కాలం మారుతోంది... కంప్యూటర్ల యుగం వచ్చేసింది... అంతా ఆధునిక భారతమంటూ ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అయితే మహిళల విషయంలో ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తున్న అనాగకరిక ఆచారాలు, మూఢనమ్మకాలు ఇంకా మనల్ని మధ్యయుగం నాటి మనుషులేనని గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా నెలసరి విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష అంతా ఇంతా కాదు. పిరియడ్స్ సమయంలో మహిళలను ఇంట్లోకి రానివ్వకుండా అందరికీ దూరంగా ఉంచుతుంటారు. ఇంకొన్ని చోట్ల అయితే వారిని అంటరానివారిగా భావిస్తూ వూరి బయటే ఉండాలని కట్టుబాట్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో పిరియడ్స్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించాల్సిన ఓ విద్యా సంస్థే అమ్మాయిలతో అమానుషంగా వ్యవహరించింది. మహిళల్లో సహజంగా జరిగే కొన్ని జీవక్రియల్లాగే ఇది కూడా ఒక సహజ ప్రక్రియ అని విద్యాబుద్ధులు నేర్పాల్పిన సిబ్బందే అమానవీయంగా ప్రవర్తించారు.
అమానుషం.. అమానవీయం!
నెలసరి విషయంలో గుజరాత్‌లోని ఓ మహిళా కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని మరోసారి తలదించుకునేలా చేసింది. రుతుస్రావంలో ఉన్నారా?లేదా? అని గుర్తించేందుకు ఏకంగా 68 మంది విద్యార్థినులతో దుస్తులు విప్పించి ఎంతో అమానవీయంగా ప్రవర్తించారు ఆ కళాశాల సిబ్బంది. నెలసరి గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించాల్సిన ఓ విద్యాసంస్థే ఇంతటి దుర్మార్గానికి పాల్పడడంతో ప్రస్తుతం ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా తీసుకుని ఈ దుర్మార్గ ఘటనపై దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది.
ఇంకా అనాగరికపు ఆచారాలేనా!
నెలసరి అనేది మహిళల జీవితంలో ఓ భాగం. ఈ విషయం గురించి సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ఇందులో భాగంగా రుతుక్రమంపై అవగాహన కల్పిస్తూ చాలా సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి. ఇక సోనమ్ కపూర్, ట్వింకిల్ ఖన్నా, తాప్పీ, పరిణీతి చోప్రా లాంటి సెలబ్రిటీలు పిరియడ్స్, బ్లీడింగ్ వంటి విషయాల్లో తమ అనుభవాలను బహిరంగంగా చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక యూనివర్సిటీలు, కళాశాలలు, విద్యా సంస్థలు కూడా పిరియడ్స్ విషయంలో పలు అవగాహన కార్యక్రమాలు, క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాయి. అయితే గుజరాత్ రాష్ర్టంలోని భుజ్ శ్రీ సజానంద్ మహిళల కళాశాలలో మాత్రం ఇంకా అనాగరికపు ఆచారాలు, మూఢనమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కాలేజీలో సుమారు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే.

ఆచారాల పేరుతో అమానుషం!
ఈ క్రమంలో ఆచారాల పేరుతో ఈ కాలేజీ యాజమాన్యం అమలు చేస్తున్న కొన్ని నిబంధనలు అమ్మాయిల ఆత్మగౌరవానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రుతుస్రావంలో ఉన్న విద్యార్థినులు కాలేజీ హాస్టల్లో ఉండే వంటగది, దేవుడి గదిలోకి రానివ్వకుండా ఆంక్షలు విధించిందీ కాలేజీ యాజమాన్యం. అంతేకాదు తోటి విద్యార్థినులను సైతం తాకకూడదన్న నిబంధనలు అక్కడి అనాగరిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అయితే ఇటీవల కొందరు విద్యార్థినులు ఈ రూల్స్ అతిక్రమించారని ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారని హాస్టర్ రెక్టార్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రిన్సిపల్ నేరుగా విద్యార్థినుల క్లాస్ రూంకు వచ్చింది. ఎవరెవరు పిరియడ్స్‌లో ఉన్నారో నిల్చోవాలని విద్యార్థినులను ఆదేశించింది. అయితే ప్రిన్సిపల్‌ను చూసి భయపడిన విద్యార్థినులందరూ తలలు దించుకుని సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ క్రమంలో మరింత కోపోద్రిక్తురాలైన ప్రిన్సిపల్ విద్యార్థినులలందరినీ చెక్ చేయమని అక్కడున్న సిబ్బందిని ఆదేశించింది. దీంతో ఆ సిబ్బంది 68 మంది విద్యార్థినులను వాష్ రూంకి తీసుకెళ్లి బలవంతంగా దుస్తులు విప్పించారు. చివరికి వారిచేత లోదుస్తులు కూడా విప్పించి పిరియడ్స్‌తో ఉన్నారో లేదో చెక్ చేశారట.
సుమోటోగా కేసు!
ఈ నేపథ్యంలో సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే నిరసన జ్వాలలతో మేల్కొన్న కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థినులకు క్షమాపణ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యలు త్వరలోనే కాలేజీని సందర్శించి బాధిత విద్యార్థినులతో మాట్లాడనున్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకొన్నారో విడివిడిగా రిపోర్టు పంపించాలని కచ్ యూనివర్సిటీ వీసీ, గుజరాత్ డీజీపీలను ఆదేశించింది.