లండన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన సర్వే ప్రకారం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. మహిళల రక్షణలో సిరియా, అఫ్గానిస్తాన్ వంటి దేశాలను కాదని భారత్ ఈ దుస్థితిలో ఉండడం భారతీయులందరికీ శోచనీయం. ఇక అమెరికాకు చెందిన మరో విశ్వవిద్యాలయం 167 దేశాల్లో నుంచి మహిళలకు శాంతి, రక్షణ కల్పించే దేశాల జాబితా తీస్తే భారత్ 133వ స్థానంలో నిలిచింది. భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఎప్పుడూ గొప్పగా ఊహించుకునే వివిధ దేశాల ప్రజలు ఇప్పుడు ఈ సర్వేలను చూసి భయపడుతున్నారు. ఈక్రమంలో యు.కె., యు.ఎస్.కు చెందిన ప్రభుత్వాలు భారత్ వెళ్లాలనుకునే తమ దేశ మహిళలకు ఏమని చెబుతున్నాయో తెలుసా ?

పర్యాటకులు తగ్గిపోతున్నారు !
గతంలో గోవాలో ఐర్లాండ్‌కు చెందిన మహిళను హత్యాచారం చేసిన కొన్ని వారాల్లోనే ఓ జర్మన్ వనితపై అత్యాచారం చేసిన ఉదంతం చాలామంది విదేశీ మహిళల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈక్రమంలో భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. పలు దేశాలు తమ ప్రజలకు భారత పర్యటనపై ఇచ్చే సలహాలు, సూచనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతి దేశానికి తమ ప్రజలు ఇతర దేశాల్లో పర్యటించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే ట్రావెల్ అడ్వైజరీ విభాగం ఉంటుంది. ఈక్రమంలో ఇటీవల భారత్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతుండడంతో యు.కె, యు.ఎస్.కు చెందిన ట్రావెల్ అడ్వైజరీ విభాగాలు తమ వెబ్సైట్లలో తమ దేశ మహిళలకు కొన్ని సూచనలను ఇచ్చాయి. వాటిలో భారత్ అంత సురక్షితమైనది కాదని తమ ప్రజలకు తెలపకనే తెలుపుతున్నాయి.

వెంటనే ‘డయల్ 100’కు ఫోన్ చేయండి !
ఇటీవల దిశ ఉదంతంతో యావత్ భారతదేశం ఉడికిపోగా ఇటువంటి ఘోరమైన కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయని భారత పోలీస్ రికార్డుల ద్వారా విదేశీ ట్రావెల్ అడ్వైజరీ విభాగాలు తెలుసుకున్నాయి. ఈక్రమంలో ఒకవేళ భారత్‌లో పర్యటించాలనుకుంటే అక్కడ అత్యాచారం అత్యంత వేగంగా పెరుగుతున్న నేరంగా గుర్తించాలని తమ వెబ్సైట్లో తెలిపింది. అంతేకాదు పలు టూరిస్ట్ ప్రాంతాలలో జరిగిన అత్యాచారాల గురించి వివరించింది. ఈక్రమంలో భారత్‌లో పర్యటించాలనుకునే మహిళలు అత్యవసర సమయంలో తప్పకుండా ‘డయల్ 100’కు ఫోన్ చేయాలని సూచించింది. అంతేకాదు కేసు నమోదు చేసే సమయంలో తప్పకుండా మహిళా పోలీసులతోనే మాట్లాడి ఆంగ్లంలో రాసిన ఫిర్యాదుపైనే సంతకం చేయాలని తెలిపింది. ఒకవేళ పోలీసులు ఆంగ్ల మాధ్యమంలో రిపోర్ట్ చేయలేకపోతే ఎవరితోనైనా రిపోర్ట్ చదివించి పూర్తి సమాచారాన్ని నిర్ధరణ చేసుకున్న తర్వాతే సంతకం పెట్టాలని వివరించింది.

అంతేకాదు మహిళలు ఒకవేళ రేప్‌కు గురై ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు అదనంగా మరో దుస్తుల జత కూడా తీసుకు వెళ్లాలని ఆయా దేశాల అడ్వైజరీ విభాగాలు కోరుతున్నాయి. ఎందుకంటే అఘాయిత్యం జరిగిన దుస్తులను వైద్యులు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం తీసుకుంటారు. ప్రతి దేశంలో కేసు నమోదు పద్ధతులు మారొచ్చని చెబుతూ, ప్రతిదీ మహిళా పోలీసుల సమక్షంలోనో లేక ఎన్జీవో ప్రతినిధి ఆధ్వర్యంలోనో జరగాలనేది గుర్తుంచుకోమని అడ్వైజరీ విభాగాలు పర్యాటకులకు చెబుతున్నాయి.
ఇక పలు ప్రాంతాల్లోని టూరిస్ట్ గైడ్లు కూడా రోజురోజుకీ పర్యాటకులు తగ్గిపోతున్నారని చెబుతుండగా... విదేశీ మహిళ అయినా, భారత మహిళ అయినా ఇటువంటి అఘాయిత్యాలు జరగడం శోచనీయం అంటున్నారు. ఇకనైనా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రపంచంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని.. మహిళల రక్షణలో భారతదేశం అత్యున్నతమని చాటాలని కోరుతున్నారు.