‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. ‘దాంతో పాటు మహిళలుగా మనపై మనం నమ్మకముంచాలి.. అప్పుడే విజయం మన ముంగిట వాలుతుంది..’ అంటోంది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. 2009లో బ్యాడ్మింటన్ క్రీడలోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ.. దశాబ్ద కాలంలోనే ఎన్నో విజయాలు అందుకొని దేశానికి పతకాల పంట పండించింది. తన కీర్తి కిరీటంలో మరెన్నో అవార్డులతో మురిసి మెరిసిన ఈ స్టార్ షట్లర్.. తాజాగా మరో ఘనత సాధించింది. ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ - 2019’ అవార్డు గెలుచుకొని మరింత మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోందీ సూపర్బ్ షట్లర్. ఇక ఈ పురస్కారాల్లో భాగంగా పరుగుల రాణి పీటీ ఉషను ‘లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు’తో సత్కరించింది బీబీసీ.
కృషి చేస్తే విజయం మనదే!
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఐదు పతకాలు సాధించిన సింధు.. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకుంది. దీంతో ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఇలా తన పదేళ్ల కెరీర్లో ఎన్నెన్నో పురస్కారాల్ని తన కీర్తి కిరీటంలో చేర్చుకున్న ఈ బ్యాడ్మింటన్ సంచలనం.. తాజాగా ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ - 2019’ పురస్కారం గెలుచుకుంది. ఈ సందర్భంగా తన మనోభావాలను ఇలా పంచుకుందీ స్టార్ షట్లర్.

‘యువ క్రీడాకారిణులకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. మహిళలుగా మనపై మనకు నమ్మకముండాలి. కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుంది. మరెంతో మంది మహిళా క్రీడాకారులు రాణిస్తూ దేశానికి పతకాల పంట పండిస్తారనే బలమైన నమ్మకం నాకుంది. నన్నెంతగానో ప్రోత్సహించి ఆదరించిన నా అభిమానులకు ఈ అవార్డును అంకితమిస్తున్నా.. ఇలాంటి అవార్డులు మనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.. ఇంకెంతగానో ప్రోత్సహిస్తాయి..’ అంటూ యువ క్రీడాకారిణుల్లో స్ఫూర్తి నింపిందీ బ్యాడ్మింటన్ ప్లేయర్. ప్రస్తుతం ఈ ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోందీ హైదరాబాదీ స్టార్ షట్లర్.

ఎలాంటి సౌకర్యాలు లేని రోజులవి!
క్రీడాకారిణులకు ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొని మేటి అథ్లెట్‌గా పేరుతెచ్చుకుంది పరుగుల రాణి పీటీ ఉష. తన కెరీర్లో దాదాపు వందకు పైగా అంతర్జాతీయ పతకాలు అందుకొని ఈ క్రీడలో ఎందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిన ఈ రన్నింగ్ క్వీన్‌ను.. తాజాగా బీబీసీ ‘జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించింది. అవార్డు అందుకున్న అనంతరం తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న కష్టాల్ని ఓసారి గుర్తుచేసుకుందీ స్టార్ అథ్లెట్. ‘నేను కెరీర్ ప్రారంభించినప్పుడు క్రీడాకారులు ఆటలో రాటుదేలడానికి ఎలాంటి సౌకర్యాలూ లేవు. నేనైతే రైల్వే ట్రాక్స్, బీచులనే నా శిక్షణ స్థలాలుగా మార్చుకున్నా. అప్పటికీ, ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయి. ఈ అవార్డు నాలా మరింత మందిని ఈ దిశగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని నాకు అందిస్తుంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ రన్నింగ్ క్వీన్.