కరోనాను నివారించే ఏకైక మంత్రం సామాజిక దూరం పాటించడం. అందుకే ప్రభుత్వాల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలంటూ పలు మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఒకవేళ వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని - సామాజిక దూరం పాటించాలని, ఇంట్లో ఉన్నా భౌతిక దూరం పాటిస్తూ, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలని పదే పదే చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా పేరుగాంచిన జ్యోతీ ఆమ్గే కూడా చేరిపోయింది. నాగ్‌పూర్ పోలీసులతో చేతులు కలిపి అక్కడి వీధుల్లో తిరుగుతూ కరోనాపై తన వంతుగా అవగాహన కల్పిస్తోందీ షార్టెస్ట్ వుమన్.

దేశంలోనే కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. అయితే ఈ మహమ్మారి ఉగ్రరూపం చూపకముందే మనందరం మేల్కోవాలని, మన శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తోన్న డాక్టర్లు, పోలీసులు పడుతోన్న శ్రమను గుర్తించి మనందరం ఇంట్లోనే ఉండాలని అంటోంది జ్యోతి.

సామాజిక దూరమే శ్రీరామ రక్ష!
నాగ్‌పూర్ వాసి అయిన జ్యోతి.. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలో ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి నాగ్‌పూర్‌లోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ స్క్వేర్ సెంట్రల్ అవెన్యూ వద్దకు చేరుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులతో చేతులు కలిపిన ఆమె కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలో పింక్-బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ముస్తాబై, ముక్కుకు మాస్క్ ధరించిన ఆమె.. ముందుగా అక్కడి పోలీసులకు అభివాదం చేయడంతో పాటు పోలీస్ వ్యాన్‌పైకి ఎక్కి మరీ మైక్ అందుకొని కరోనా గురించి అవగాహన కల్పించింది.

‘పోలీసు అధికారులు, వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, మిలిటరీ ఆఫీసర్స్.. వీరంతా మనందరి ప్రాణాలు కాపాడడం కోసం కరోనాతో యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నా వంతుగా వీరికి సహకరించాలనుకున్నా. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందుకొచ్చా. ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే.. మీరంతా సామాజిక దూరం పాటించండి.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.. అలాగే దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి.. లాక్డౌన్ రూల్స్ పాటించండి.. తద్వారా వైరస్ చెయిన్‌ను బ్రేక్ చేయచ్చు..’ అంటూ ఓవైపు వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు వైరస్‌తో నిరంతరాయంగా పోరాడుతోన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది జ్యోతి. ఇలా మరోసారి వార్తల్లోకెక్కిందీ షార్టెస్ట్ వుమన్.
నటిగానూ గుర్తింపు!

జ్యోతీ ఆమ్గే 1993, డిసెంబర్ 16న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న ఆమెకు పుట్టుకతోనే డ్వార్ఫిజం (అకోండ్రోప్లాసియా) అనే సమస్య ఉంది. జన్యులోపం, ఎముకల బలహీనత కారణంగా పొడవు పెరగలేదు జ్యోతి. ఐదు కిలోల బరువు, (దాదాపు 2 అడుగుల పొడవు ఉన్న జ్యోతి 2011లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి వార్తల్లో నిలిచిన ఆమె.. బాలీవుడ్ నటిని కావడమే తన కల అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

ఇక చిన్నతనం నుంచీ ఆకర్షణీయమైన దుస్తులు ధరించడం, మేకప్ వేసుకొని అందంగా ముస్తాబవడం.. అంటే ఎంతో మక్కువ చూపే జ్యోతి.. తన కోరిక మేరకు నటిగానూ గుర్తింపు సంపాదించుకుంది. 2009లో ‘బాడీ షాక్ : టూ ఫుట్ టాల్ టీన్’ అనే బ్రిటిష్ మెడికల్ డాక్యుమెంటరీలో నటించి మెప్పించిన ఈ స్మాలెస్ట్ వుమన్.. 2012-13లో ప్రసారమైన ‘బిగ్‌బాస్ 6’లో అతిథి పాత్రలో మెరిసింది. ఇక 2014-15లో ప్రసారమైన ‘అమెరికన్ హారర్ స్టోరీ : ఫ్రీక్ షో’ అనే టీవీ సిరీస్‌లో ‘మా పెటైట్’ అనే పాత్రలో నటించింది. ఆపై 2018లో ‘మాతరం’ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ మెరిసిందీ లిటిల్ వుమన్. తన నటనకు గుర్తింపుగా 2015లో ‘రష్యన్ ఇంటర్నేషనల్ హారర్ ఫిలిం అవార్డు’, అదే ఏడాది ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెనెటియన్ వీఐపీ షో అవార్డు’ సైతం కైవసం చేసుకుంది జ్యోతి. ఇలా తన శరీరాకృతితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి మైనపు బొమ్మను లోనావాలాలోని ‘సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం’లో ఏర్పాటు చేయడం విశేషం.
|
పొట్టిగా ఉన్నా సరే ఎంతో గర్వపడుతున్నానంటూ బాడీ పాజిటివిటీని చాటుకుంటూ అందరిలో ప్రేరణ కలిగిస్తోన్న జ్యోతి.. ఇప్పుడు కరోనాపై అవగాహన పెంచుతూ మరోసారి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
Image Courtesy: twitter.com/JyotiAmge/media