ప్రపంచంపై ప్రకోపం చూపిస్తోన్న కరోనాపై గెలిచేందుకు కోట్లాది మంది భారతీయులు ఇంటికే పరిమితమయ్యారు. ఇక వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ముందుండి మరీ ఈ వైరస్‌కు ఎదురొడ్డి పోరాడుతున్నారు. వీరితో పాటు సామాజిక స్పృహ కలిగిన మరికొందరు సైతం ఈ ఆపత్కాలంలో సమాజానికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అలాంటి కోవకే చెందుతారు బిహార్‌లోని ‘జీవిక దీదీ’లు. మహిళా సాధికారతలో భాగంగా 2006లో అప్పటి బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ‘జీవిక’ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు అక్కడి ఎంతోమంది మహిళలు. వీరంతా ప్రస్తుతం అత్యవసరాలుగా భావించే మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమయ్యారు. సామాన్య ప్రజలు కూడా వీటిని కొనేలా సరసమైన ధరలకు అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా వీరి సేవల గురించి తెలుసుకున్న ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా ఈ మహిళా సంఘాలపై ప్రశంసలు కురిపించారు.
రూ.15లకే ఫేస్ మాస్క్!
మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా బాధితుల సంఖ్య బిహార్‌లో కొంచెం తక్కువగానే ఉంది. అయితే కరోనాపై బిహార్ ప్రభుత్వం చేస్తోన్న పోరులో మేము సైతం అంటూ సహాయమందిస్తున్నారు జీవిక దీదీలు. బిహార్ రాష్ర్టమంతటా సుమారు రెండు వేలకు పైగా ‘జీవిక’ మహిళా సంఘాలున్నాయి. వీరిలో సభ్యులుగా ఉన్న చాలామంది మహిళలు పెద్దగా చదువుకోలేదు. కానీ సాటివారికి సాయపడాలన్న సామాజిక స్పృహతో కరోనాపై పోరులో తమ వంతు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో ఫేస్ మాస్కులకు, శానిటైజర్లకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. బయటి మార్కెట్లలో కొందామంటే బోలెడు ఖర్చవుతోంది. ఈనేపథ్యంలో ఈ దీదీలు గంటల కొద్దీ శ్రమించి ఫేస్ మాస్కులు తయారుచేస్తున్నారు. ఓవైపు నాణ్యతకు పెద్దపీట వేస్తూనే సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేసేలా ఈ మాస్కులను రూపొందిస్తున్నారు. ఇప్పటిదాకా వీరు సుమారు 5.2లక్షలకు పైగా మాస్కులు తయారుచేయడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లలో ఒక మాస్కు రూ.50 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. కానీ ఎంతో నాణ్యతతో గంటల కొద్దీ శ్రమిస్తూ ఈ దీదీలు తయారుచేసిన మాస్క్ కేవలం రూ.15 లకే అక్కడి మార్కెట్లలో లభ్యమవుతోంది.
ఆర్డర్లే ఆర్డర్లు!
ఎంతో ఓపికతో, నాణ్యతతో వీరు తయారుచేసిన మాస్కులను అక్కడి ఆస్పత్రులు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి. ఇక దక్షిణ బిహార్ విద్యుత్ పంపిణీ సంస్థ తమ ఉద్యోగుల కోసం ఏకంగా 54 వేల మాస్కులు ఆర్డరిచ్చి మరీ వీరితో తయారుచేయించుకుంది. వీరి పనితీరును మెచ్చుకొని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు మాస్కుల కోసం వీరికి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నాయి. ఈక్రమంలో మాస్కుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను ఆయా జిల్లాల అధికారులు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి అందించడం విశేషం. ఇలా ఇటు సామాజిక దూరం పాటిస్తూనే అటు మాస్కులు తయారుచేస్తున్నారీ దీదీలు.
హెర్బల్ శానిటైజర్ల తయారీలోనూ!
మాస్కుల తయారీ ఒక్కటే కాదు.. కరోనాపై పోరులో భాగంగా సామాన్యులకు, వలస కార్మికులకు అవసరమైన పలు ప్రజా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారీ దీదీలు. ఇందులో భాగంగా వివిధ గ్రామాల్లో చిన్న పాటి రిటైల్ దుకాణాలు ఏర్పాటుచేసుకుని నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందిస్తున్నారు. చాలాచోట్ల ‘దీదీ కీ రసోయిస్’ పేరిట వండిన ఆహారాన్ని పేదలకు, వలస కార్మికులకు పంపిణీ చేస్తూ తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తులసి ఆకులతో సహజసిద్ధమైన హెర్బల్ శానిటైజర్లను ఎలా తయారుచేసుకోవాలో గ్రామీణ ప్రజలకు నేర్పిస్తున్నారు. అదేవిధంగా తమ గృహాలను ఎలా శానిటైజ్ చేసుకోవాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు ఈ దీదీలు. ఈ నేపథ్యంలో వీరి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పలువురు దాతలు కూడా ఈ ఆపత్కాలంలో అవస్థలు పడుతోన్న పేదలకు, వలస కార్మికులకు తమ వంతు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. దీదీల సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు, నూనెలు, ఇతర నిత్యావసరాలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
వారు ‘సైలెంట్ వారియర్స్’!
కరోనాపై పోరులో భాగంగా సామాజిక బాధ్యతతో జీవిక దీదీలు చేస్తోన్న సేవా కార్యక్రమాలపై ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘కరోనాపై పోరులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతోన్న బిహార్ జీవిక దీదీల గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారు ఎవరికీ కనిపించని ‘సైలెంట్ వారియర్స్’’ అని ట్విట్టర్ వేదికగా వారిని ప్రశంసించారాయన.
పెద్దగా చదువుకోకపోయినా ఆపత్కాలంలో సాటివారికి సాయపడుతూ తమ పెద్ద మనసును చాటుకుంటోన్న ఈ జీవిక దీదీలు నిజమైన కరోనా యోధులు అనడంలో సందేహం లేదు.