ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ నేటికీ కొన్ని అంశాల్లో సమాజం విధించే కట్టుబాట్లు, మూఢనమ్మకాలు.. అమ్మాయిల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయి. అలా మహిళలను ఇబ్బందికి గురిచేస్తోన్న అంశాల్లో ‘నెలసరి’ ఒకటి. ప్రపంచాన్నే అరచేతిలో చూడగలిగేంత టెక్నాలజీ వచ్చినా కూడా.. ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రదేశాల్లో నెలసరి సమయంలో వంటింట్లోకి అడుగుపెట్టకూడదని, ఇతరులను ముట్టుకోకూడదని.. ఆంక్షలు పెడుతూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో నెలసరి పరిశుభ్రత గురించి అవగాహన లేకపోవడం వల్ల పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇక ఇంకొన్ని చోట్ల అన్నీ అందుబాటులో ఉన్నా, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన ఉన్నప్పటికీ శ్యానిటరీ న్యాప్కిన్లు కొనలేని ఆర్థిక పరిస్థితితో ఇబ్బందిపడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొనే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు బాలికలకు ఉచితంగా శ్యానిటరీ ప్యాడ్స్ అందిస్తున్నాయి. అయితే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా నోయిడా మెట్రో ట్రెయిన్ కార్పొరేషన్ కూడా మహిళలకు ఉచిత శ్యానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మెషీన్స్‌ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధమైంది. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..
శ్యానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా..!
ప్రతి నగరంలోనూ మెట్రో రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఎటువంటి ఇబ్బందీ లేకుండా గమ్య
స్థానాలకు చేరుకోవడానికి ఈ ప్రయాణం అనువుగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు మహిళల భద్రత విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నోయిడా మెట్రో ట్రెయిన్ కార్పొరేషన్ మరో అడుగు ముందుకేసింది. మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని’ పురస్కరించుకుని అక్కడి 21 మెట్రో స్టేషన్లలో ఉచిత శ్యానిటరీ నాప్కిన్స్ అందించేలా వెండింగ్ మెషీన్లను ఏర్పాటుచేసింది. దీని కోసం ప్రత్యేకమైన టోకెన్లను సైతం ఏర్పాటుచేస్తున్నారు. మార్చి 8 నుంచి మహిళా ప్రయాణికులు ఈ టోకెన్లను ఉపయోగించి ఉచిత శ్యానిటరీ నాప్కిన్లను పొందవచ్చు.
మహిళల కోసం ‘పింక్ స్టేషన్లు’..
ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉచిత శ్యానిటరీ ప్యాడ్స్‌తో పాటు.. నోయిడాలోని ‘సెక్టార్ 76’లో రెండు స్టేషన్లను ‘పింక్ స్టేషన్లు’గా మార్చనున్నారు. ఇందులో భాగంగా మహిళలకు వ్యానిటీ రూమ్స్, పింక్ టాయిలెట్స్‌తో పాటు.. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్, పిల్లలకు డైపర్ మార్చడానికి సౌకర్యాలు ఉండేలా ఈ స్టేషన్లలో మార్పులు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ రెండు స్టేషన్లలో పనిచేసే సిబ్బంది కూడా ఆడవారే కావడం విశేషం.