మహిళలపై ఇంటా బయటా దాడులు పెరుగుతున్నాయి. వారి కోసం ఎన్నో చట్టాలు అందుబాటులో ఉన్నా అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. గృహహింస నుంచి మొదలుకొని పనిప్రదేశంలో ఎదురయ్యే లైంగిక, ఇతర హింసల నుంచి చట్టం రక్షణ కల్పిస్తోంది. మహిళలకు చట్టం కల్పించే రక్షణలను ఉపయోగించుకోవడం ద్వారా ఆమె హక్కులకు భంగం కలగకుండా చూసుకోవచ్చు. వాటి గురించి భారత శిక్షాస్మృతి (ఐపీసీ) ఏం చెబుతుందంటే..
* మహిళల మాన, ప్రాణ రక్షణ కోసం.. దాడి చేసే వ్యక్తిపై తిరిగి దాడి చేసినా ఎలాంటి తప్పులేదు. దాడి చేసే వ్యక్తి సదరు మహిళ చేతిలో చనిపోయినా సెక్షన్ 100 ప్రకారం ఆత్మరక్షణ కిందే చట్టం చూస్తుంది.

* సెక్షన్ 148ఏ అదనపు కట్నం కింద వేధిస్తే కేసు పెట్టవచ్చు. రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. వరకట్న వేధింపులతో మహిళ మరణిస్తే 304 ఎ ప్రకారం కేసు నమోదు చేస్తారు. రుజువైతే ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు శిక్ష పడవచ్చు.
* ప్రోద్బలం, వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే సెక్షన్ 306 ప్రకారం సదరు వ్యక్తిపై నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష.
* యాసిడ్ లేదా ఇతర రసాయనాలతో మహిళలపై దాడులు చేస్తే సెక్షన్ 326 ప్రకారం పదేళ్ల జైలుశిక్ష, ప్రయత్నం చేస్తే సెక్షన్ 326 బి ప్రకారం 5-7 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. జరిమానా కూడా విధిస్తారు.
* మహిళలను లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, సైగలు చేసినా, అవమానపరచినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా సెక్షన్ 354 కింద ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే తీవ్రతనుబట్టి 1-7 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రహస్య ఫొటోలు తీయడం, వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపిస్తే సెక్షన్ 354 (సి) కింద ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

* బాలికలపై లైంగికంగా దాడి చేసినా, ఆమె అనుమతితో జరిగినా చట్టం 376 కింద సదరు వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష. వైద్యం కోసం వచ్చిన మహిళలను లైంగికంగా వేధింపులకు గురిస్తే సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష.
* పనిచేసే ప్రదేశంలో మహిళలు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటుంటారు. ఉన్నతాధికారి, సహోద్యోగులు వేధింపులకు పాల్పడుతుంటారు. అలాంటప్పుడు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేయవచ్చు. రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష. పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు సంబంధించి 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.
* మహిళలపట్ల బహిరంగ ప్రదేశాల్లో, ఇతరచోట్ల అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకర వస్తువులను చూపించినా సెక్షన్ 509 కింద ఫిర్యాదు చేయవచ్చు. జైలుశిక్ష పడుతుంది.
* బస్సు కోసం, మార్కెట్లో కూరగాయలు లేదా ఇతర పనులపై వెళ్తున్న మహిళలను చూసి అసభ్యకరంగా పాటలు పాడటం, శబ్దాలు చేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్ 294 కింద ఫిర్యాదు చేయవచ్చు. కనీసం మూడు నెలలకు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది.

* ఒక బృందంలోని ఒక సభ్యుడు మహిళ లేదా బాలికపై లైంగిక దాడి చేస్తే ఆ బృందంలోని ప్రతి వ్యక్తి నేరానికి పాల్పడినట్లే. సెక్షన్ 376 (బి) కింద ప్రతిఒక్కరిపై కేసు నమోదు చేస్తారు. రుజువైతే 20 ఏళ్ల వరకు తగ్గకుండా జీవితఖైదు విధిస్తారు.
ఉచిత న్యాయ సహకారం..
అత్యాచార బాధిత మహిళలు పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి భయపడుతుంటారు. అలాగే న్యాయసహకారం పొందడానికి కూడా ముందుకు రారు. అయితే ప్రతి మహిళా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అత్యాచార బాధిత మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు, ఆ వెంటనే న్యాయసహాయం కోరే వీలుంటుంది. అది కూడా ఉచితంగానే పొందవచ్చు. ఒక మహిళ ఇలా అత్యాచార కేసును ఫైల్ చేసినప్పుడు.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంటనే న్యాయ విభాగానికి సమాచారం అందించి ఆమెకు లాయర్ని నియమించాలి. మేజిస్ట్రేటే అవసరం లేదు.. అత్యాచార బాధితులు ఒక్కోసారి వారి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటివారు తమ స్టేట్మెంట్ని మేజిస్ట్రేట్ ముందే ఇవ్వాల్సిన అవసరం లేదు. సెక్షన్ 164 ప్రకారం కేవలం ఒక్క పోలీసు ఆఫీసరు సమక్షంలోనైనా తన స్టేట్మెంట్ను ఇవ్వచ్చు. ఒకవేళ ఆ పోలీసు ఆఫీసరు పురుషుడు అయి, వారితో పంచుకోవడం తనకు ఇష్టం లేకపోతే.. మహిళా పోలీసు ఆఫీసర్ కావాలని అడిగి, వారి సమక్షంలో కూడా తన స్టేట్మెంట్ను ఇవ్వచ్చు. స్టేషన్‌కి వెళ్లకుండా... గృహ హింస, లైంగిక హింస వంటివి ఎదురైన కొన్ని సందర్భాల్లో బాధిత మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి వీలు లేకపోవచ్చు. ఇలాంటి సమయంలో వారు తమ ఫిర్యాదును ఈమెయిల్ రూపంలో కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. అయితే ఇలా ఫిర్యాదు చేసేటప్పుడు పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులకు మాత్రమే పంపించాలి. వారు సంబంధిత పోలీసు స్టేషన్‌కు ఆ కేసును అప్పజెబుతారు. ఆ తర్వాత పోలీసులు బాధిత మహిళ దగ్గరికి వచ్చి ఆమె స్టేట్మెంట్ తీసుకొంటారు. జీరో ఎఫ్ఐఆర్ కొన్ని సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు 'మేము ఈ ఫిర్యాదు తీసుకోలేము. ఇది ఈ మా పోలీసు స్టేషన్ పరిధిలో లేదు' అని చెబుతుంటారు. అయితే మహిళలు ఏ పోలీసు స్టేషన్లో అయినా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ పోలీసులు మీ ఫిర్యాదును నమోదు చేసుకోని పక్షంలో జీరో ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు చేయాలి. ఇలా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులే ఆ కేసును సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తారు. అది ప్రామాణికం కాదు.. సాధారణంగా అత్యాచార కేసులు నమోదైనప్పుడు బాధిత మహిళకు వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ మహిళకు డాక్టరు రిపోర్టును అడిగే హక్కు కూడా ఉంటుంది. వైద్య పరీక్షలు కేవలం అధారం కోసం మాత్రమే జరుపుతారు. అంతేతప్ప ఇలాంటి కేసుల్లో డాక్టరు రిపోర్టు బాధితులకు వ్యతిరేకంగా ఉన్నా అది చెల్లదు.
రాత్రి పూట కుదరదు..
కేసు ఏదైనా పోలీసులకు ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఉటుంది అని చాలామంది అనుకుంటారు. అయితే సెక్షన్ 46 ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయడానికి వీల్లేదు. అయితే నేర తీవ్రతను బట్టి ఈ సమయాలకు అతీతంగా అరెస్టు చేయడానికి పోలీసులు మేజిస్ట్రేటు నుంచి అనుమతి తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి సందర్భాల్లోనే కాదు.. స్త్రీలను ఎప్పుడు అరెస్టు చేసినా వారిని అరెస్ట్ చేసేవారు తప్పకుండా మహిళలే అయి ఉండాలి. అలాగే రాత్రి పూట మహిళలను అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు నుంచి తీసుకున్న అనుమతి పత్రం తప్పనిసరిగా పోలీసులు చూపించాలి.
లైంగిక వేధింపులు ప్రస్తుతం ప్రతి ప్రదేశంలోనూ జరుగుతున్నాయి. అందుకే పదికంటే ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు లైంగిక వేధింపుల ఫిర్యాదు కమిటీని తప్పకుండా ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని రంగాలకు చెందిన సంస్థల్లోనూ ఈ పద్ధతిని పాటించాలి. అలాగే ఈ కమిటీకి మహిళే నాయకత్వం వహించాలి. అంతేకాకుండా కమిటీలో సగం మంది మహిళలు సభ్యులుగా ఉండి ఒకరు విమెన్ వెల్ఫేర్ గ్రూప్‌లో సభ్యులుగా ఉండాలి.
|