కరోనా వైరస్ కారణంగా కోట్లాది మంది ఇళ్లకు పరిమితమయ్యారు. అదే సమయంలో అదే కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు, నర్సులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. రోగులకు చికిత్స చేసే క్రమంలో తమకు వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందజేస్తున్నారు ఎందరో వైద్య సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రాణాంతక వైరస్‌పై పోరాటం కొనసాగిస్తున్నారు. వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవకే చెందుతారు బ్రిటన్‌కు చెందిన డాక్టర్ రూపా ఫారూఖీ. ఇంగ్లండ్‌లోని క్వీన్ ఎలిజబెత్ మదర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారామె. ఈక్రమంలో విధి నిర్వహణలో భాగంగా తనకెదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరును తాజాగా అందరితో పంచుకున్నారు రూప.
సంరక్షణ పరికరాలు లేకుండానే!
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారిన పడడం గమనార్హం. వీరితో పాటు వేలాదిమంది ఈ మహమ్మారి సోకి మృత్యువాత పడగా లక్షలాది మంది క్వారంటైన్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అక్కడి వైద్య సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయితే బ్రిటన్‌తో పాటు చాలా దేశాల్లో వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ గేర్ ఎక్విప్మెంట్) సూట్స్ లేక చాలామంది వైద్య సిబ్బంది విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో బ్రిటన్ వైద్యురాలు రూప కూడా ఎలాంటి సంరక్షణ పరికరాలు లేకుండానే కరోనా బాధితులకు సేవలు చేస్తున్నామంటోంది. రచనా వ్యాసంగంలోనూ పట్టున్న ఆమె కరోనాపై పోరులో తనకెదురైన ఓ అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంది.
నా దుస్తులపై వాంతి చేసుకున్నారు!
‘నా విధి నిర్వహణలో భాగంగా బాగా ఇబ్బంది పడుతున్న ఓ రోగికి సహాయం చేసేందుకు నేను పరిగెత్తాను. తనను స్టెబిలైజ్ చేస్తుండగానే నా దుస్తుల మీద వాంతి చేసుకున్నారు. ఆ సమయంలో నాకు పీపీఈ సూట్ కూడా లేదు. ఆ తర్వాత ఆ రోగికి కరోనా సోకినట్లు నిర్ధారితమైంది. ఇలాంటి అనుభవాలను వైద్యులు రోజూ ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులను కాపాడతామని మేం ప్రమాణం చేశాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మమ్మల్ని మేం కాపాడుకోలేకపోతున్నాం’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చారు రూప.
రూప షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులను కాపాడుతున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈక్రమంలో ‘గాడ్ బ్లెస్ యూ మేడమ్... మీరు సురక్షితంగా ఉండాలి’, ‘మీరు నిజంగా యోధులు’, ‘ డాక్టర్లకు ఇలా జరగడం దురదృష్టకరం’, ‘వైద్యుల రక్షణకు ప్రభుత్వాలు మెరుగైన చర్యలు తీసుకోవాలి’ అని నెట్ ప్రియులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Photo: https://twitter.com/RoopaFarooki/photo