కొన్ని దశాబ్దాల క్రితం స్త్రీ అంటే సేవకురాలిగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆమెలోని అనంతమైన శక్తి నలుదిశలా ప్రసరిస్తోంది. గతంలో అవకాశం లేక పురుషాధిక్యం ప్రబలిందే కానీ అవకాశం ఇస్తే పురుషులను మించగలం అని నిరూపిస్తోంది. ఇంటి బాధ్యతలతో పాటు వృత్తి బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తిస్తూ.. స్త్రీలు తమకంటే మిన్న కాదు అన్న పురుషుల చేతే శభాష్ అనిపించుకుంటోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు జపాన్ మహిళలు. స్త్రీలంటే పిల్లలను కనిపెట్టి, ఇంటిని శుభ్రంగా ఉంచే సేవకురాలు అనే సంప్రదాయ భావాన్ని చెరిపేసిన వీరు, అదే పురుషాధిక్య ప్రపంచంతో ‘వృత్తిలోనూ మీ భాగస్వామ్యం కావాలి’ అనిపిస్తున్నారు. అందుకు జపాన్ ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్‌పై చేసిన ఓ సర్వే అద్దం పడుతోంది.

ఇంటికే పరిమితం చేయాలనుకున్నారు... కానీ తిరగబడ్డారు !
మూఢనమ్మకాలు, పురుషాధిక్యం అధికంగా ఉండే దేశాల జాబితా తీస్తే అందులో జపాన్ పేరు తప్పక చేర్చాల్సిందే. కొన్నేళ్ల వరకూ కూడా స్త్రీలు ఇంటికే పరిమితం అవ్వాలి అనుకునే పురుషుల సంఖ్యే ఆ దేశంలో ఎక్కువ. అయితే ఇటీవల కాలంలో ఈ భావజాలంపై స్త్రీలు తిరగబడ్డారు. ఎంతలా అంటే... అవసరమైతే ఒంటరిగా ఉండడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప పెళ్లి జోలికి వెళ్లడం లేదు. దీంతో జపాన్ యువకుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. తమతో సమానంగా జీవితాన్ని పంచుకోవాలని వచ్చే వారిని ఇంటికే ఎందుకు పరిమితం చేయాలి ? అన్న భావన నవతరం యువకుల్లో కలిగింది. తత్ఫలితంగా ఇప్పుడు తమతో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే వర్కింగ్ ఉమెన్‌పై జపాన్ ప్రభుత్వం చేసిన ఓ సర్వేలో 58.4 శాతం మంది పురుషులు స్త్రీలు బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన ఇంటికే పరిమితం కానవసరం లేదని తెలిపారు.

అయినా సమప్రాధాన్యం పైపైనే !
మహిళలకు సమాన హక్కు కల్పించడంలో పురుషుల్లో వచ్చిన ఈ మార్పు స్వాగతించాల్సిందే. అయితే అక్కడి మహిళలకు లభిస్తున్న సమ ప్రాధాన్యం పైపైకే అన్నట్లు ఉంటోందనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ కొంతమంది యువకుల్లో పాతకాలం భావజాలం పోలేదట. ఈ క్రమంలో పెళ్లికి ముందు ఉద్యోగం చేసినా పెళ్లి తర్వాత స్త్రీలు ఉద్యోగం మానేయాల్సిందే అంటున్నారట కొందరు యువకులు. ఒకవేళ పెళ్లి తర్వాత ఉద్యోగం చేసినా పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం మానేయాలని పట్టుబడుతున్నారట మరికొంతమంది. ఇక మరికొందరైతే పిల్లలు పుట్టి, పెరిగి, ఏదైనా విద్యాలయంలో చేరిన తర్వాతే స్త్రీలు ఉద్యోగం చేయాలంటున్నారట.

ఎవరేమనుకుంటే మాకేం... మేము పనిచేసి తీరతాం !
అయితే జపాన్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం దాదాపు 63.8 శాతం మంది స్త్రీలు ఎవరేమనుకున్నా తాము బిడ్డను కన్న తర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే 20.3 శాతం మంది మహిళలు మాత్రం పెళ్లైన తర్వాత ఉద్యోగం మానేసి పిల్లలు పెద్దవారయ్యాక మళ్లీ ఉద్యోగం చేస్తే బెటర్ అంటున్నారు. ఇక 6.5 శాతం మంది స్త్రీలు పిల్లలు పుట్టేవరకు ఉద్యోగం చేస్తే చాలు అంటే... 4.8 శాతం మంది స్త్రీలు పెళ్లి తర్వాత ఉద్యోగం అక్కర్లేదంటున్నారు.

వీటితో పాటు అనాదిగా పాతుకుపోయిన పురుషాధిక్య ఆలోచనల గురించి కూడా జపాన్ ప్రభుత్వం తమ పౌరులను ప్రశ్నించింది. ఈక్రమంలోనే ‘పురుషులు పని చేయాలి, స్త్రీలు ఇంటికే పరిమితం కావాలి’ అన్న అభిప్రాయంతో ఎంతమంది ఎకీభవిస్తారని ప్రశ్నించింది. దాదాపు 59.8 శాతం మంది దీన్ని వ్యతిరేకించగా 35 శాతం మంది దాంతో ఏకీభవించారు. ఇక పిల్లల పెంపకంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందని 56.6 శాతం మంది ఒప్పుకోవడం విశేషమనే చెప్పాలి. ఇదే తరహాలో జపాన్ ఆరోగ్య శాఖ చేసిన మరో సర్వేలో కూడా అత్యధికంగా 81.4 శాతం మంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత కచ్చితంగా ఉద్యోగం చేస్తామని చెప్పడం గమనార్హం.

మరి మన దగ్గర ?
జపాన్ సంగతి ఇలా ఉంటే మన దగ్గర మటుకు వర్కింగ్ ఉమెన్ విషయంలో ఇంకా వెనకబడే ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే చదువులో అయితే బాలికలు బాలురతో సమానంగా రాణిస్తున్నారు కానీ వృత్తి, ఉద్యోగాల విషయంలో మాత్రం ఇప్పటికీ మూడు రెట్లు వెనకబడే ఉన్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని గణాంకాల ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్స్‌లో 53%, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో 69.6%, పీహెచ్‌డీలో 41.8%గా ఉన్న స్త్రీల శాతం వృత్తి విషయంలో మాత్రం 78.6 శాతం ఉన్న పురుషులను అందుకోలేకపోతోంది. గతంలో ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అద్యయనం ప్రకారం పదిహేను సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉండి వృత్తి ఉద్యోగాలు నిర్వహిస్తున్న భారత మహిళల శాతం 23.6 శాతమే అంటే ఆశ్చర్యమే. ఈక్రమంలో స్త్రీల కోసం మరిన్ని ఉపాధి హామీ కార్యక్రమాలను చేపట్టి, మహిళా సాధికారతపై మారుమూల గ్రామాలలో సైతం అవగాహన కల్పిస్తే తప్ప సమసమాజం సాధ్యం కాదని పరిశోధకులు అంటున్నారు.