ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. దీనికి తోడు అందరూ ఇంట్లో ఉండడం వల్ల మహిళలపై మరింత భారం పడుతోంది. ఓవైపు ఇంటి పని, మరోవైపు కొందరికి ఇంటి నుంచే పనిచేయాల్సి రావడం, ఇంకోవైపు ఇంట్లో పిల్లల ఆలనా పాలన చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్ చేసుకోలేక అతివలంతా సతమతమైపోతున్నారు. ఇక వీటన్నింటికీ తోడు కొందరు మహిళలు ఈ లాక్డౌన్ సమయంలో గృహహింస, ఇతర వేధింపులను సైతం ఎదుర్కొంటున్నట్లు ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ కూడా వెల్లడించింది. అయితే ఇలాంటి మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసను తన డ్యాన్స్‌తో కళ్లకు కట్టినట్లు చూపించింది చెన్నైకి చెందిన ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ జానకీ రంగరాజన్. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ఈ లాక్డౌన్ సమయంలో మహిళలు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తన నృత్యం ద్వారా వివరించిందామె.
నిజానికి కళకున్న గొప్పతనం వర్ణించడానికి మాటలు చాలవు. ఈ సమాజంలోని ఎటువంటి క్లిష్ట సమస్యనైనా తమ కళ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించగలిగే శక్తి కళాకారుల సొంతం అని చెప్పుకోవచ్చు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసింది చెన్నైకి చెందిన ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ జానకీ రంగరాజన్. చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం పెట్టే జానకి.. నాలుగేళ్ల నుంచే తన డ్యాన్స్ మెలకువలతో తన మనసులోని మాటల్ని వ్యక్తపరిచేది. ఇలా డ్యాన్స్‌పై ఆమెకున్న ఆసక్తి, పట్టుదల, తపన ఆమెను భరతనాట్యం నేర్చుకునేందుకు పురిగొల్పాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన నృత్య ప్రదర్శనలతో ఎందరో డ్యాన్స్ ప్రియుల్ని మైమరపించిన జానకి.. కొరియోగ్రాఫర్‌గానూ రాణించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. అంతేకాదు.. ‘కళాశ్రయ’ అనే స్వచ్ఛంద సంస్థకు సహవ్యవస్థాపకురాలిగా కొనసాగుతోన్న ఆమె.. దాని ద్వారా భారతీయ కళలను ప్రచారం చేసే పనిలో నిమగ్నమైంది. ఇక తాజాగా తన నృత్యంతో మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసను కళ్లకు కట్టినట్లుగా చూపించిందీ క్లాసికల్ డ్యాన్సర్.

పనులన్నీ చేస్తూ.. హింసను భరిస్తూ..!
మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస తీవ్రతను తన నృత్యంతో అందరికీ తెలియజేసింది జానకి. ఈ క్రమంలో ‘అయిగిరి నందిని నందిత మేదిని..’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా.. తను ఉదయాన్నే నిద్ర లేవడం, ఇంటి పనులు-వంట పనులు చేయడం, భర్తకు కాఫీ అందించడం, పిల్లలకు గోరు ముద్దలు తినిపించడం.. ఇలా తాను ఓవైపు అన్ని పనులు చేస్తున్నా.. భర్త తాగి ఇంటికి రావడం, ఆమెపై చేయిచేసుకోవడం.. ఇలా శారీరకంగా, మానసికంగా తనను బాధించడం.. వంటివన్నీ తన ముఖకవళికలు, నృత్యం ద్వారా మన ముందే జరిగినట్లు చూపించిందామె. ఇన్ని బాధలను ఎదుర్కొంటూనే, వాటన్నింటినీ మౌనంగా భరిస్తూనే ఇంట్లో వాళ్లందరినీ చక్కగా చూసుకోవడం, ఇక భరించలేని పరిస్థితుల్లో తానే ఒంటరిగా బాధపడడం.. వంటివన్నీ చక్కగా అర్థమయ్యేలా చూపించింది జానకి.
ఇల్లే నరకమైతే?
ఇలా తాను చేసిన ఈ నృత్య రూపకాన్ని సోషల్‌మీడియా ద్వారా షేర్ చూస్తూ.. ‘ఈ సమయంలో ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి.. అంటున్నారు. కానీ ఇల్లే నరకమైతే? ఇలా గృహహింస కారణంగా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా బాధలు పడుతోన్న మహిళలందరికీ ఈ వీడియో అంకితం. మ్యారిటల్ రేప్‌ని ఇప్పటికీ నేరంగా పరిగణించట్లేదు. లాక్డౌన్ వల్ల మహిళలు, పిల్లలపై హింస క్రమంగా పెరుగుతోంది. ఇలా హింసిస్తున్న వారితో ఉండాలని ఎవరూ కోరుకోరు.. దురదృష్టవశాత్తూ కొందరు జీవితాంతం ఈ బాధను అనుభవించాల్సి వస్తోంది. మనకు ఏది సురక్షితమైన ప్రదేశం అనుకుంటామో.. అక్కడే హింసను ఎదుర్కొంటున్నాం.. మన చుట్టూ ఎందరో మహిషాసురులున్నారు.. కానీ వారిని వధించే దేవతలు ఎక్కడున్నారు?’ అంటూ మనపై జరుగుతోన్న హింసను మనమే సమర్థంగా ఎదుర్కొనేంత శక్తిని ప్రతి మహిళా కూడగట్టుకోవాలంటున్నారు జానకి. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Photos: Screengrab