కరోనా ధాటికి మానవజాతి విలవిల్లాడిపోతోన్న నేపథ్యంలో.. ప్రపంచమంతా ఒక్కటై ఈ మహమ్మారిపై పోరాటం సాగిస్తోంది. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, పోలీస్.. తదితర అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీళ్లతో పాటు సామాజిక స్పృహ కలిగిన మరికొందరు సైతం ఈ ఆపద సమయంలో సమాజానికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తు్న్నారు. ఈ క్రమంలో కొంతమంది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాథమికంగా ఉపయోగించే మాస్కులను స్వయంగా రూపొందిస్తున్నారు. ఇలాంటి కొంతమంది మహిళామణుల గురించి తెలుసుకుందాం రండి..!
సూది, దారం ఉంటే చాలు..!
దేశవ్యాప్తంగా మాస్కులకు కొరత ఏర్పడడంతో అవకాశం ఉన్న వాళ్లు మాస్కులను ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని సూచనలను అటు సామాన్యులతో పాటు ఇటు ప్రముఖులు సైతం అనుసరిస్తు్న్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇంటి వద్దే స్వయంగా మాస్క్‌ను తయారు చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆమె ట్విట్టర్లో షేర్ చేస్తూ 'ఇంట్లో కూర్చొని సూది, దారం సహాయంతో కూడా రీయూజబుల్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు' అని రాసుకొచ్చారు.
నాలుగు రోజుల్లో 700 మాస్కులు..!
ఇతరులకు సేవ చేయాలనే తపనుండాలే కానీ.. వృత్తి, కుటుంబ బాధ్యతలు, సమయం, డబ్బు.. ఇవేవీ మనల్ని అడ్డుకోలేవు..! ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది మధ్యప్రదేశ్‌కి చెందిన సృష్టి శ్రోతియా..! సృష్టి మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో పోలీసు అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. వృత్తిరీత్యా అక్కడి ప్రజల్లో ఆమెకు మంచి పేరుంది. సృష్టికి సమాజం పట్ల బాధ్యత కూడా ఎక్కువే..! అయితే మన దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో మార్కెట్లో మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో కొంతమంది వీటిని అధిక ధరలకు విక్రయిస్తు్ండడంతో ఎంతోమంది సామాన్యులు వీటిని కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సృష్టి తన వంతు సహాయాన్ని అందించాలనుకుంది.
ఈ క్రమంలో రోజూ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగొచ్చాక సృష్టి స్వయంగా మాస్కులను రూపొందించడం ప్రారంభించింది. వీటిని మాస్కులు కొనలేని వారికి ఉచితంగా అందజేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పటివరకు సుమారు 700 మాస్కులను తయారు చేసి పేదలకు పంచిపెట్టడం విశేషం. సృష్టి చేస్తోన్న ఈ పని తన సహోద్యోగులకు స్ఫూర్తినిచ్చింది. ఈ క్రమంలో ఆమె చేస్తోన్న సేవను వివరిస్తూ వాళ్లు ఓ వీడియోను రూపొందించి ట్వి్ట్టర్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. సృష్టి చేస్తోన్న సేవ గురించి ఆమె పైఅధికారి రోహిత్ మిశ్రా స్పందిస్తూ ‘సమాజం పట్ల ఆమెకున్న బాధ్యత, అంకితభావం చూసి మేమంతా గర్విస్తున్నాం..!’ అని కొనియాడారు.
వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది..!
కరోనాపై పోరాటాన్ని సాగించే క్రమంలో పలువురు ప్రముఖులే కాదు.. వారి కుటుంబ సభ్యులు సైతం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సతీమణి మృదుల, కుమార్తె నైమిషలు కూడా పేదల కోసం మాస్కులు రూపొందిస్తుండడం విశేషం. ఈ విషయాన్ని ధర్మేంద్ర సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ‘ఈ విపరీత పరిస్థితుల్లో సమాజానికి మన వంతు సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో నా భార్య, కూతురు ఇంట్లోనే స్వయంగా మాస్కులు తయారు చేస్తున్నారు. వీటిని మా కుటుంబ సభ్యులతో పాటు.. మాస్కులు అవసరం ఉన్న వారికి అందిస్తున్నారు. వీళ్లని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. మనలో దాగున్న ఇలాంటి కళలను కనుగొనడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చారు.
వీళ్లతో పాటు మరెందరో వివిధ రకాలుగా సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. కరోనాకు మానవజాతికి మధ్య జరుగుతోన్న ఈ సమరంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు.. ఇలాంటి వాళ్ల శ్రమ కూడా వెలకట్టలేనిదే..!
Image Courtesy: twitter