సాధారణంగా మహిళలపై ఏవైనా అఘాయిత్యాలు, అరాచకాలు జరిగితే అందుకు మహిళనే బాధ్యురాలిగా చేయడం అనాదిగా వస్తోంది. ఇలాంటి చాలా సందర్భాల్లో మహిళలు మౌనమే సమాధానంగా మిన్నకుండిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తప్పొప్పులు ఎవరివో సామాజిక మధ్యమాల సాక్షిగా ఎండగడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ రెండు ఉదంతాలు. ఒక సందర్భంలో.. రాత్రి వేళ మహిళలపై జరిగే అఘాయిత్యాలకు మహిళ ఒంటరిగా తిరగడమే కారణమని సాక్షాత్తూ పోలీసులే అంటే విరుచుకుపడిన మహిళలు మరో ఉదంతంలో విద్యార్థినులను నగ్న చిత్రాలు అడిగిన వ్యక్తిని అధ్యాపకుడిగా నియమించడంపై కళాశాలలో పెద్ద దుమారమే రేపారు.

మారాల్సింది మహిళలు కాదు మగవారు !
‘ఇది చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మహిళలు పబ్లిక్‌లో ఉండకూడదని నాకు గుర్తు చేస్తోంది’... ‘నేను మీకు సవినయంగా వివరించదల్చుకున్నాను... మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇదివరకటిలా ప్రతి నేరానికీ మహిళల్ని బాధ్యుల్ని చేసే రోజులు పోయాయి’... ఇవి నాటింగ్‌హామ్ పోలీసులు తమ ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్‌కు మహిళలు పెట్టిన కామెంట్స్. రాత్రి వేళ ఒక మహిళ ఒంటరిగా వెళుతుంటే ఆమె వెనుక ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్తున్నట్లు తమ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన నాటింగ్‌హామ్ పోలీసులు, మహిళలు సురక్షితంగా ఉండాలంటే ఇలా ఒంటరిగా రాత్రి పూట వెళ్లడం మంచిది కాదని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు దీనిని ఒక పురుషాధిక్య దుశ్చర్య అన్నారు. ప్రపంచంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు మహిళలే కారణం అన్నట్లుగా నాటింగ్‌హామ్ పోలీసుల చర్య ఉందని కామెంట్ల వర్షం కురిపించారు. ఇటువంటి సందర్భాల్లో మారాల్సింది పురుషులు కానీ మహిళలు కాదని కోప్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన నాటింగ్‌హామ్ పోలీసులు తమ పోస్ట్ నిరాధారమైనదని పేర్కొని వెంటనే డిలీట్ చేసేశారు. అంతేకాదు తమ పోస్ట్ వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే బేషరతుగా క్షమాపణ తెలుపుతున్నట్లు మరో పోస్ట్ ద్వారా తెలిపారు.

అతడిని మళ్లీ నియమిస్తారా ?
ప్రపంచంలో ఎంతోమంది కీచక వారసులు, దుశ్శాసన పుత్రులు ఉపాధ్యాయ ముసుగులోనూ తిరుగుతున్నారు. వీరిలో ఒకరే ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన సహోత్రా సర్కార్. గతంలో విద్యార్థినులను లైంగికంగా వేధించాడని ఇతనిపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి. విద్యార్థినులకు డబ్బు ఆశ చూపి వారిని నగ్న చిత్రాలు అడగడం, తనతో కలిసి నగ్నంగా స్విమ్మింగ్ చేయాలని కోరడంతో పాటు తరగతికి సంబంధించిన మీటింగులను బార్లలో పెట్టడం మొదలైనవి ఇతగాడి వికృత చేష్టలు. 2017లో సహోత్రాపై వచ్చిన ఆరోపణలు కొన్ని నిజమని తేలడంతో యాజమాన్యం అతడిని యూనివర్సిటీ నుంచి తొలగించింది. అయితే అది తాత్కాలికమే అని ఇప్పుడు తెలిసింది. ఇటీవల అతడు మళ్లీ విధుల్లో చేరడంతో విద్యార్థినులు భగ్గుమన్నారు. పోకిరి సినిమాలో బిచ్చగాళ్లంతా బ్రహ్మానందం వెనుక పడ్డట్లు ఇదిగో.. ఇలా విద్యార్థినులంతా కలిసి సహోత్రా వెనుక పడ్డారు.
విద్యార్థులకు విలువలు నేర్పాల్సిన అధ్యాపక వృత్తికి అతడు అనర్హుడని వివరిస్తూ అతడు బోధించే ప్రతి తరగతికీ వెళ్లి గళమెత్తుతున్నారు. అంతేకాదు ఎవరికైనా తమ డిమాండ్ సబబే అనిపిస్తే.. కేవలం సహోత్రానే కాదు యూనివర్శిటీలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కామాంధుడినీ అధ్యాపక వృత్తి నుంచి తొలగించేందుకు తమకు సహకరించాలని విద్యార్థులను కోరారు. అందుకు విద్యార్థులు కూడా సహకరించారు. అయితే విద్యార్థుల స్వేచ్ఛకు విలువిస్తున్నామని తెలిపిన యాజమాన్యం ఇలా ప్రతి తరగతిలో విద్యకు ఆటంకం కలిగించడాన్ని మటుకు తప్పు పట్టింది. ఇందులో భాగంగానే సహోత్రాకు ఆఖరు అవకాశం కల్పిస్తూ మళ్లీ ఎటువంటి ఆరోపణైనా వస్తే తొలగిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. టెక్సాస్ యూనివర్సిటీలో అధ్యాపకులపై లైంగిక వేధింపులు కొత్తేమీ కాదు. ఒక్క 2017లోనే దాదాపు 445 లైంగిక వేధింపుల కేసులు అధ్యాపకులపై నమోదయ్యాయంటే పరిస్థతి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.