ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మెక్సికో నగర రహదారులన్నీ ఆరోజు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కార్యాలయాలన్నీ వెలవెలబోయాయి. బడులన్నీ బోసిపోయాయి. కళాశాలల్లో కుర్రకారు హుషారు కనిపించనేలేదు. నిత్యం సందడిగా ఉండే షాపింగ్‌మాల్స్‌లో కూడా నిశ్శబ్దం రాజ్యమేలింది. అక్కడక్కడా ఒకరిద్దరు పురుషులు తప్పితే మచ్చుకు ఓ మహిళ జాడ కూడా కనిపించలేదు. ఈ పరిస్థితులను చూస్తుంటే ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ‘కరోనా’ మెక్సికోకు వచ్చిందేమో అనుకుంటున్నారా? అసలు విషయం అది కాదండోయ్...! మరి నిత్యం జన సమూహంతో సందడిగా ఉండే మెక్సికో నగరం మార్చి 9న ఎందుకు మూగబోయిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

స్ర్తీ లేని సమాజం ఇలాగే ఉంటుంది!
అతివలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నా, కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు వారిని వెనక్కిలాగుతున్నాయి. ముఖ్యంగా హింస, అత్యాచారాలకు గురవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యా్ప్తంగా ఏటా ఎంతోమంది ఆడవాళ్లు అదృశ్యమైపోతున్నారు. అలా మహిళల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన దేశాల్లో మెక్సికో కూడా ఒకటి. గడిచిన రెండేళ్లలో అక్కడి మహిళలపై అరాచకాలు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. ఓ సర్వే ప్రకారం అక్కడ రోజుకు సగటున 10 మంది మహిళలు హత్యకు గురవుతున్నారు. సగటున రోజుకొక బాలిక దుండగుల చేతిల్లో బలవుతోంది. ప్రాణాలు కోల్పోయిన బాధితుల్లో 57 శాతం మందికి పైగా మహిళలు తమ భర్తల అకృత్యాలకు బలైనవారే కావడం గమనార్హం . ఇక రేప్ కేసులకు సంబంధించి 99శాతం మంది నిందితులకు అసలు శిక్ష పడట్లేదట. ఇక గతేడాదిలో మొత్తం 7,654 మంది మహిళలు అదృశ్యమయ్యారట. వీటికి కొనసాగింపుగా ఈ ఏడాదిలో కూడా ఇప్పటివరకు మొత్తం 267 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఆడవారి మీద రోజురోజుకూ పెరిగిపోతున్న హింసకు వ్యతిరేకంగానే మార్చి 9న వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు మెక్సికన్ మహిళలు. అదే ‘ఎ డే వితౌట్ వుమెన్’. ఈ క్రమంలో స్ర్తీలు లేని సమాజం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చూపించాలనుకున్న మహిళలు ఆరోజు ఎలాంటి విధులకు హాజరు కాలేదు.
అతివల భద్రత ప్రశ్నార్థకం!
మెక్సికోలో ఆడవారి భద్రత రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక ఫిబ్రవరిలో ఫాతిమా అనే ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు ఆ విద్యార్థిని అపహరించి దారుణంగా హింసించి హతమార్చారు. కొన్ని రోజులకు ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆ బాలిక మృతదేహం దొరికింది. ఆ బాలిక శరీరంపై ఎలాంటి దుస్తులు లేవు..అంతా రక్తపు మరకలే. ఇక మహిళలందరికీ ప్రత్యేకమైన ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రోజున కూడా ఓ యూనివర్సిటీ విద్యార్థిని దుండగుల ఆకృత్యాలకు బలైపోయింది. ఆమెతో పాటు అదే రోజు ఓ నిండు గర్భిణి, మరో 20 ఏళ్ల యువతి కూడా అలాగే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా వీటిని ఏ మాత్రం అరికట్టకుండా చోద్యం చూస్తోంది అక్కడి ప్రభుత్వం.
అలా నిరసన తెలిపారు!
ఈ నేపథ్యంలో తమ దేశ ప్రభుత్వం, అధ్యక్షుడి తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు మెక్సికన్ మహిళలు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నుంచే తమ నిరనన ప్రణాళికలు అమలు చేయడం ప్రారంభించారు. మార్చి 8న ప్రపంచమంతా మహిళా దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతుంటే మెక్సికన్ మహిళలు మాత్రం తమపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. తమ ఆవేదనను వెళ్లగక్కుతూ వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహిళలతో పాటు పురుషులు, పిల్లలు...ఇలా వృద్ధులు సుమారు 80 వేల మంది మెక్సికన్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే దీనిని అడ్డుకునే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో సుమారు 60 మంది నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక సోమవారం (మార్చి 9) నాడు వినూత్న నిరసనకు పిలుపునిచ్చిన మహిళలు ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని, విధులకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ‘ఎ డే వితౌట్ ఉమెన్’ అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా ముందుగానే అందరికీ ఈ విషయం తెలియజేశారు.
అందరూ మద్దతిచ్చారు!
ఈ నిరసనలో భాగంగానే విద్యార్థినులు స్కూళ్లకు సెలవు పెట్టేశారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, యువతులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అలా ఆ రోజంతా మహిళలు ఎక్కడా కనిపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఆకాశంలో సగమైన స్ర్తీలు లేని సమాజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించారు. ఈ నిరసనకు మెక్సికోలోని స్త్రీవాదులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తల నుంచి సామాన్యుల వరకూ అందరూ మద్దతివ్వడం విశేషం. ఈ క్రమంలో ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఇంటి పనులేమీ చేయకుండా ఈ నిరసనకు సహకరించారు.
అధ్యక్షుడి ప్రెస్‌మీట్ కూడా బాయ్‌కాట్ !
సాధారణంగా ఎలాంటి బంద్లున్నా, నిరసన కార్యక్రమాలున్నా జర్నలిస్టులు తమ విధులకు హాజరవుతుంటారు. అయితే ‘ఎ డే వితౌట్ ఉమెన్’ పేరుతో సోమవారం నిర్వహించిన నిరసనలో మహిళా జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షుడు లొపెజ్ సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను కూడా బాయ్‌కాట్ చేశారు మహిళా జర్నలిస్టులు. దీంతో అధ్యక్షుడి సమావేశంలో అన్నీ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఇక ప్రముఖ జర్నలిస్టులు రాసే వ్యాసాలను దిన పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురిస్తుంటారు. అయితే నిరసనలో భాగంగా మహిళా జర్నలిస్టులు సోమవారం ఎలాంటి విధులకు హాజరు కాలేదు. దీంతో పలు దినపత్రికలు ఆయా పేజీలను ఖాళీగానే ప్రచురించడం గమనార్హం. అదేవిధంగా ఈ ఆందోళనకు మద్దతు పలుకుతూ పలు దినపత్రికలు తమ పేజీలను పర్పుల్ కలర్లో ప్రచురించాయి.