మాన్ని దైవంలా భావిస్తూ ప్రాణాంతక వైరస్ను తరిమికొట్టేందుకు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు అక్కడి వైద్య సిబ్బంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సాధారణ నర్సుల వరకూ కంటిమీద కునుకు లేకుండా రాత్రింబవళ్లూ ఆస్పత్రుల్లోనే ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు. ఇక ఈ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటున్నారు అక్కడి నర్సులు. ఈ క్రమంలో తల వెంట్రుకల ద్వారా కూడా ఈ మహమ్మారి సోకుతుందనే కారణంతో తమ శిరోజాలను కూడా తొలగించుకుంటున్నారు.
‘రియల్ హీరోలు’ వీరే!
నల్లగా నిగనిగలాడే కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా మహిళల ముఖ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేసే ఆ శిరోజాలు రాలిపోతుంటే వారి మనసులో రేగే కలవరం మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వైరస్ను తరిమికొట్టే క్రమంలో తమ వెంట్రుకలను తొలగించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు చైనా నర్సులు. పక్కవాళ్లకు కూడా ఈ వైరస్ సోకకూడదనే కారణంతో ఇప్పటికే రోజుల తరబడి చేతికి గ్లౌజులు, శరీరాన్నంతా కప్పి ఉంచేలా ‘ఫుల్ బాడీ సూట్లు’, ముక్కు, నోరుకు అడ్డుగా అధునాతన మాస్కులు ధరిస్తూ సేవలందిస్తున్నారు అక్కడి నర్సులు. దీంతో వీళ్ల ముఖాలపై మాస్క్ అచ్చులు బలంగా పడడం, ఆ ప్రదేశంలో చర్మం ఎర్రగా కందిపోయినట్లుగా తయరవడం మనం కొన్ని ఫొటోల్లో చూసే ఉంటాం. ఇలా నిత్యం రోగుల సేవలో తరిస్తూ ఇప్పటికే ‘రియల్ హీరోలు’ గా పిలిపించుకుంటున్న చైనా నర్సులు ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కురులను సైతం కత్తిరించుకుంటున్నారు.
మరింత సౌకర్యంగా సేవలందించేందుకు!
కొవిడ్-19 బారిన పడి మృత్యవాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వుహాన్ నగరంలో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ను వీలైనంత వరకు అరికట్టాలని భావిస్తున్నారు అక్కడి వైద్యులు. ఈ క్రమంలో తల నుంచి సహజంగా రాలే వెంట్రుకల ద్వారా ఈ వైరస్ విస్తరిస్తుందన్న కారణంతో తమ కురులను సైతం కత్తిరించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు అక్కడి నర్సులు. ఇక విధి నిర్వహణలో భాగంగా వుహాన్కు వెళ్లే నర్సులందరూ తమ శిరోజాలు పూర్తిగా తొలగించుకున్నాకే ఆ నగరంలోకి అడుగుపెడుతున్నారు. అదేవిధంగా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న రోగులకు సరిపడా వైద్య సిబ్బంది ఉండడం లేదు. అదేవిధంగా రోగులకు చికిత్స చేసే సమయంలో వెంట్రుకలు రాలకుండా సేఫ్టీ మాస్క్లు, సూట్లు ధరిస్తున్నారు. చికిత్స అనంతరం ఆ మాస్క్లు తీసేసే సమయం కూడా దొరక్కపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కురులు తీయించుకున్న నర్సులు చెబుతున్నారు. ఈ క్రమంలో తక్కువ సమయంలో ఎక్కువ మంది రోగులకు వేగంగా, మరింత సౌకర్యంగా సేవలందిస్తున్నారీ బ్రేవ్ లేడీస్.
మీ స్ఫూర్తి అందరికీ ఆదర్శం!
కురులను తొలగించుకోవడమే కాకుండా వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత మందికి స్ఫూర్తినిస్తున్నారు చైనా నర్సులు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక చైనా దేశంలోని పలు మీడియా సంస్థలు ఈ వీడియోలను షేర్ చేస్తూ నర్సుల సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ‘ప్రస్తుతం చైనాను కంటికి రెప్పలా కాపాడుతున్న నిజమైన సైనికులు వీరే’ అంటూ వారిని మెచ్చుకుంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఇక నెటిజన్లు కూడా
* ‘ఇది అంటువ్యాధి అని తెలిసినా ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్న ఈ నర్సుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం’.!
*వృత్తి ధర్మాన్ని దైవంలా భావిస్తూ మీరందిస్తున్న సేవలు అద్భుతం!
* ‘జుట్టు కత్తిరించుకుని రోగులకు పెద్ద మనసుతో సేవలందిస్తోన్న మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’.
అని కామెంట్లు పెడుతున్నారు.
డైపర్లతో డ్యూటీ!
కొవిడ్-19 బారిన పడి ఇప్పటివరకు (ఫిబ్రవరి 13)చనిపోయిన వారి సంఖ్య సుమారు 1,115కి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న రోగులు, అనుమానితులతో చైనాలోని ఆస్పత్రులు ముఖ్యంగా వుహాన్ నగరంలోని హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం, అంతకంతకూ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య సిబ్బందికి వూపిరాడడం లేదు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సమయం కూడా దొరకడం లేదు. ఈ క్రమంలో కొందరు వైద్యులు లఘుశంక తీర్చుకునేందుకు వెళ్లలేక డైపర్లు ధరించి డ్యూటీలు చేస్తున్నారు. మరికొందరైతే మూత్రం రాకుండా తక్కువగా నీరు తాగుతున్నారు. వారి సేవా నిరతికి ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే కదూ!
అమ్మా... నిన్ను మిస్సవుతున్నా!
కొవిడ్-19 వైరస్ను కట్టడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ ని ప్రకటించింది. ఇక ఆస్పత్రుల్లో నిరంతర వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కనీసం తమ కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా సమయం దొరకడం లేదు. ఈ క్రమంలో ఓ నర్సు, ఆమె కుమార్తె మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో గుండెల్ని పిండేస్తోంది. చైనా మీడియా విడుదల చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు.
త్వరలోనే కలుస్తాను!
చైనాకు చెందిన లియు హైయూన్ అనే నర్సు హనాన్ ప్రావిన్స్ ఫుగావ్ కౌంటీ ఆస్పత్రిలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తోంది. ఆమె గత పదిరోజుల నుంచి ఇంటికెళ్లకుండా కొవిడ్ రోగులకు సేవలందిస్తున్నారు. దీంతో ఆమెను చూసేందుకు తన తొమ్మిదేళ్ల కూతురు షివెన్ ఆ ఆస్పత్రి దగ్గరకు చేరుకుంది. అయితే అక్కడున్న పరిస్థితుల కారణంగా వారిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి అక్కడి నిబంధనలు అనుమతించవు. వైరస్ సోకే ప్రమాదం ఉందనే కారణంతో ఒకరినొకరు కలుసుకోవడంపైనా నిషేధం ఉండడమే దీనికి కారణం. దీంతో తల్లిని కలుసుకోవాలని వచ్చిన ఆ చిన్నారి ఆ అవకాశం లేకపోవడంతో కన్నీటిపర్యంతమయింది. ‘అమ్మా నిన్ను చాలా మిస్సవుతున్నా’ అంటూ గాలిలోనే హగ్ ఇస్తూ చేతులు ముందుకు చాచింది. ఇక ఆ నర్సు కూడా ‘నేను కొవిడ్ రాక్షసులతో పోరాడుతున్నా..వైరస్ తగ్గగానే ఇంటికి వచ్చేస్తాను’ అని చెప్పి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అనంతరం తల్లి కోసం తీసుకొచ్చిన ఆహారాన్ని అక్కడ ఉంచేసి వెళ్లిపోయింది షివెన్. దాన్ని తల్లి లియా తీసుకుని తిరిగి విధులకు వెళ్లిపోయారు. ఈ వైరస్ను ఎదుర్కొనడానికి డాక్టర్లు, నర్సులు ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనం.