భావితరాలకు విలువలు నేర్పలేని విద్య వ్యర్థం అన్నారు మన పెద్దలు. నేటి సమాజంలో చాలా విద్యాలయాలు ర్యాంకులు సాధించడంలో చూపిన శ్రద్ధ విద్యార్థులకు మానవతా విలువలు నేర్పడంపై చూపడం లేదు. ఈక్రమంలో సాటి మనిషికి విలువివ్వాలనే కనీస విషయాన్ని నేటి తరంలో చాలామంది మర్చిపోతున్నారు. తద్వారా విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారి ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ఉన్మాద చర్యలు మరీ ఎక్కువవుతుండడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి దిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. స్త్రీల గురించి చెడుగా మాట్లాడితే కొడుకైనా, అన్నైనా, తమ్ముడైనా సరే ఇంట్లోకి రానివ్వమని చెప్పమంటోంది ! ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారేమో ! దీని వెనుక సదుద్దేశమే ఉంది !

అలా ప్రతిజ్ఞ చేయిస్తేనే బెటర్ !
బాల్యంలో మనందరికీ అక్షర జ్ఞానం అందించి... ఇప్పుడు నిద్రలో లేపి ఏ విషయం అడిగినా టక్కున చెప్పే విధంగా తయారు చేశారు మన గురువులు. అప్పుడే ఇలా అబ్బాయిల చేత ‘స్త్రీలను గౌరవించవలెను’ అనే పదాలు కూడా దిద్దించి ఉంటే ఇప్పుడు ఇన్ని అఘాయిత్యాలు జరిగేవి కావేమో ! అయితే కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు ఈ పనిని దిల్లీ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో అబ్బాయిల చేత చేయించనుంది. కానీ పలక మీద దిద్దించడం కాదు... రోజూ ఉదయం తరగతులకు వెళ్లే ముందు చేసే ప్రేయర్లో ‘మహిళలను అగౌరపరిచే పనులేమీ చేయమ’ని అబ్బాయిల చేత ప్రతిజ్ఞ చేయించనుంది. ఇటీవల ఎఫ్ఐసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రతిజ్ఞను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈక్రమంలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తరగతుల ప్రారంభానికి ముందు అబ్బాయిల చేత ఈ ప్రతిజ్ఞను చేయించనున్నారు.

ఇంటికి రావద్దు.. అక్కా, చెల్లి అని పిలవద్దు !
స్త్రీల గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా అబ్బాయిలను తీర్చిదిద్దే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన కేజ్రీవాల్ అమ్మాయిలకు కూడా ఓ సందేశాన్నిచ్చారు. అదేంటంటే.. ప్రతి స్కూళ్లో స్త్రీలను గౌరవించే విషయంపై అమ్మాయిలు తమ అన్నదమ్ములతో చర్చించాలి. అది తమ సోదరులకు ఇష్టం లేకపోయినా సరే.. ఫార్మాలిటీకైనా మాట్లాడాలి. ఈక్రమంలో ఒకవేళ తమ సోదరులు అమ్మాయిలపై అమర్యాద భావంతో ఉంటే.. అతడిని ఇంటికి రావద్దని.. తమను అక్కా, చెల్లి అని పిలవద్దని చెప్పమన్నారు. అంతేకాక ఇదే విషయాన్ని రోజూ మళ్లీ తరగతి గదిలో సహవిద్యార్థుల మధ్య పంచుకోవాలన్నారు.

తల్లిదండ్రులు కూడా వాటి గురించి చర్చించాలి !
మహిళలపై ఘోరాలు జరిగినప్పుడల్లా చాలామంది తల్లిదండ్రులు టీవీ కట్టేయడమో లేక పిల్లల్ని బయటకు పంపడమో చేసి జరిగిన ఘోరాలకు వారిని దూరంగా ఉంచాలని చూస్తుంటారు. అయితే ఇది తప్పంటున్నారు చాలామంది మానసిక నిపుణులు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఇంట్లో మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్వేచ్ఛగా చర్చ జరగాలన్నారు కేజ్రీవాల్. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి తల్లి కొడుకుతో, అమ్మాయి తన సోదరుడితో చర్చించాలన్నారు. సమాజంలో ఈ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ? ఏ కారణం చేత జరుగుతున్నాయి ? వంటి విషయాలు మాట్లాడి, ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో తన తల్లో, సోదరో ఉంటే అతడికి ఎలా ఉంటుంది ? అనే భావనను మగపిల్లల్లో కలిగించాలన్నారు.

ఎందుకు సాధ్యం కాదు !
మహిళల భద్రతకు తనవంతుగా పూర్తి భరోసాను ఇస్తూ ‘అవినీతిని ఇన్ని రోజుల్లో అంతమొందిస్తాం అని చెప్పగలిగే మనం మహిళలపై జరిగే ఘోరాలను ఎందుకు అడ్డుకోలేం. అది తప్పకుండా జరుగుతుంది. మనం కలిసికట్టుగా సాధించగలం. అందుకు కావాల్సిందల్లా ఒక్కటే.. నమ్మకం.. అది ప్రతి ఒక్క స్త్రీలో కలిగించాలి’ అని సభలోని మహిళలతో అన్నారు కేజ్రీవాల్. అంతేకాదు కింది స్థాయి పోలీసులకు కూడా వారి పైఅధికారులు స్త్రీల భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని చెబితే... పోలీసులు కూడా అందుకు తగ్గట్లే పనిచేస్తారని అన్నారు.
కాగా దేశ రాజధాని కావడం వల్ల మహిళలపై జరుగుతున్న ఘోరాలకు కొంతమంది దిల్లీని ‘రేప్ క్యాపిటల్’ ఆఫ్ ఇండియా అనడం తనను బాధించిందన్నారు కేజ్రీవాల్. అందుకే దిల్లీలో మహిళలపై భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు. ఈక్రమంలో ఇప్పటికే ప్రత్యేక బస్సులు, వాటిలో 13,000 మంది మహిళా మార్షల్స్‌ను పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రయత్నం ఫలించి దిల్లీలో ఇప్పుడు మహిళలకు మరింత రక్షణ ఏర్పడిందన్నారు. అందుకు ఇటీవల అపహరణకు గురైన బాలికను ఒక మహిళా మార్షల్ కాపాడడమే ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక త్వరలోనే మూడు లక్షల విలువ చేసే సీసీ కెమెరాలు, రెండు లక్షల విలువ చేసే స్ట్రీట్ లైట్స్‌ను కొత్తగా దిల్లీ వీధుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి. మరి, అమ్మాయిల క్షేమాన్ని కాంక్షిస్తూ, వారి గౌరవ మర్యాదలకు పెద్దపీట వేస్తూ దిల్లీ ప్రభుత్వం చేపడుతోన్న ఈ మహిళా రక్షణ పథకాలు, చర్యలతో ఇకనైనా అక్కడ మహిళలపై అఘాయిత్యాలు ఆగుతాయేమో చూడాల్సిందే... !