‘విభిన్న మతాలు, జాతులు, ఆచారాలు ఉన్న మన దేశంలో ఆహారపుటలవాట్లూ భిన్నమే. పట్టణీకరణకు దగ్గరవుతున్న కొద్దీ పాశ్చాత్య ఆహారం మన మెనూలో కొత్తగా చేరుతోంది. విదేశీ వంటలు, తయారీ విధానాలను అందిపుచ్చుకుంటున్న మనం.. సంప్రదాయ ఆహారాన్ని మరిచిపోతున్నాం. దాన్ని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేసేందుకే అడవి బాట పట్టాను..’ అంటున్నారు ముంబయికి చెందిన ప్రముఖ చెఫ్ గరిమా అరోరా. సాధించిన అవార్డులు, పొందిన గుర్తింపుతో తన ప్రయాణాన్ని ఆపకుండా నచ్చిన రంగంలో ప్రయోగాలు చేయడానికి అడవుల బాట పట్టి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారామె. ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి పర్యటన మొదలుపెట్టి.. నల్లమలలోని చెంచులు, కోయలు, అదిలాబాద్ గోండుల ఆహారపుటలవాట్లు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ‘అర్బన్ అడ్డా’ పేరుతో ఇటీవలే హైదరాబాద్ వాసులకు ఈ రుచులు, అనుభవాలను పంచేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.
వంటలపై మక్కువతో..!
మాది ముంబయి. అమ్మానాన్న వ్యాపారవేత్తలు. జర్నలిజంలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత వంటలపై ఉన్న ఆసక్తితో ఇటువైపు వచ్చాను. శిక్షణానంతరం ప్రముఖ హోటళ్లలో పనిచేశా. అప్పుడే సంప్రదాయ వంటకాలు కనుమరుగవుతున్నాయనే విషయం అర్థమైంది. 2017లో బ్యాంకాక్‌లో భారతీయ రుచులతో ‘గా’ రెస్టారంట్ ప్రారంభించాను. అప్పటివరకూ పాశ్చాత్య వంటకాలు తినడానికి అలవాటు పడ్డవారంతా ఇటువైపు మళ్లారు. ఇది గుర్తింపునివ్వడమే కాకుండా రెండేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ తొలి 50 రెస్టరంట్ల జాబితాలోకి చేరింది.
అలా నక్షత్రాన్ని అందుకున్నా!
అలాగే ఈ గుర్తింపు కంటే ముందు మిఛెలిన్ గైడ్ సంస్థ నుంచి మిఛెలిన్ స్టార్‌ను అందుకున్నా. ఈ గుర్తింపు పొందడమంటే... అరుదైన గౌరవమే. వంటకాల నాణ్యతతో పాటు, ఆయా రకాల ప్రత్యేకతలను, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అభిప్రాయాలను కూడా పరిశీలించిన తరువాతే మిఛెలిన్ స్టార్‌ను బహూకరిస్తుందా సంస్థ. ఆ గుర్తింపుతోపాటు మిఛెలిన్ స్టార్డ్ రెస్టరంట్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నా. ఈ విజయం నా బృందానికీ చెందుతుంది... ఈ నక్షత్రాన్ని అందుకున్న తొలి మహిళా చెఫ్ నేనేనని గర్వంగా చెబుతా. కానీ ఇవేవీ నాకు సంతృప్తినివ్వలేదు. ‘ఫుడ్ ఫార్వర్డ్ ఇండియా’ పేరుతో దేశంలోని అన్ని ప్రాంతాలూ తిరిగి అక్కడి రుచుల్ని ప్రపంచమంతా చాటాలనుకున్నాను. దానికి ఐరోపా, యూఎస్‌లోని ప్రముఖ పాత్రికేయులు, చెఫ్‌ల సాయం తీసుకున్నాను.
ప్రోత్సహించారు.. పైకొచ్చాను..!
పల్లె రుచులు, సంప్రదాయాల్ని పట్టణవాసులకు అందించాలనే ఉద్దేశంతో ‘అర్బన్ అడ్డా’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొన్నిరోజుల పాటు మారుమూల ప్రాంతాల్లో గడిపి తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియజేస్తున్నాం. గుజరాత్, మహారాష్ట్రల్లోని మారుమూల ప్రాంతాలకూ త్వరలోనే వెళ్లబోతున్నాం. జర్నలిజం చేసి ఈ రంగంలోకి వస్తానంటే అమ్మానాన్నలు అడ్డు చెప్పలేదు సరికదా ఎంతో ప్రోత్సహించారు. ఇలా మనసుకు నచ్చిన పనిచేసే స్వేచ్ఛ ప్రతి ఆడపిల్లకూ ఉండాలి.
ఎన్నో తెలుసుకున్నాం..
చెంచులను కలిసేందుకు వెళ్లినప్పుడు వారి ఆహారపు అలవాట్లు, ఆచారాలు చూసి మొదట్లో చాలా ఆశ్చర్యపోయాను. వారు వంట చేసే పొయ్యిని దేవుడిగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. సహజసిద్ధంగా ఆహారం వండటం, కడక్‌నాథ్ చికెన్, తృణ ధాన్యాలతో కొత్త వంటకాలు తయారుచేయడం మనకెంతో అవసరం. తృణధాన్యాలతో చేసే కుడుములతో పాటు, సహజసిద్ధంగా చెట్టు నుంచి వచ్చే కల్లు, నీరాతో కూడా ప్రత్యేక వంటకాలు చేస్తారు. నెలరోజుల పాటు చెంచులతోనే గడిపాం. ఐరోపా నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ అనుభవాలను డాక్యుమెంటరీ తీశారు. వాళ్లు నేర్పించిన పాఠాల్ని, సంప్రదాయ రుచుల్నీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం.
- అభిసాయి ఇట్ట, ఈనాడు డిజిటల్, హైదరాబాద్