కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ మహమ్మారితో అతలాకుతలమవుతోంది. అక్కడి ప్రజలపై పగబట్టినట్టు ఇప్పటికే సుమారు 24 వేల మంది అమెరికన్లను ఈ వైరస్ బలితీసుకుంది. దీంతో ఆ దేశంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లోని మార్చురీలన్నీ కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోయాయి. ఈ క్రమంలో అక్కడి అధ్వాన్న పరిస్థితులను వివరిస్తూ అలెక్సాండ్రియా మాకియాస్ అనే ఓ నర్సు ఫేస్బుక్లో ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది. ఆ హృదయ విదారక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.
అమెరికాలోని ఓ ఆస్పత్రిలో సాధారణ నర్సుగా పనిచేస్తోంది అలెక్సాండ్రియా. కరోనా కారణంగా అగ్రరాజ్యంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న ఆమె.. తన జీవితంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి విపత్తును చూడలేదంటోంది.
నేనొక సాధారణ నర్సుని...కానీ..!
‘నేను కరోనా గురించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు షేర్ చేయలేదు. ఎందుకంటే లక్షలాది మందిని కబళిస్తోన్న ఈ మహమ్మారికి సంబంధించి ఏదైనా సానుకూల ఘటన చోటుచేసుకుంటే అందరితో పంచుకుందామనుకున్నా. కానీ ఇప్పటివరకు అలాంటివేం జరగలేదు. ఈ చీకటి రోజుల్లో నా మనసును ఎంత సానుకూలంగా మార్చుకుందామన్నా అది నా వల్ల కావట్లేదు. ఇక్కడ జరుగుతున్న ఘటనలు నన్ను చాలా కుంగదీస్తున్నాయి. మా ఆస్పత్రిలో రోజురోజుకీ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. సాధారణంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా హఠాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. కానీ ఇక్కడ బాధితులకు సరిపడా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది లేరు. ఉన్న సిబ్బందికి కూడా అనుభవం అంతంతమాత్రమే! ఇక్కడ నేను తాత్కాలిక నర్సుగా పనిచేయడానికి వచ్చాను. అయితే నాకు ఐసీయూ బాధ్యతలు అప్పగించారు. ఈ చికిత్సకు సంబంధించి నాకెలాంటి అనుభవం లేదు. కానీ ఐసీయూలో పనిచేయడానికి ఎవరూ రాకపోవడంతో ఆ బాధ్యతలు నాకు అప్పగించారు.
మా ఆయనతో రెండ్రోజుల్లో వస్తానని చెప్పా!
నేను రెండు రోజుల్లో ఇంటి కొస్తానని నా భర్త జులియో మాకియాస్తో 11 రోజుల క్రితం చెప్పాను. కానీ ఇక్కడి పరిస్థితులు నన్ను ఇంటికి వెళ్లనివ్వడం లేదు. ఐసీయూ నుంచి ఒక్కరైనా ప్రాణాలతో బయటపడతారేమోనని ఆశగా ఎదురుచూశాను. కానీ అలాంటివేమీ జరగడం లేదు. మా యూనిట్కొచ్చిన రోగులందరి మృతదేహాలను బాడీ బ్యాగుల్లో పెట్టి పంపిస్తున్నాం. దీంతో అసలు నేనెందుకు ఈ ఐసీయూ వార్డులో ఉన్నానో నాకే అంతుపట్టని పరిస్థితి. అయితే కొన్ని రోజుల నుంచి నాకొచ్చిన స్పానిష్ భాషలోనే కొవిడ్ వైరస్ గురించి రోగులకు అవగాహన కల్పిస్తున్నా. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులు భయపడకుండా వారిలో మనోధైర్యం నింపడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఇక చివరి క్షణాల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న రోగుల కోరిక మేరకు భౌతిక దూరం పాటిస్తూనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తున్నా.
వారి మొబైల్స్ ఇంకా మోగుతూనే ఉన్నాయి!
మా ఐసీయూకి రోజుకో కొత్త రోగి వస్తున్నాడు. వృద్ధులతో పాటు యుక్తవయసులో ఉన్న వారు కూడా కరోనాకు బలవుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, శారీరకంగా, మానసికంగా బలమైన వారు కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోలేక ప్రాణాలొదులుతున్నారు. వారిని బతికించడానికి మా వైద్య సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ అవేవీ వారి ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి. ఓ నర్సుగా నాకు ఇదెంతో బాధ కలిగిస్తోంది. ఇక మరణించిన వారికి సంబంధించిన వ్యక్తిగత వస్తువులు చాలా వరకు మా దగ్గరే ఉండిపోయాయి. మృతుల్లో కొంతమందికి సంబంధించిన మొబైల్ ఫోన్లు ఇప్పటికీ మోగుతూనే ఉన్నాయి. వారి కళ్లజోడు, పుస్తకాలు, డైరీ తదితర వస్తువులను చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు.
ఈ మహమ్మారి త్వరగా అంతమైపోవాలి!
కరోనా కారణంగా నా కళ్లముందే వేలాది మంది ప్రాణాలొదిలారు. ఇక్కడెంత భయంకరంగా ఉందో, ఆ ప్రమాదకర వైరస్ ఎంత మానసిక వేదనకు గురిచేస్తుందో మాటల్లో చెప్పలేకపోతున్నా. అందుకే ఈ మహమ్మారితో నిరంతరం అప్రమత్తంగా ఉండమని నేను మీ అందరినీ వేడుకుంటున్నా. అదేవిధంగా కరోనా బాధితులను కాపాడేందుకు అహర్నిశలూ శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అలక్ష్యం వహించినా మీ ప్రాణాలకు, మిమ్మల్ని అమితంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలకు పెను ముప్పు తప్పదు. ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచమంతా పాకింది. ఎన్నో కుటుంబాలను కకావికలం చేసింది. ఇలా ఎందరినో బాధపెడుతున్న ఈ మహమ్మారి తొందరగా అంతమైపోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా..’ అంటూ కొవిడ్ రోగులకు చికిత్స అందించే క్రమంలో తన అనుభవాలను పంచుకుంటూ కన్నీటిపర్యంతమైందీ నర్సు. చదువుతుంటేనే ఎంతో హృదయవిదారకంగా అనిపిస్తోన్న ఈ పోస్టును తాను ఫేస్బుక్ ద్వారా పంచుకోగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చాలామంది యవ్వనంలో ఉన్న వారు, ఆరోగ్యంగా ఉన్న వారు.. తమకు కరోనా సోకినా ఎలాంటి ప్రమాదం ఉండదన్న నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. కానీ అలాంటి వారు సైతం ఈ మహమ్మారిని ఎదుర్కోలేక ప్రాణాలొదులుతున్నారని చెబుతోంది అలెక్సాండ్రియా. మరి, ఈ నర్సు మాటల్ని విని మనమూ మేల్కొందాం.. సామాజిక దూరం పాటిస్తూ, పరిశుభ్రంగా ఉంటూ కరోనాను ఎదుర్కొందాం.. మన వల్ల మన చుట్టూ ఉన్న వారు, డాక్టర్లు, వైద్య సిబ్బందికి బాధ కలగకుండా సామాజిక బాధ్యత వహిద్దాం..!
స్టే హోమ్.. స్టే సేఫ్!
Photo: Facebook