‘డ్యాన్స్ అంటే కాలు కదపడం, శరీరాన్ని షేక్ చేయడం కాదు.. అది మన అణువణువునా నిండి ఉండాలి.. దాన్ని మన నరనరాన జీర్ణించుకోవాలి..’ అనేవారు బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్. డ్యాన్స్‌నే ఊపిరిగా భావించి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె.. కొన్ని వేల పాటలకు కొరియోగ్రఫీ చేసి ‘మదర్ ఆఫ్ డ్యాన్స్’గా, ‘మాస్టర్ జీ’గా పేరు సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈ సుప్రసిద్ధ నృత్య కళాకారిణి నేడు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సరోజ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తన శిక్షణలో ఆరితేరిన బాలీవుడ్ తారల దగ్గర్నుంచి ఎందరో సినీ ప్రముఖుల వరకు ఆమెతో పనిచేసిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ డ్యాన్స్ మాస్టర్‌కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
మాధురీ దీక్షిత్
ఈ చేదు వార్తతో నా మనసు ముక్కలైంది. నా నోట మాట రావట్లేదు. నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సరోజ్ జీ నా బాలీవుడ్ జర్నీలో ఓ కీలక భాగమయ్యారు. కేవలం డ్యాన్స్ ఒక్కటే కాదు.. ఆమె నాకు ఎన్నో విషయాలు నేర్పారు. ఆమె ఇక లేరన్న వార్త విని నా మనసులో ఎన్నెన్నో జ్ఞాపకాలు మెదులుతున్నాయి. నన్ను నేను కోల్పోయానన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
శిల్పా శెట్టి
ఓ లెజెండ్ మనల్ని వదిలి వెళ్లిపోయారు. సరోజ్ జీ మిమ్మల్ని మొదటిసారి కలిసిన క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను అప్పటికే మీకు వీరాభిమానిని. బాజీగర్ సినిమాలోని ‘కితాబే’ పాటకు కొరియోగ్రఫీ చేయడంలో భాగంగా మీరు తొలిసారి నా ముందుకొచ్చి నిల్చున్నప్పుడు నా ఆనందం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఏడ్చేశాను. నా ముందుంది మీరేనా అని ఆ క్షణం నమ్మలేకపోయాను. ఆ తర్వాత ‘చురాకే దిల్’ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అది నా కెరీర్లోనే మైలురాయిగా మిగిలిపోయింది. అలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. డ్యాన్స్ చేసేటప్పుడు హావభావాలు పలికించడం.. వంటి ఎన్నో విషయాలు నాకు నేర్పించారు. మీలాంటి మహిళ మీరొక్కరే.. మీరే ది బెస్ట్.. మిమ్మల్ని చాలా మిస్సవుతాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. మీరు లేరన్న చేదు విషయాన్ని జీర్ణించుకొని ధైర్యంగా నిలబడే శక్తిని మీ కుటుంబానికి అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా.
రవీనా టాండన్
సరోజ్ జీ మరణవార్త విచారకరం. ఒక జీనియస్, లెజెండ్ కొరియోగ్రాఫర్‌ను మనం కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. మీకు మీరే సాటి మాస్టర్ జీ.
కాజోల్
అత్యుత్తమ కొరియోగ్రాఫర్ సరోజ్ జీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆమె నాకు డ్యాన్సే కాదు.. జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్పించారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె చెప్పాలనుకున్న విషయాలన్నీ ఆమె హావభావాల్లో, బాడీ లాంగ్వేజ్‌లోనే ప్రస్ఫుటమవుతాయి. కెరీర్ పరంగానే కాదు.. ఆపై తనను ఎక్కడ కలిసినా డ్యాన్స్ పట్ల ఆమెకున్న మక్కువను చాటేవారు. లవ్యూ సరోజ్ జీ. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం.. మీ స్ఫూర్తిని మేమెప్పటికీ గుర్తుంచుకుంటాం..!
వైభవీ మర్చంట్ - కొరియోగ్రాఫర్
సరోజ్ జీ.. మీరు నా స్ఫూర్తి ప్రదాతగా, టీచర్‌గా, మార్గదర్శకురాలుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. ఓం శాంతి!
మల్లికా శెరావత్
లేచీ లేవగానే సరోజ్ జీ ఇక లేరన్న దుర్వార్త విని నా మనసు ముక్కలైంది. నేను నటించిన ‘మెహబూబా మెహబూబా’ పాటతో పాటు మరిన్ని పాటలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆమెకు సాటి మరెవరూ లేరు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఇది పూడ్చుకోలేని లోటు.
ఊర్వశీ ధోలాకియా
ఇది చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేని విషయం. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ లెజెండ్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌ను కోల్పోయింది. ఆమె డ్యాన్స్ ట్యాలెంట్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతుంది.
చిత్రాంగధా సింగ్
చిత్ర పరిశ్రమలో ఒక అధ్యాయం ముగిసినట్లనిపిస్తోంది. నిజంగా మనసు ముక్కలయ్యే బాధాకరమైన విషయమిది. తన డ్యాన్స్ ట్యాలెంట్‌తో ఎన్నో ఎవర్గ్రీన్ మూమెంట్స్‌ని మనకు అందించారామె. ఆమెతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. కళ విషయంలో ఆమె ప్రదర్శించిన అంకితభావం మరువలేనిది. మాస్టర్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
పరిణీతి చోప్రా
కొరియోగ్రఫీ గురించి తలచుకోగానే మనకు ముందుగా సరోజ్ జీనే గుర్తొస్తారు. అలాగే హీరోయిన్ అనగానే ఆమే మన మదిలో మెదులుతారు. తన ట్యాలెంట్‌తో బాలీవుడ్ హీరోయిన్ అనే పదానికి అసలైన నిర్వచనం అందించారామె. ఓ లెజెండ్‌గా వెలుగొందుతూనే, ఎందరో లెజెండ్స్‌ని తయారుచేశారామె. మేడం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. మీరు ఎప్పటికీ మా మదిలో శాశ్వతంగా నిలిచిపోతారు.
కరిష్మా కపూర్
సరోజ్ జీ.. సత్యం హాల్ వేదికగా మీరు గంటల తరబడి శ్రమించి నాకు నేర్పించిన డ్యాన్స్ మెలకువలు, హావభావాలు నాకు ఎప్పటికీ గుర్తే. మీ పాఠాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. మాస్టర్, టీచర్, డ్యాన్స్ గురూ, లెజెండ్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
అనుష్కా శర్మ
సరోజ్ జీ ఓ కళాతపస్వి. ఆమె తన ప్రతిభతో ఎంతోమంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు, నటీనటులు, దర్శకులకు స్ఫూర్తినిచ్చారు. వారు ఉన్నత స్థాయిలో నిలిచేందుకు ప్రోత్సహించారు. కళ రూపంలో ఆమె ఎప్పటికీ మన మధ్యే నిలిచిపోతారు. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
ప్రీతీ జింటా
సరోజ్ జీ ఇక లేరన్న వార్త చాలా బాధాకరం. మాస్టర్ జీ నాకు పాటకు తగ్గట్లుగా డ్యాన్స్ చేయడం, లిప్ సింక్ చేయడం ఎలాగో నాకు నేర్పించారు. అవే నన్ను బాలీవుడ్లో ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆమె ప్రదర్శించే అద్భుతమైన హావభావాలు, పని పట్ల అంకితభావమే నా కెరీర్ ప్రారంభంలో నాకు మాస్టర్ క్లాస్‌గా ఉపయోగపడ్డాయి. ఇకపై మిమ్మల్ని చాలా మిస్సవుతాను మేడం!
హేమామాలిని
దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇక లేరు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఇది పూడ్చలేని లోటు. ముఖ్యంగా ఆమెతో కలిసి పనిచేసిన నటీనటులకు ఆమె లేరన్న బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. నేను నటించిన ‘మృగ తృష్ణ’ చిత్రంలో ఆమె తన కొరియోగ్రఫీతో నాకు నేనే చక్కగా డ్యాన్స్ చేసేలా, డ్యాన్స్‌ను ఎంజాయ్ చేసేలా ప్రోత్సహించారు. సరోజ్ జీ కొరియోగ్రఫీ చేసిన నా పాటల్లో నా మనసుకు బాగా దగ్గరైన పాట ఇది. క్లాసికల్ స్టైల్ కలగలసిన ఈ పాట నా మనసును ఎంతగా హత్తుకుందో, ఈ పాటకు డ్యాన్స్ చేసేటప్పుడు నేనెంతగా ఎంజాయ్ చేశానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
కంగనా రనౌత్
ఎందరో సూపర్‌స్టార్స్ సక్సెస్ఫుల్ జర్నీలో కీలక పాత్ర పోషించారు సరోజ్ ఖాన్ జీ. తనూ వెడ్స్ మనూలోని ‘జుంగీ’, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్‌లోని ‘ఘనీ బవారీ’, మణికర్ణికలోని ‘లుల్లబై తక్తానీ’.. వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. ఆమెతో కలిసి పనిచేసిన మధుర క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను.
కాజల్ అగర్వాల్
మీ కొరియోగ్రఫీలో పనిచేయాలనేది ప్రతి యాక్టర్ కల. మేడం.. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
రకుల్ ప్రీత్ సింగ్
2020.. దయచేసి ఇకపై ఎలాంటి దుర్వార్త వినిపించకు. సరోజ్ ఖాన్ మేడం లేరన్న వార్త చాలా బాధాకరం. మేడం.. మీరు కొరియోగ్రఫీ చేసిన కనీసం ఒక్క పాటలోనైనా డ్యాన్స్ చేయాలని కలలు కన్నా. భారతీయ సినీ పరిశ్రమకు మీరు చేసిన సేవలు మరపురానివి. మీ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్నివ్వాలని, మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.