కరోనా ప్రభావంతో అగ్రదేశమైన బ్రిటన్ కూడా అతలాకుతలమవుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్స్ చార్లెస్ తదితర ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడడం గమనార్హం. చిన్నా, పెద్ద, పేద, ధనిక, సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న వైరస్ కారణంగా బ్రిటన్‌లో సుమారు 5వేలమందికి పైగా మరణించారు. ఈక్రమంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్‌తో సరికొత్త మాయాలోకాన్ని సృష్టించిన జేకే రౌలింగ్ తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డానని ప్రకటించింది. అయితే వైద్యుడైన తన భర్త సూచించిన కొన్ని సలహాలను పాటించడంతో ఎటువంటి పరీక్షలు, చికిత్స చేయించుకోకుండానే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారామె. మరి ఆమె పాటించిన ఆ సలహాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
పరీక్షలు కూడా చేయించుకోలేదు!
‘హ్యారీ పోటర్’ సిరీస్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు జేకే రౌలింగ్. తన రచనలతో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారామె. ఈక్రమంలో రెండువారాల క్రితం ఆమెలో కూడా కరోనా లక్షణాలు కనిపించాయట. అయితే ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని చెప్పుకొచ్చిన ఆమె ... యూకేలో వైద్యుడిగా పనిచేస్తున్న తన భర్త నీల్ముర్రే అందించిన కొన్ని సలహాలు మాత్రం తూచా తప్పకుండా పాటించారట. ఈ నేపథ్యంలో తాను ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారామె. దీంతో పాటు కరోనా సోకిందనే అనుమానం ఉన్నా, కరోనా లక్షణాలు కనిపించినా వాటి నుంచి బయటపడేలా ఓ బ్రీతింగ్ టెక్నిక్కు సంబంధించిన చిట్కాను కూడా అందరితో పంచుకున్నారు.
‘నేను కూడా గత రెండు వారాలుగా కరోనా లక్షణాలతో బాధపడ్డాను. కానీ నా భర్త సిఫారసు చేసిన ఆరోగ్య సలహాలతో ప్రస్తుతం నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా. ఇక నా క్షేమ సమాచారం కోరుతూ సందేశాలు పంపిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రాణాంతకమైన మహమ్మారి నుంచి కోలుకునే క్రమంలో నాకు బాగా సహకరించిన ఓ చిట్కాను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ టెక్నిక్ పాటించడం చాలా సులభం. ఎలాంటి ఖర్చు అవసరం లేదు. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. నాకు లాగానే ఈ సలహాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడతాయి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారామె.
ఈ చిట్కాలు పాటించండి...
జేకే రౌలింగ్ షేర్ చేసిన వీడియోలో కరోనా లక్షణాల నుంచి బయటపడడానికి లండన్‌లోని క్వీన్స్ ఆస్పత్రి వైద్యులు సూచించిన సలహాలను మనం వినవచ్చు. ముఖ్యంగా కరోనా తొలిస్థాయిలో ఉన్న వారు త్వరగా కోలుకోవడానికి ఓ బ్రీతింగ్ టెక్నిక్కు సంబంధించి పాటించాల్సిన విధి విధానాలను ఇలా చెప్పుకొచ్చారు.
ఆ చిట్కా ఏంటంటే!
* మొదట 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ప్రతిసారి 5 సెకన్ల పాటు వూపిరి బిగపట్టి, ఆ తర్వాత విడిచిపెట్టాలి.
* ఆరోసారి శ్వాస పీల్చిన సమయంలో పెద్దగా దగ్గు రావచ్చు. ఆ సమయంలో మూతికి అడ్డంగా చేతి రుమాలు కానీ, ఏదైనా గుడ్డ అడ్డుపెట్టుకొని దగ్గాలి.
* ఇలా రెండుసార్లు చేయాలి. అనంతరం దీర్ఘంగా శ్వాస పీల్చుతూ పదినిమిషాల పాటు బెడ్‌పై బోర్లా పడుకోవాలి.
* సాధారణంగా వూపిరితిత్తులు మన ముందు వైపు ఛాతీకి దగ్గరగా ఉండవు. వీపు వైపే ఉంటాయి. అందుకే బెడ్‌పై బోర్లా పడుకుని దీర్ఘ శ్వాస తీసుకోవాలి.
ఇక వీడియోలో చివరిగా వైద్యుడు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన వారే కాకుండా, ఈ మహమ్మారి బారిన పడని వారు కూడా ముందు జాగ్రత్తగా ఈ చిట్కాను పాటిస్తే చాలా మంచిదని సూచించాడు.