కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా గృహ నిర్బంధం చేసుకొని ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం నోటికి మాస్కులు ధరిస్తూ బయటకు వస్తున్నారు. అయితే లండన్‌కు చెందిన ఓ మహిళ వినూత్న రీతిలో బయటకు వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. స్వీయ నిర్బంధంలో భాగంగా ఆ మహిళ షాపింగ్ మాల్‌కు వచ్చిన క్రమంలో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ తరహా వాతావరణమే కనిపిస్తోంది. నిత్యావసర సరుకుల కోసం కూడా జనాలు తగిన రక్షణ చర్యలను తీసుకునే బయటకు వస్తున్నారు. ఇదే క్రమంలో లండన్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అయితే అది కూడా మనలాగా మాస్కులు ధరించి సాదాసీదాగా నడుచుకుంటూ కాదు.. జోర్బ్ బాల్ (పెద్ద రబ్బరు బంతి)లో నడుచుకుంటూ మరీ వెళ్లింది. రోడ్డుపై బంతిలో నడుస్తూనే సూపర్ మార్కెట్ చేరుకుంది. ఇక ఆమెతో పాటు తోడుగా ఒక సహాయకుడు కూడా వచ్చాడు. ఆ మహిళ ఆదేశాల మేరకు ఆ వ్యక్తి సామాన్లు తీసి బాస్కెట్లో పెడుతుంటాడు. అంతేనా.. ఆమె నడుస్తున్న క్రమంలో బంతికి మట్టి అంటుకోవడంతో దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ముందుకు సాగాడతను. ఇదంతా చూసిన అక్కడి జనం, ఇతర సిబ్బంది ఓవైపు ఆశ్చర్యపోతూనే.. మరోవైపు నవ్వులు రువ్వారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.
ఇక ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘రోడ్డుపై ఉన్న చెత్తంతా బంతికే అంటుకుంది’, ‘కరోనా వ్యాపించకుండా ఆ మహిళ పాటించిన చిట్కా భలే ఉంది’, ‘కరోనా వైరస్ ఏమో కానీ జనాలు వింతగా ప్రవరిస్తున్నారు’.. అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..