ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ని పాటిస్తోన్న నేపథ్యంలో కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులు దొరకడమే గగనమైపోయింది. ఒకవేళ దొరికినా వాటిని కొనడానికి గడపదాటడానికి సైతం జంకుతున్నారు చాలామంది. ఇక ఆడవాళ్లకు అత్యవసరమైన శ్యానిటరీ న్యాప్కిన్ల లభ్యత కూడా ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. ఒకవేళ లభించినా.. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మహిళలు వాటిని కొనడానికి కూడా డబ్బుల్లేక నానా అవస్థలూ పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రత లోపించి లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న లక్నో జిల్లా అధికార యంత్రాంగం లాక్డౌన్ కారణంగా శ్యానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మహిళలకు ఈ విధంగా అండగా నిలవాలని నిర్ణయించుకుందా ప్రభుత్వం.
కరోనా దెబ్బకి చాలా ప్రపంచ దేశాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. చాలా చోట్ల ఆయా ప్రభుత్వాలు విధించిన కఠిన చర్యలతో ప్రజలు ఇల్లు దాటి బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఈ బాటలోనే మన దేశం కూడా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలకు అత్యంత అవసరమైన శ్యానిటరీ న్యాప్కిన్లు లభ్యం కావడం కష్టంగా మారింది. అలాగే ఇవి నిత్యావసర వస్తువుల జాబితాలో లేకపోవడం వల్ల ప్రస్తుతం లాక్డౌన్ పిరియడ్లో పనిచేస్తోన్న చాలా ఆన్లైన్ పోర్టల్స్లోనూ శ్యానిటరీ ప్యాడ్స్ లభించట్లేదు. అందుకే ఇలాంటి కష్ట సమయంలో తమ జిల్లాలోని మహిళలకు అండగా నిలబడడానికి లక్నో జిల్లా అధికార యంత్రాంగం నడుం బిగించింది. దీనికి సంబంధించి ఆ జిల్లా మెజిస్ట్రేట్ ఒక ప్రకటనని విడుదల చేశారు.
‘సఖి’ వ్యాన్లతో సరఫరా..!
న్యాప్కిన్ల గురించి జిల్లా మెజిస్ట్రేట్ విడుదల చేసిన ప్రకటనలో భాగంగా.. ‘లాక్డౌన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లోని మహిళలకు శ్యానిటరీ న్యాప్కిన్లు లభ్యం కావడం లేదని తెలిసింది. అలాంటి ప్రాంతాలకు ఒక రూట్ ఛార్ట్ని సిద్ధం చేశాం. ఆయా ప్రాంతాలకు న్యాప్కిన్లతో పాటు.. సబ్బులు, శానిటైజర్స్ కూడా అందించడానికి ‘సఖి’ పేరుతో 6 వ్యాన్లను సిద్ధం చేశాం. ఇవే కాదు ఆడవాళ్లకు ఏ వస్తువులు కావాల్సి వచ్చినా 7905323611అనే హెల్ప్లైన్కి సమాచారం అందించవచ్చు..’ అంటూ చెప్పుకొచ్చారాయన.
ఇవెంతో అత్యవసరం..!
ఇటీవలే లాక్డౌన్ ప్రకటన నేపథ్యంలో శ్యానిటరీ న్యాప్కిన్లను ప్రభుత్వం అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చినట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ట్వీట్ చేశారు. ‘శ్యానిటరీ న్యాప్కిన్ల లభ్యతపై పెరుగుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని.. కేంద్ర హోం సెక్రటరీ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఒక వివరణ జారీ చేశారు. ఈ క్రమంలో శ్యానిటరీ న్యాప్కిన్లను అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చినట్లు ప్రకటించారు..’ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు స్మృతి.
కేవలం కరోనా సమయంలోనే కాకుండా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా శ్యానిటరీ న్యాప్కిన్లను అత్యవసర వస్తువుల జాబితాలో కొనసాగించడం, వాటిపై ఉండే జీఎస్టీని ఎత్తేయడం, మారుమూల పల్లెల్లో, గిరిజన తండాల్లో ఉచితంగా పంపిణీ చేయడం.. వంటివి చేస్తే ఎందరో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతకు దూరం కాకుండా ఉంటారు.. తద్వారా ఈ క్రమంలో వచ్చే ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.