మన పిల్లలనే కాదు.. ఎక్కడ చంటి పిల్లల ఏడుపు వినిపించినా అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. ‘అయ్యో.. ఆ పాపాయి అంతలా గుక్కపట్టి ఏడుస్తోందేంటి.. ఆకలేస్తోందేమో..’ అంటూ ఆ చిన్నారి ఏడుపు ఆపే దాకా మన మనసు అటువైపే లాగుతుంటుంది. ఇలా చంటి పిల్లల ఆకలి ఏ తల్లినైనా కదిలిస్తుంది.. వారితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అలా ఓ నాలుగు నెలల పిల్లాడి ఆకలి తీర్చడానికి ఓ మహిళా పోలీసు చేసిన ప్రయత్నం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.. ఆ పోలీసమ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఎవరా పిల్లాడు? వాడి ఆకలి తీర్చడానికి మహిళా పోలీసు ఏం చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
దాదాపు మూడు నెలల నుంచి లాక్డౌన్ కొనసాగుతుండడంతో రోజువారీ కూలీలు, పేదలు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. సొంతూరికి వెళ్లి గంజి మెతుకులు తిన్నా రుచిస్తుందంటూ వారి ఊళ్లకు చేరుకుంటున్నారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి శ్రామిక్ రైళ్లు నడుపుతోంది. అలా బెంగళూరు నుంచి గోరఖ్‌పూర్ బయలు దేరింది ఓ రైలు. అందులో చిన్నా, పెద్దా, ముసలివాళ్లు, మహిళలు ఎంతోమంది ప్రయాణిస్తున్నారు. వారిలో మెహరున్నీసా అనే మహిళ కూడా తన నాలుగు నెలల చిన్నారితో సొంతూరికి వెళ్తోంది.
పాల కోసం పరిగెత్తుకెళ్లింది!
అయితే ఆ రైలు జార్ఖండ్‌లోని హతియా రైల్వే స్టేషన్ వద్ద కాసేపు ఆగింది. మెహరున్నీసా తన చిన్నారి కోసం తన వెంట తెచ్చుకున్న పాలు అయిపోవడంతో పాల కోసం స్టేషన్ సిబ్బందిని సంప్రదించింది. ఆ సమయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన ఏఎస్ఐ సుశీల బదైక్ అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నారి తల్లి పాల కోసం స్టేషన్ సిబ్బందిని అడగడంతో ఆ విషయం తెలుసుకున్న సుశీల.. వెంటనే స్టేషన్‌కు దగ్గర్లో ఉన్న తన ఇంటికి పరిగెత్తుకెళ్లి బాటిల్ నిండా పాలు తీసుకొచ్చి ఆ తల్లికి అందించింది.
ఇలా ఆ నాలుగు నెలల బిడ్డ ఆకలి తీర్చిందీ పోలీసమ్మ. ఇలా ఓవైపు డ్యూటీ చేస్తూనే.. మరోవైపు తన మానవత్వాన్ని చాటుకున్న ఈ పోలీసు అధికారిణి ఫొటో రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్ ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది.
ఆమెను చూసి గర్విస్తున్నా..!
ఇలా సోషల్ మీడియాలో వైరలైన ఈ ఫొటో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కంట పడింది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా ఈ మహిళా పోలీసుపై ప్రశంసలు కురిపించారు. ‘ఏఎస్ఐ సుశీల బదైక్ని చూసి గర్వపడుతున్నా. నాలుగు నెలల చిన్నారి ఆకలి తీర్చడానికి ఈ పోలీసు అధికారిణి చేసిన పని అభినందనీయం. ఓవైపు డ్యూటీ చేస్తూనే.. మరోవైపు తనలోని మానవత్వాన్ని చాటుకున్న ఆమె నిజంగా గ్రేట్..’ అంటూ క్యాప్షన్ రూపంలో ఆమెపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు.. ఈ సూపర్ కాప్‌పై ప్రధాని మోదీ కూడా ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.
ఇలా అటు డ్యూటీ చేస్తూనే, ఇటు అమ్మ మనసు చాటిన ఈ సూపర్ పోలీస్‌పై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఈ పోలీసాఫీసర్ మానవత్వానికి మారుపేరు’ అని, ‘విధుల్లో కొనసాగుతూనే.. మానవత్వాన్ని చాటుకున్నార’ని ఇలా ఈ మహిళా పోలీసును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Photo: Twitter