ఈనెల 9న అట్టుక్కల్ వేడుక
కేరళలోని అట్టుక్కల్ అమ్మవారి దేవాలయాన్ని మహిళా శబరిమలై అని పిలవొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రధాన పూజలు, అర్చనల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఈస్ట్ ఫోర్టు ప్రాంతంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఇక్కడ జరిగే అట్టుక్కల్ పొంగల్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కేవలం మహిళలు మాత్రమే లక్షల సంఖ్యలో పాల్గొనే వేడుక కావడంతో దీనికి ఆ ప్రాధాన్యం ఏర్పడింది. అట్టుక్కల్ భగవతి అమ్మవారి చరిత్ర కేరళ, తమిళనాడుకు చెందిన పురాణగాథల్లో కనిపిస్తుంది. సరస్వతి, మహాలక్ష్మి, పార్వతిల సమ్మిళిత రూపం ఆమెది. నాలుగు చేతులలో ఆయుధాలు ధరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ కోసం అవతరించిన మూర్తిగా కనిపిస్తారు. పెద్దఎత్తున భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. తొట్టంపట్టు అనే పేరుతో ఉన్న గీతంతో అమ్మవారిని భక్తులు కీర్తిస్తుంటారు.
ఇదంతా ఒక ఎత్తయితే, భగవతి అమ్మవారి పుణ్యక్షేత్రం.. ‘అట్టుక్కల్ పొంగళ్ ’ఉత్సవం ద్వారా ప్రసిద్ధి చెందింది. మలయాళ మకర, కుంభ మాసాల్లో ఈ ఉత్సవాలు జరగుతుంటాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారి కీర్తనలు, భజనలు మార్మోగుతాయి. తొమ్మిదో రోజున అట్టుక్కల్ పొంగళ్ జరుగుతుంది. పూరమ్ నక్షత్రం ప్రారంభమైన సమయంలో పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ రోజు దేవాలయం చుట్టుపక్కల పది, పన్నెండు కిలోమీటర్ల దాకా మగవారికి ప్రవేశమే దొరకదు. వేకువ జామునే మహిళలు ఆలయానికి చేరుకొని కట్టెపొయ్యిలు సిద్ధం చేసుకొంటారు. పొంగళ్లు పెట్టి అమ్మవారికి నివేదిస్తారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొన్న వేడుకగా అట్టుక్కల్ పొంగల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా లభించింది. ఈ ఏడాది 30 లక్షలకు పైగా మహిళలు వేడుకల్లో పాల్గొంటారని అంచనా.
- రమా విశ్వనాథన్