Image for Representation
అమ్మతనం అనేది ప్రతి మహిళకూ ఓ వరం. నవమాసాలు మోసి కన్న బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే ఆ తల్లి ఆనందంతో పరవశించిపోతుంది.. సిజేరియన్ నొప్పుల్ని కూడా మరచి తన పాపాయిని చూస్తూనే మైమరచిపోతుంది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ కూడా ఇటీవలే కవలలకు జన్మనిచ్చి అమ్మతనంలోకి అడుగుపెట్టింది. తన ఇద్దరు చిన్నారుల్ని చూస్తూ పట్టరానంత సంతోషంలో తేలియాడుతున్న ఆ తల్లికి అంతలోనే అధిక రక్తస్రావం కావడం మొదలైంది. ఇక డాక్టర్లు మళ్లీ ఆమెకు సర్జరీ చేసి ఆమె గర్భాశయాన్ని తొలగించడానికి సిద్ధమయ్యారు.. ఆ మరుక్షణమే అక్కడున్న ఓ నర్సుకొచ్చిన ఆలోచన.. ఆ తల్లిని సర్జరీ లేకుండానే గండం నుంచి గట్టెక్కించింది. శెభాష్ అంటూ అక్కడున్న వైద్యుల ప్రశంసలు ఆమెకు దక్కేలా చేసింది. మరి, ఇంతకీ ఎవరా నర్సు? ఆమెకొచ్చిన ఆలోచనేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవలే ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి ఇద్దరు కవల పిల్లల్ని బయటికి తీశారు. తన ఇద్దరు చిన్నారుల్ని చూస్తూ మురిసిపోతున్న ఆ తల్లికి అంతలోనే మరో సమస్య ఎదురైంది. సాధారణంగా సిజేరియన్ తర్వాత బ్లీడింగ్ కావడం అనేది సహజంగా జరిగేదే. అయితే అది సాధారణ స్థాయిలో ఉంటే ప్రమాదమేమీ ఉండకపోవచ్చు.. కానీ ఆగకుండా రక్తస్రావం అయితే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే! ఇలాంటి అసహజ రక్తస్రావం బారిన పడిందా తల్లి. ఏం చేసినా బ్లీడింగ్ ఆగకపోవడంతో ఇక మరోసారి ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించాలని నిర్ణయించుకున్నారు అక్కడి వైద్యులు.

ఆ పాఠం ఇప్పుడు పనికొచ్చింది!
అంతలోనే అక్కడున్న నైనేశ్వరీ ఘోడ్కే అనే నర్సుకు తాను నర్సింగ్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్న ఓ విషయం గుర్తొచ్చింది. అదేంటంటే.. పసిపిల్లలకు తల్లిపాలు తాగిస్తే రక్తస్రావం అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని! అనుకున్నదే తడవుగా తన ఆలోచనను అక్కడున్న వైద్యులతో పంచుకోవడంతో పాటు ఆ పాపాయిలకు తల్లిపాలు పట్టించింది. దీంతో కాసేపటికే ఆ కవల పిల్లల తల్లికి బ్లీడింగ్ ఆగిపోవడంతో అక్కడున్న వారంతా నర్సు సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. అలా ఆ తల్లికి అనవసరంగా మరో ఆపరేషన్ కాకుండా ఆపిందా నర్సు.
‘నేను నర్సింగ్ చదివేటప్పుడు ట్రైనింగ్‌లో భాగంగా చెప్పిన ఈ విషయం నాకు ఇప్పుడు సడన్‌గా గుర్తొచ్చింది. అదే ఇప్పుడు పనికొచ్చింది.. ఏదైతేనేం.. తల్లిపాలు పట్టడం వల్ల అసహజ రక్తస్రావం ఆగింది..’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది నైనేశ్వరి. ఆమెకు నర్సుగా 11 ఏళ్ల అనుభవం ఉంది.

ఆ హార్మోన్ వల్లే!
ప్రసవం తర్వాత తల్లి పిల్లలకు పాలు పట్టినంత కాలం పిరియడ్స్ రావన్న విషయం మనకు తెలిసిందే! అయితే ఇలా బిడ్డకు పాలు పట్టే క్రమంలో తల్లి రక్తంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.. ఇది రక్తస్రావం కాకుండా ఆపుతుందని, వైద్య పరంగా ఇది నిరూపితమైందని చెబుతున్నారు అక్కడి వైద్యనిపుణులు. ‘ఇదొక మెడికల్ ఫ్యాక్ట్. దీని గురించి మా అందరికీ తెలిసినా సమయానికి దీన్ని ఆచరణలో పెట్టలేకపోయాం. కానీ నర్సు తన సమయస్ఫూర్తితో ఈ సమస్యను పరిష్కరించింది. ఆ తల్లికి మరో ఆపరేషన్ కాకుండా కాపాడింది..’ అంటూ నర్స్ చేసిన ఆలోచనపై అక్కడి వైద్యులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలా అయితే నిర్లక్ష్యం చేయద్దు!
సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా మొదటి పది రోజుల పాటు అధికంగా రక్తస్రావం కావడం సహజమే. ఇక నాలుగు నుంచి ఆరు వారాల దాకా తక్కువ బ్లీడింగ్ లేదా స్పాటింగ్ అవుతుందంటున్నారు నిపుణులు. కానీ ప్రసవం అయ్యాక మరీ ఎక్కువగా అంటే గంటగంటకూ శానిటరీ న్యాప్కిన్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు వైద్యులు. అలాగే గడ్డల్లాగా, ఒక ధారలాగా బ్లీడింగ్ అయినా ప్రమాదమే అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
|