‘ఇంటి కన్నా గుడి పదిలం..’ ప్రస్తుత లాక్డౌన్ కాలంలో కొందరు మహిళలకు ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. కరోనా కల్లోలం నుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ స్వీయ నిర్బంధం కారణంగా కరోనా కట్టడి మాటేమో గానీ.. కొందరిళ్లల్లో కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఏ సమస్య వచ్చినా.. ఇంట్లో ఉంటే సేఫ్ అనుకుంటాం.. కానీ ఇంట్లో ఉండడమే సమస్యైపోతోంది కొందరు మహిళలకు. లాక్డౌన్ కారణంగా పిల్లలు, పెద్దలు అంతా ఇంటిపట్టునే ఉండడం వల్ల ఓవైపు పెరిగే పనిభారంతో మహిళలందరూ సతమతమైపోతుంటే.. మరోవైపు ఇంటి నుంచే పనిచేస్తూ క్షణం ఖాళీ లేకుండా గడుపుతున్నారు ఇంకొందరు అతివలు.
ఇక వీటితో పాటు.. కొందరు మహిళలు గృహహింసతో నలిగిపోతున్నారు. శారీరకంగా, మానసికంగా వేదనకు గురవుతున్నారు. అందుకే ఇకనైనా మనమంతా మేల్కొనాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. గృహహింస విషయంలో ఇకపై ఉపేక్షించేది లేదంటూ వినూత్న పద్ధతుల్లో మహిళలకు ధైర్యం నూరిపోస్తున్నారు. మరి, ఈ సామాజిక సమస్యపై పలువురు ముద్దుగుమ్మలు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..
ఈ హెల్ప్ లైన్‌కి కాల్ చేయండి..
తమిళ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్ నటనలోనే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటుంది. సందర్భం వచ్చినప్పుడల్లా క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా తన గళాన్ని వినిపిస్తూ.. నటీమణుల సమస్యలను అందరికీ తెలియజేస్తుంటుందీ డేరింగ్ బ్యూటీ. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా తాను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నానంటూ బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఇలా మహిళలకు సంబంధించిన అంశాల్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా వ్యవహరించే వరలక్ష్మి.. తాజాగా గృహహింసపై గళమెత్తింది. ఈ లాక్డౌన్ సమయంలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు తమ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది.
‘మనమంతా తోటి మహిళలకు సహాయం చేద్దాం.. లాక్డౌన్ కారణంగా వారు ఎదుర్కొంటున్న గృహహింస బారి నుండి వారిని కాపాడుకుందాం. వారిని హింసిస్తున్న వారి ఉచ్చులో వారు చిక్కుకొని ఉండచ్చు. దయచేసి ఈ హెల్ప్‌లైన్ నంబర్ 18001027282 మహిళలందరికీ తెలియజేయండి. హింసకు వయసు, డబ్బు, హోదా.. వీటితో సంబంధం లేదు. ఎవరైనా గృహహింసకు గురికావచ్చు.. అందులో మీకు తెలిసిన వారు కూడా ఉండచ్చు. అలాంటి వారెవరైనా ఉంటే వారికి కూడా ఈ నంబర్ ఇచ్చి సహాయం చేయండి.. వారిని కాపాడండి..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుందీ ట్యాలెంటెడ్ బ్యూటీ. ఇలా మహిళలు తమపై జరుగుతోన్న అన్యాయాన్ని మౌనంగా భరించద్దని, హెల్ప్‌లైన్ వేదికగా ధైర్యంగా గళం విప్పాలని అంటోంది వరలక్ష్మి.
మీకోసం మీరే నిలబడాలి..
బాలీవుడ్ క్యూటీ కృతీ సనన్ కూడా గృహహింసపై తన గళాన్ని వినిపించింది. అంతేకాదు.. తాను రాసుకున్న పద్యం ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు చక్కగా సరిపోతుందంటూ ఆ పద్యాన్ని చదివి వినిపించిందీ బ్యూటీ. అంతేకాదు.. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు ధైర్యంగా ఫిర్యాదు చేయడంటూ ఓ హెల్ప్‌లైన్ నంబర్ని కూడా షేర్ చేసింది..
‘మీకోసం మీరు నిలబడండి.. ఫిర్యాదు చేయండి.. ఎందుకంటే గృహహింస అనేది పోనీలే అని సరిపెట్టుకునే విషయం కాదు. మామూలు రోజుల కంటే లాక్డౌన్ సమయంలో గృహహింస కేసులు విపరీతంగా పెరిగాయనే వార్తలు చదువుతుంటే నా హృదయం ద్రవించుకుపోతోంది. దేశం మొత్తమ్మీద ఒక్క పంజాబ్‌లోనే 700 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం నమోదైన కేసులు.. ఇంకా ఫిర్యాదు చేయని కేసులు ఎన్ని ఉన్నాయో ఊహించుకోండి. మీరు గృహహింసని ఎదుర్కొంటుంటే వెంటనే ఫిర్యాదు చేయండి. http://www.ncw.nic.in/helpline ఈ వెబ్సైట్లో మహిళలకు సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లున్నాయి.. లేదా 72177135372 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోగలరు. కాబట్టి మీ తరఫున మీరే నిలబడి పోరాడాలి. కారణం ఏదైనా కావచ్చు.. ఇలా ఎవరైనా మిమ్మల్ని శారీరకంగా హింసించడమంటే సర్దుకుపోయే చిన్న విషయం కాదు..’ అంటూ తన మనోభావాలను అక్షరీకరించింది కృతి.
తన బాధ వినే ఈ పద్యం రాశా!
ఇక పోస్ట్‌తో పాటు ఓ వీడియో కూడా షేర్ చేసిన కృతి.. అందులో తాను గతంలో రాసిన ఓ పద్యాన్ని చదివి వినిపించింది. వీడియోలో భాగంగా..‘నేను ఇంటర్ చదివే రోజుల్లో ఓ పద్యం రాశాను. అది నాకిప్పటికీ గుర్తుంది. ఎందుకంటే.. అది నా మనసును తాకిన పద్యం. ప్రస్తుత పరిస్థితులకు అది సరిగ్గా సరిపోతుంది. అందుకని.. ఇప్పుడు నేనా పద్యాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను.
“సూర్యాస్తమయ సమయంలో ఎరుపుదనం రక్తంలా ఆకాశంలో పరచుకుంది..
నా మనసులో భయం మొదలైంది..
శరీరమంతా చెమటలు పడుతోంది...
అతను ఆలస్యంగా వస్తాడని తెలిసి తలుపు వైపు భయం భయంగా చూస్తున్నా..
అతను వస్తున్న చప్పుడు వినిపిస్తోంది.. అలాగని అదేమీ తెలియని శబ్దం కాదు..
అతను తలుపు కొడుతున్నాడు..నేను ప్రమాదంలో ఉన్నానని నాకు తెలుస్తోంది..
గుప్పుమంటున్న వాసనే చెబుతోంది అతను మళ్లీ తాగొచ్చాడని..
ప్లేట్లను పగలగొడతాడు.. విచక్షణారహితంగా నన్ను నేలపైకి తోసేస్తాడు..
నా శరీరంపై మళ్ళీ వాతలు తేలతాయి.. మాట్లాడలేను.. నిస్సహాయంగా ఏడుస్తూ ఉండిపోతాను..
నా ఏడుపును ఓ సంగీతంలా వింటూ అతను నిద్రపోతాడు..
మెల్లగా అతను మత్తు నుండి తేరుకుంటాడు..
నా మనసులోని బాధ కన్నీటి రూపంలో నా బుగ్గలపై కారుతుంటుంది..
ఇంకా నన్ను గాయపర్చడానికి నా శరీరంలో ఎక్కడా ఖాళీ కూడా లేదు..
అతను నన్ను ప్రతిరోజూ ఇలాగే చంపుతుంటాడు.. రోజూ జరిగేది ఇదే!
నా బాధను ఒక చిన్న ముద్దుతో దూరం చేసే ప్రత్యేకమైన వ్యక్తి కావాలని నా మనసు కోరుకుంటుంది..
సున్నితమైన స్పర్శ కోసం నా మనసు ఆరాటపడుతోంది.. కానీ ముందుకు సాగే జీవితాన్ని నేను ఆపలేను.
మళ్లీ సూర్యాస్తమయాలు వస్తాయి..
మళ్లీ మళ్లీ ఆ హింసకు బలవుతాను.. అయినా బతకడానికే ప్రయత్ని్స్తాను..”- అంటూ తాను రాసిన పద్యాన్ని చదివి వినిపించింది కృతి.
అందుకే ఈ పద్యం రాశాను!
నేను ఈ రోజు ఈ పద్యం చదవడానికి కారణం.. ఎప్పుడూ లేనంతగా ఈ లాక్డౌన్ సమయంలో గృహహింస కేసులు పెరిగిపోవడమే! ఇప్పుడు నేను చదివిన ఈ పద్యంలోని పరిస్థితులు కొందరు ప్రతిరోజూ ఎదుర్కొంటున్నారు. నేను ఈ పద్యం రాయడానికి కారణం.. మా ఇంట్లో పనిచేసే ఓ మహిళ. తాను మా అమ్మతో మాట్లాడుతూ.. తన భర్త ఇంటికి ప్రతిరోజూ తాగి, ఆలస్యంగా వచ్చి తనని హింసిస్తుంటాడని చెబుతుండేది. కానీ దాని గురించి తను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని.. అందుకు తన పిల్లలు ఏమైపోతారోనన్న భయమేనంటూ బాధపడేది.
ఈ పద్యం చివర్లో చెప్పినట్లు.. ‘నేనేం చేయలేను.. మళ్లీ సూర్యాస్తమయాలు వస్తాయి.. ఈ హింసను ఎదుర్కోవాలి..’ అన్న వాక్యాలను ఇపుడు మార్చి చెబుతున్నాను..
‘ఇది మీ జీవితం. మీరు మాత్రమే మీ జీవితాన్ని నియంత్రించుకోగలరు..’ అంటూ ఎంతో భావోద్వేగంతో తన మనసులోని మాటల్ని అందరి ముందుంచింది కృతి.
కాబట్టి గృహహింసను ఎవరూ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎలాంటి చిన్న ఇబ్బంది ఎదురైనా భయపడకుండా, బాధను భరించకుండా ధైర్యంగా ముందడుగు వేయండి.. గృహహింసకు, ఆ పేరుతో వేధించే వారికి బుద్ధి చెప్పండి.