‘ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అందరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే’...! ‘ఠాగూర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ ఒక్కటి చాలు...డాక్టర్ల గొప్పతనమేంటో చాటి చెప్పడానికి..! ఇక ‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. ప్రస్తుతం కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులను, నర్సులను చూస్తే చాలామందికి ఈ మాటలే గుర్తుకు వస్తాయి. రోగుల కారణంగా ఎక్కడ తమకు వైరస్ సోకుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూనే వారు వైద్య సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ప్రాణాంతక వైరస్‌ను తరిమికొట్టేందుకు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. తమ సేవా నిరతిని చాటుతున్నారు. ఈ క్రమంలో ఈ మహమ్మారి తమ జీవితాలను పూర్తిగా మార్చేసిందంటూ ఓ వైద్యుడి భార్య పెట్టిన పోస్ట్ ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది.
చంటి బిడ్డను కనీసం తాకలేదు!
అమెరికాలోని అట్లాంటాలో నివాసముంటున్న రాచెల్ ప్యాట్జెర్ భర్త ఓ ఆస్పత్రిలో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు. ఇందులో మూడు వారాల క్రితమే జన్మించిన ఓ పండంటి బిడ్డ కూడా ఉంది. అయితే కరోనా కారణంగా ఇప్పటివరకు తన బిడ్డను తన భర్త కనీసం చేతుల్లోకి తీసుకోలేదని వాపోయిన రాచెల్ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
‘నా భర్త ఓ ఆస్పత్రిలో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎమర్జెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన కరోనా రోగులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. అయితే ఆయన నుంచి ఇతరులకు వైరస్ సోకుతుందేమోనని నా భర్తను మా అపార్ట్మెంట్లోనే నిర్భంధంలో ఉంచారు. ఈ నిర్ణయం నాకు చాలా కఠినంగా అనిపిస్తోంది. మాకు మూడు వారాల బిడ్డతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. మమ్మల్ని విడిచి క్షణమైనా ఉండలేని ఆయన..కొన్ని వారాల పాటు దూరంగా ఉండడం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటీవల మా జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టిన నా బిడ్డను ఆయన ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా తాకలేదు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్లు చేస్తున్న చేస్తున్న త్యాగానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ’.
కొందరు మాత్రం అలా!
‘రోగులను కాపాడడానికి నా భర్త అన్నింటినీ త్యాగం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బయట కొన్ని బార్లు, రెస్టరంట్లలో కిక్కిరిసిన జనాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎంతోమంది డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు వైద్య సేవలు అందిస్తుంటే మరి కొద్దిమంది మాత్రం సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. దీనిని అందరూ తీవ్రంగా పరిగణించాల్సిందే. రోజురోజుకూ రోగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది. దీంతో వైద్యులపై తీవ్ర భారం పడుతోంది. అయినా వారు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు మనమందరం సలామ్ చెప్పాల్సిందే..!’ అని వరుస ట్వీట్లలో రాసుకొచ్చింది రాచెల్.
మేం కూడా!
వైద్యుల త్యాగాన్ని వర్ణిస్తూ రాచెల్ షేర్ చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు వైద్యుల సేవలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా కరోనా రోగులకు వైద్యం అందించిన పలువురు నర్సులు, వైద్యులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.