ఆ ఇంట్లో బామ్మ ఒంటరిగా ఉంది. చడీ చప్పుడు కాకుండా వెళ్లి ఆమెను బెదిరించి ఇళ్లంతా దోచుకుంటే.. ఇక పండగే అనుకున్నాడు ఓ దొంగ. అయితే తర్వాత అనిపించింది అతడికి.. ఆమె ఇంట్లో మరొక్క క్షణం ఉండడం కంటే అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్లడం ఎంతో ముఖ్యమని ! ఎనభై ఏళ్లకు మంచి నీళ్ల గ్లాసును ఎత్తడం కష్టంగా ఉండే బామ్మలను చూసిన అతడికి, అసలు సిసలైన బామ్మ కనిపించడంతో... ఈ బామ్మ మామూలు బామ్మ కాదు బాబోయ్ ! అంటూ దండం పెట్టేశాడు. రవితేజ ‘రాజా ది గ్రేట్’లో ‘ఐయామ్ బ్లైండ్.. బట్ ఐయామ్ ట్రెయిన్డ్’ అంటూ రౌడీలను ఓ దుమ్ము దులిపినట్లు ‘ఐయామ్ ఓల్డ్.. బట్ ఐయామ్ టఫ్’ అంటోంది ఈ బామ్మ. అందుకే స్థానికుల దగ్గర నుంచి పోలీసుల వరకూ ‘బామ్మ.. ది గ్రేట్’ అంటున్నారు. ఇంతకీ ఈ బామ్మ ఏం చేసిందంటే.. !
పేరుకి అమెరికా అన్నట్లే కానీ చీకటి పడితే ఎప్పుడు ఎట్నుంచి ఏ దొంగ వస్తాడో అనే భయం చాలామంది అమెరికన్లకు సాధారణమైపోయింది ఈరోజుల్లో. అక్కడ తుపాకీ చాలా ఈజీగా దొరుకుతుండడంతో ఎవరి ఇంట్లో పడితే వారి ఇంట్లోకి చొరబడి దొంగలు దోచుకోవాలని చూస్తున్నారు. ఈక్రమంలో ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడానికి కూడా వెనకాడట్లేదు. అయితే 82 ఏళ్ల విల్లీ మర్ఫీ అనే బామ్మ దగ్గర ఇలాంటి వేషాలు సాగవు. ఎందుకంటే ఆమె ‘వరల్డ్ న్యాచురల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ లిఫ్టర్ ఆఫ్ ది ఇయర్ 2014’ ! గతంలో ఆమె వయసు వారు వెయిట్ లిఫ్టింగ్‌లో చరిత్ర సృష్టించిన దాఖలాలు లేకపోవడంతో ‘వరల్డ్ న్యాచురల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్’ ఆమె వయసు మీద ప్రత్యేకంగా ఓ మైలురాయిని సృష్టించింది. అలా ఒకరి రికార్డ్‌ను ఆమె బ్రేక్ చేయడం కాకుండా.. తానే ఒక రికార్డ్‌గా మారిన మహిళ విల్లీ. వయసును బట్టి ఈమెను బామ్మ అనాల్సి వస్తోంది తప్ప, పాతికేళ్ల కుర్రాళ్లు నలుగురు కలిసి ఒకేసారి వచ్చినా ఒంటి చేత్తో వారిని ఓడించగల సత్తా విల్లీది. ఈ విషయం తెలియక ఆ దొంగ విల్లీ ఇంట్లో చొరబడ్డాడు.
మొదట అంబులెన్స్‌కి ఫోన్ చేయాలని విల్లీని డోర్ తీయమన్నాడు సదరు దొంగ. అయితే ఆమెకు సందేహం వచ్చి పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో బలవంతంగా డోర్ పగలగొట్టి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అంతే.. పక్కనే ఉన్న చెక్క బల్లను తీసుకొని అమాంతం అతడి మీద ఎత్తేసింది విల్లీ. అది విరిగే వరకూ అతడిని కొట్టింది. తర్వాత షాంపూ తీసుకొచ్చి అతడి కళ్లల్లో పోసింది. మూలకున్న కర్ర చీపురు తీసుకొని చితకబాదింది. చివరికి ఎంటరైన పోలీసులు అతడి దుస్థితి చూసి అంబులెన్స్‌ను పిలిపించడంతో సదరు దొంగ ఊపిరి పీల్చుకున్నాడు. దొంగతనం నెపంతో ఏ అంబులెన్స్‌కి అయితే అతడు ఫోన్ చేయాలన్నాడో అదే అంబులెన్స్ అతడిని విల్లీ నుంచి కాపాడింది.
బామ్మ సాహసానికి మెచ్చిన న్యూయార్క్ పోలీసులు ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు. ఈ వార్త సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవడంతో నెటిజన్లు కూడా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ ఆమెను ఇప్పుడే ఇంటర్వ్యూ చేయాలని ఉందంటే.. మరొక నెటిజన్ తనకు 80 ఏళ్లు వచ్చినా ఆ బామ్మలా.. ఫిట్‌గా, చురుగ్గా ఉండాలని ఉందనీ.. కానీ టేబుల్ విరగ్గొట్టే పరిస్థితి మటుకు రాకూడదనీ చమత్కరించారు. ఇక రోజూ తన వయసుకు రెండింతల బరువుతో వెయిట్ లిఫ్టింగ్ చేసే విల్లీ సదరు దొంగ కాస్త ఎక్కువ బరువున్నాడని తెలిపింది. అయితేనేం.. ఒంటి చేత్తో ఎన్నో చిన్ అప్స్, పుషప్స్ తీయగల సామర్థ్యమున్న తాను.. ఆ దొంగను కోరుకున్న చోటికి (ఆసుపత్రి) పంపినందుకు సంతోషంగా ఉందని చమత్కరించింది.
Photos: Screengrab