ప్రపంచానికి వెలుగునివ్వడంలో సూర్యుడికి ఎవరూ సహకరించరు. లోలోన తనని తాను దహించుకుంటూ సమస్త జగత్తుకీ వెలుగునిస్తాడు. సాధించాలన్న తపన ఉన్న మనిషి కూడా అంతే. తనలోని తపనను రగిల్చి స్ఫూర్తి అనే కిరణాలను ఇతరులపై ప్రసరింపజేస్తారు. ఇలా ఎందరికో మార్గదర్శకురాలయ్యారు చైనాకు చెందిన లియాంగ్ జున్ అనే మహిళ. మన భారతీయులకు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ చైనీయులకు ఈమె ఆరాధ్యురాలు. చైనాలోని ఒక యువాన్ నోటుని (కరెన్సీ నోటు) చూస్తే ఆమె విలువ ఏపాటిదో తెలుస్తుంది. ఏ పాఠశాలలో ఏ విద్యార్థిని అడిగినా తమ పాఠ్యపుస్తకంలోని ఆమె గొప్పతనాన్ని వల్లెవేస్తారు. అటువంటి ఆమె ఇటీవలే స్వర్గస్తులయ్యారు. మరి 12 ఏళ్లకే ఒక ముసలి జమీందారుకి భార్యగా వెళ్లిన ఆమె అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎలా ఎదిగారు ? తెలుసుకుందాం రండి !

అప్పట్లో అసాధారణమే !
1930 ప్రాంతంలో చాలా దేశాల్లో ఉన్నట్లే చైనాలో కూడా స్త్రీలపై వివక్ష తారస్థాయిలో ఉంది. ఆ సమయంలో స్త్రీలంటే పిల్లల్ని కని ఇంటి పని చూసుకోవడం వరకే పరిమితం అన్నట్లు ఉండేది. ఈక్రమంలో ఎంతో పేదవారైన లియాంగ్ జున్ తల్లిదండ్రులు తమ ఊరి జమీందారుకి లియాంగ్‌ను ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు. అయితే మూడేళ్లు గడిచిన తర్వాత చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి, బాల్య వివాహాల వంటి ఎన్నో దురాచారాలకు ముగింపు పలికింది. ఈక్రమంలో లియాంగ్ వంటి ఎందరో బాలికలకు స్కూల్‌కి వెళ్లే అవకాశం దొరికింది. అయితే స్త్రీలను తక్కువగా చేసి చూసే సంప్రదాయం మటుకు ప్రతి కుటుంబంలో అలానే పాతుకుపోయింది. ఈనేపథ్యంలో బాలికలు చదువుకోవడం అనేది అప్పట్లో అసాధారణంగానే భావించేవారు.

70 విద్యార్థుల్లో ఆమె ఒక్కరే !
ఇలాంటి వాటికి ముగింపు పలకాలనే పెద్ద పెద్ద ఆలోచనలేవీ లియాంగ్కి అప్పట్లో లేవు. కానీ తన తోటి మగపిల్లలకు, ఉపాధ్యాయులకు తాను కూడా చదవగలను, ఏ వృత్తి పనైనా చేయగలను అని నిరూపించాలనుకుంది. ఇందులో భాగంగానే ‘మేంగ్యా టీచింగ్ స్కూల్లో’ చేరి వృత్తి విలువలు, శక్తిమంతమైన మహిళల గురించి చదవడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో నాజీ బలగాలను (హిట్లర్ సైన్యం) ధైర్యంగా ఎదుర్కొన్న సోవియట్ మహిళల గురించి, సోవియట్ సినిమాల్లో మహిళల పాత్రల గురించి తెలుసుకొని మహిళా సాధికారతపై అవగాహన పెంచుకుంది. ఆయా పాత్రల్లో చాలావరకు మహిళలు ట్రాక్టర్ నడుపుతూ కనిపించడంతో లియాంగ్ కూడా ట్రాక్టర్ నడపాలనుకుంది. ఎందుకంటే అప్పటి వరకు చైనాలో ట్రాక్టర్‌ను మగవారు తోలడమే కానీ ఆడవారు దాన్ని ముట్టుకుంది లేదు.
ఈక్రమంలోనే లియాంగ్ నివసిస్తున్న ఊరిలో ట్రాక్టర్ డ్రైవింగ్‌పై కోర్సును మొదలుపెట్టారు అక్కడి ప్రభుత్వ అధికారులు. ఇందులో భాగంగా ప్రతి స్కూల్ నుంచి ముగ్గురు పిల్లలకు అవకాశం కల్పించారు. మేంగ్యా స్కూల్ నుంచి లియాంగ్ కూడా తన పేరు నమోదు చేసుకుంది. అయితే తర్వాత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ కోర్స్ కోసం అధికారులు ఎంచుకున్న 70 మంది విద్యార్థుల్లో లియాంగ్ ఒక్కరే బాలిక !

హీరోయిన్ కాదు హీరో !
సాధారణంగా హీరోయిన్ అనే పదం లింగభేదంలో నుంచి పుట్టింది. చాలామందికి హీరో తర్వాతే హీరోయిన్ అనే భావన ఉంది. అయితే హీరోయిన్లో ‘హీరో'ఇన్ ది ఫీల్డ్’ అనే అర్థం నిగూఢంగా దాగుందని ఎవరూ గ్రహించరు. కానీ చైనా ప్రభుత్వం లియాంగ్‌ను అలానే భావించింది. అందుకే చైనాలో ట్రాక్టర్ నడిపిన మొట్టమొదటి మహిళగా ఆమెకు గుర్తింపునిచ్చి వ్యవసాయ యంత్రసామగ్రి వినియోగంలో శిక్షణ ఇప్పించింది. కేవలం లియాంగ్నే కాదు, ఇలా వివిధ రంగాల్లో ప్రప్రథమ మహిళల్ని గుర్తించి వారికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు వారు మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచేందుకు దోహదపడింది. ఇలా 1950లో చైనాలో మొట్టమొదటి మహిళా ట్రాక్టర్ డ్రైవర్ల బృందం ఏర్పడగా దానికి లియాంగే నాయకత్వం వహించారు. వీరి స్ఫూర్తితో చైనాలో చాలామంది స్త్రీలు వ్యవసాయ రంగంలో రాణించారు, రాణిస్తున్నారు కూడా ! ఇలా రైతుగా, తర్వాత అగ్రికల్చర్ ఇంజినీర్‌గా, ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగానూ తన ఉనికిని దశదిశలా వ్యాపింపజేసిన లియాంగ్ 2020 జనవరి 14న తుది శ్వాస విడిచారు.

నా అంత బాగా ఎవరూ నడపలేరు !
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ట్రాక్టర్ డ్రైవింగ్ గురించి ప్రస్తావించారు లియాంగ్. తనకు వయసు పైబడినా, ట్రాక్టర్ డ్రైవింగ్‌లో ఎంతమంది ఆరితేరినా సరే.. తనంత బాగా ట్రాక్టర్‌ను ఎవరూ నడపలేరని ధీమాగా తెలిపారామె. ఆమె ఆత్మవిశ్వాసం అలాంటిది మరి. అందుకే 1962లోనే ‘వన్ యువాన్’ కరెన్సీ నోటుపై లియాంగ్ ట్రాక్టర్ నడుపుతున్న చిత్రాన్ని ముద్రించింది చైనా ప్రభుత్వం. అంతేకాదు ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చి ప్రతి స్కూల్లో పిల్లలకు బోధించింది. ఆమె జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటుంటారు చైనీయులు. అందుకే ఆమె జీవితం ఆధారంగా చైనాలో చాలా సినిమాలు కూడా రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికీ కొన్ని పాత్రలు ఆమె స్ఫూర్తితోనే రూపుదిద్దుకోవడం విశేషం.
Photos: WEIBO