ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో అయితే ఆసుపత్రుల్లో మంచాలు, వెంటిలేటర్లు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతున్నాయి. తద్వారా వయసు మళ్లిన వారిని పక్కన పెట్టి యువత, చిన్నారులకే చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా బారిన పడిన తాను ఎలాగో ఎక్కువ కాలం బతకనని భావించిన ఓ బామ్మ.. తనకంటే వయసులో చిన్న వారి జీవితాన్ని రక్షించడానికి ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసిందంటే..?
తమ జీవితాలను త్యాగం చేసి ఇతరులను బతికించాలంటే ఎంతో గొప్ప హృదయం, అంతకుమించిన ధైర్యం ఉండాలి. ఈ రెండూ తన సొంతమని, తాను మరణించినా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వారు బతికితే చాలని కోరుకుంటూ తన ప్రాణాలనే త్యాగం చేసింది బెల్జియంకు చెందిన సుజాన్ హోయ్లర్ట్స్ అనే 90 ఏళ్ల బామ్మ.
నేను సంతోషంగా జీవించాను.. అది చాలు!
బెల్జియంకు చెందిన ఈ బామ్మకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. మార్చి 20న ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు. క్రమంగా ఆమె ఆరోగ్యం దిగజారుతూ వచ్చింది. వెంటిలేటర్‌పైనే ఉంచి కృత్రిమ శ్వాస ద్వారా సుజాన్‌ను బతికిస్తూ వచ్చారు వైద్యులు. ఇక ఎంతకీ వ్యాధి నయం కాకపోవడంతో తనకు వెంటిలేటర్‌ను తొలగించమని వైద్యులను వేడుకుంది. ‘నాకు కృత్రిమంగా శ్వాసను అందించడం ఆపేయండి. నేను ఇప్పటికే చాలా జీవితాన్ని చూశాను. నాకు ఉపయోగిస్తున్న ఈ వెంటిలేటర్‌ను నాకంటే చిన్న వారి కోసం ఉపయోగించండి.. కనీసం వారికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని డాక్టర్లకు విన్నవించుకుంది సుజాన్. దీంతో వెంటిలేటర్‌ను తొలగించిన తర్వాత కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సుజాన్.. చివరికి ప్రాణాలను విడిచింది. ఇలా తన ప్రాణాన్ని త్యాగం చేసి మరీ ఇంకొకరి ప్రాణం నిలిచేలా చేసి త్యాగానికి ఎలాంటి హద్దులూ లేవని నిరూపించిందీ బామ్మ.
Photo: Facebook