రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించింది. ఈ క్రమంలో ప్రజలు మరికొన్ని రోజుల పాటు ఇళ్లకే పరిమితం కాక తప్పదు. దీంతో ఈ సమయంలో కాలక్షేపం కోసం రకరకాల మార్గాలను వెతుక్కొంటున్నారు చాలామంది. ఈ పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూనే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు తమలోని సృజనాత్మకతకు పని చెబుతున్నారు. ఈ క్రమంలో మన మహిళా క్రికెట్ జట్టుకు చెందిన కొంతమంది క్రీడాకారిణులు కలిసి ఓ మ్యాచ్ ఆడడం విశేషం. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న ఈ పరిస్థితుల్లో వీళ్లకి ఇది ఎలా సాధ్యమైందో మీరే చూడండి.
మనసు పెట్టి ఆలోచించాలే కానీ, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఈ మాటను మరోసారి నిరూపించారు మన మహిళా క్రికెటర్లు. లాక్డౌన్ కారణంగా ఒక పక్క ఇంట్లో బోర్ కొట్టడం, మరో పక్క ప్రతిరోజూ చేసే క్రికెట్ సాధనకు బ్రేక్ పడడం.. ఈ రెండు సమస్యలకు కలిపి ఒకే పరిష్కారాన్ని ఆలోచించారు మన క్రీడాకారిణులు. ఈ క్రమంలో వేదా కృష్ణమూర్తి, మోనా మేష్రం, రీమా మల్హోత్రా (మాజీ క్రికెటర్), ఆకాంక్ష కోహ్లీ (కర్ణాటకకు చెందిన క్రికెటర్), లీసా స్థలేకర్ (మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్) కలిసి ఓ వర్చువల్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. అంటే ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లో ఉన్న వీళ్లు కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు ఓ వీడియోను చిత్రీకరించారు. అంతేకాదు, దీనికి ‘Cricket Isolation Cup’ అని నామకరణం కూడా చేశారు.
అందుకే ఈ లీగ్ మ్యాచ్‌లో పాల్గొన్నాం..!
ఈ వీడియో లీసా కామెంటరీతో ప్రారంభమవుతుంది. వేద బ్యాటింగ్ స్థానంలో ఉండగా.. రీమా-బౌలర్, ఆకాంక్ష-వికెట్ కీపర్, మేష్రం బౌండరీ వద్ద ఫీల్డర్ స్థానాల్లో ఉన్నట్లు లీసా చెబుతుంది. మ్యాచ్‌లో భాగంగా దిల్లీలో ఉన్న రీమా బంతిని విసరగా.. బెంగళూరులో ఉన్న వేద దానిని స్టైల్‌గా బౌండరీ వైపుకి కొడుతుంది. ఈ బంతిని కర్ణాటకలో తన బెడ్ రూమ్‌లో ఉన్న మేష్రం కష్టపడి ఆపుతుంది.
ఈ వీడియోను వేద ట్విట్టర్లో షేర్ చేస్తూ ‘మేము క్రికెట్‌ను చాలా మిస్ అవుతున్నాం..! అందుకే ఇంట్లో ఉంటూనే ఈ లీగ్ మ్యాచ్‌లో పాల్గొన్నాం..! దీని పేరే ‘Isolation Cricket Cup’’ అని రాసుకొచ్చింది. దీంతో వేల కొద్దీ లైకులు, షేర్లతో ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు నెటిజన్లు. ఈ క్రమంలో ఇంటర్నేషల్ క్రికెట్ కౌన్సిల్ సంస్థ కూడా ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ‘Isolation Cricket మరో స్థాయికి చేరుకుంది..!’ అంటూ సరదాగా రాసుకొచ్చారు.
సినిమా తారలు సైతం..
ఈ లాక్డౌన్ సమయంలో క్రికెటర్లే కాదు సినిమా తారలు సైతం తమలోని క్రియేటివిటీకి పని చెబుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వివిధ పరిశ్రమలకు చెందిన సూపర్ స్టార్లు కలిసి ‘ఫ్యామిలీ’ అనే ఓ షార్ట్ ఫిలింలో నటించిన సంగతి విదితమే. ఇందులో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, అలియా భట్, ప్రియాంకా చోప్రా, రణ్‌బీర్ కపూర్.. తదితరులు నటించారు. వీరంతా సామాజిక దూరం పాటిస్తూ ఎవరింట్లో వాళ్లు ఉండి నటించి అందరికీ సామాజిక దూరం గురించి చక్కటి సందేశం అందించారు.