మనలో చాలామంది వ్యాయామం చేయాలని ఎంతో పట్టుదలతో ఉంటాం. కానీ తీరా మూడు రోజులు గడిచాయో, లేదో.. ఏదో కారణం చెబుతూ వ్యాయామానికి ఫుల్స్టాప్ పెట్టేస్తాం. కానీ ఓ బామ్మ మాత్రం ఏకంగా పదేళ్ల నుంచీ ప్రతిరోజూ ఎక్సర్సైజ్లు చేస్తూనే ఉంది. 72 ఏళ్ల వయసులో జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఔరా అనిపిస్తోంది. అందుకే ఈ బామ్మ ఎక్సర్సైజ్ వీడియోకు ఫిదా అయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తగా ప్రస్తుతం నెట్టింట్లో ఈ బామ్మ హల్చల్ కొనసాగుతోంది. ఇంతకీ ఎవరా బామ్మ? ఆమె కథేంటో తెలుసుకుందామా..?
అమెరికాకు చెందిన ఈ బామ్మ పేరు లారెన్ బ్రజోన్. ఆమె ఒక రిటైర్డ్ టీచర్. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆమె మనసు వ్యాయామంపైకి మళ్లింది. అదీ తన 60 ఏళ్ల వయసులో! అయితే లేటుగానైనా లేటెస్ట్గా ఎక్సర్సైజ్ రొటీన్‌ను ప్రారంభించిందీ బామ్మ. సహజంగా 60 ఏళ్ల వయసులో యోగా లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటారు. కానీ లారెన్ మాత్రం 20 ఏళ్ల వారు కూడా చేయలేని ఎన్నో భారీ కసరత్తులు అలవోకగా చేసేస్తుంది. ఇందుకోసం అమెరికాలోని కరోజా ఫిట్నెస్ సెంటర్లో చేరింది. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే జిమ్‌కు వెళ్లడం, కసరత్తులు చేయడం లారెన్‌కు అలవాటుగా మారిపోయింది. కిలోల కొద్దీ బరువును అలవోకగా ఎత్తేస్తూ, విరామం తీసుకోకుండా డిప్స్ కొడుతూ, యువతకు కూడా సవాల్ విసురుతోందీ బ్రేవ్ బామ్మ.
ఆనంద్ మహీంద్ర ట్వీట్‌తో వైరలైంది!
లారెన్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న క్రమంలో అక్కడున్న వారు ఆమె వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ బామ్మ కసరత్తులు చేస్తోన్న ఓ వీడియో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కంట పడింది. అదే వీడియోను షేర్ చేస్తూ దానికి ఆయన రాసుకొచ్చిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
నిజానికి తొలుత ఈ వీడియోను నాందీ ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ షేర్ చేశారు. అది చూసిన మహీంద్ర మనోజ్‌ను ఉద్దేశిస్తూ... ‘మనోజ్.. మీరు పంచుకున్న ఈ వీడియో చూస్తుంటే నా వ్యాయామ సమయాన్ని ఇంకా పెంచుకోవాలేమో అనిపిస్తుంది.. ఈ ఐరన్ లేడీని చూస్తుంటే వ్యాయామం విషయంలో నాకు నేనే లేజీగా ఫీలవుతున్నా. 72 ఏళ్ల వయసులోనూ ఆమె ఎంతో తేలికగా వ్యాయామాలు చేసేస్తున్నారు. ఈ ఐరన్ లేడీని చూస్తుంటే వ్యాయామం చేయకుండా తప్పించుకోవడానికి మనం చెప్పే సాకులకు స్వస్తి పలకడం అవసరమేమో అనిపిస్తుంది..’ అంటూ బామ్మను ప్రశంసల్లో ముంచెత్తారు ఆనంద్. ఇలా వైరల్‌గా మారిన ఈ బామ్మ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు.. ‘బామ్మా.. నువ్వు నిజంగా గ్రేట్’, ‘నీకు హ్యాట్సాఫ్’.. అంటూ ఈ గ్రానీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత లేటు వయసులోనూ పట్టుదలతో కసరత్తులు చేస్తున్న ఈ బామ్మ నిజంగానే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.