కరోనా ఆడుతోన్న విలయ తాండవానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కానీ, అత్యవసర సేవల కోసం కొన్ని రంగాలకు చెందిన వాళ్లు మాత్రం తమ విధుల్లో కొనసాగుతున్నారు. వీరిలో వైద్య రంగానికి చెందిన డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు.. తదితర సిబ్బంది కూడా ఉన్నారు. వీళ్లు కరోనా లేదా ఇతర రోగాలతో ఆసుపత్రుల్లో చేరుతోన్న రోగులకు వైద్య సేవలందించేందుకు పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా నిరంతరం పని చేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్-19 లక్షణాలున్న వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు వీళ్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో యూకేలో పారామెడిక్ (ఎమర్జెన్సీ కేర్ అసిస్టెంట్)గా సేవలందిస్తోన్న ఓ యువతి డ్యూటీకి వెళ్తుండగా తన కాలనీ వాసులంతా ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా దాటికి ప్రపంచమంతా స్వీయ నియంత్రణ పాటిస్తోన్న ఈ సమయంలో ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు వైద్యులు, పోలీసులు, మీడియా, ప్రభుత్వాధికారులు, బ్యాంక్ ఉద్యోగులు.. ఇలా ఎంతోమంది తమ వ్యక్తిగత జీవితాల్ని సైతం త్యాగం చేస్తూ విధుల్లో కొనసాగుతున్నారు. వీళ్లకు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మనపై కచ్చితంగా ఉంది. మన దేశంలో మార్చి 22న జరిగిన ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈ ఆపద సమయంలో మన కోసం సేవలందిస్తోన్న వారికి చప్పట్లతో కృతజ్ఞతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా యూకేలో కూడా అత్యవసర విభాగాల్లో కొనసాగుతోన్న వారికి ఇటీవల అక్కడి ప్రజలు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ కేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోన్న టయ్లా పోర్టర్ అనే 22 ఏళ్ల యువతికి అక్కడి కాలనీ వాసులంతా కలిసి కరతాళ ధ్వనులతో ఆమెకు ధన్యవాదాలు తెలపడం విశేషం.
తమ దేశంలో అత్యవసర సేవలు అందిస్తోన్న వారిలో తన కూతురు కూడా ఉందని టయ్లా తల్లి అలీ పోర్టర్ తమ కాలనీ వాసుల ఫోరమ్ ద్వారా అక్కడి వాళ్లందరికీ సందేశం పంపింది. దీంతో టయ్లా డ్యూటీకి వెళ్లడం కోసం ఇంటి నుంచి బయటికి రాగానే కాలనీ వాసులంతా తమ ఇళ్లలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి గట్టిగా చప్పట్లు కొడుతూ తను చేస్తోన్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో టయ్లా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా తీసిన వీడియోను టయ్లా తల్లి అలీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘ఈ స్పందన మా కుటుంబ సభ్యులందరిలో ఎంతో ఆనందాన్ని నింపింది. తను చేస్తో్న్న పని ఇంతమందికి తెలుసనే విషయాన్ని తను ఇప్పటికీ నమ్మలేకపోతోంది. నేను పెట్టిన సందేశాన్ని చూసి మా ఇరుగు, పొరుగు వాళ్లు తప్ప ఇంకెవ్వరూ బయటకు రారేమో అనుకున్నాను. కానీ, కాలనీలో ఉన్న ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ నా బిడ్డను అభినందిస్తారని నేను ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే యూకే దేశమంతా ఆరోజు రాత్రి 8 గంటల సమయానికి చప్పట్లు కొట్టాలని ప్రభుత్వం అక్కడి ప్రజలను కోరగా.. దానికి నాలుగు గంటల ముందే టయ్లాను తన కాలనీ వాసులు కరతాళ ధ్వనులతో అభినందించడం విశేషం.