ఆమెకు చిన్న వయసులోనే పెళ్లైంది.. ఏడాది తిరక్కముందే అమ్మయింది.. భర్త, కొడుకుతో హాయిగా సాగిపోతోన్న ఆమె జీవితాన్ని చూసి విధికి అసూయ కలిగినట్లుంది. అందుకే తన భర్తను తన నుంచి, ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ఇక అప్పట్నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. దీనికి తోడు ప్రేమ పేరుతో మరో వ్యక్తి వేధింపులు, అతనితో పెళ్లికి నిరాకరించడంతో యాసిడ్ దాడికి కూడా గురైందామె. సుమారు ఆరేళ్లుగా తన శారీరక, మానసిక బాధను పంటి బిగువన భరిస్తూ ఎన్నో కష్టాలకోర్చిన ఆమె.. తనలాంటి వారిలో చైతన్యం నింపేందుకు ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది.. యాసిడ్ దాడికి గురైనంత మాత్రాన సమాజం మాలాంటి వారిని వెలివేయాల్సిన అవసరం లేదని, మేం తలచుకుంటే ఏదైనా సాధించగలం, నలుగురికీ ఆదర్శంగా నిలవగలం అంటోన్న ఆమె ఎవరు? ఆమె తన ఆశయం గురించి ఏం చెప్పాలనుకుంటోంది? తెలుసుకుందాం రండి...
ఎలాంటి శారీరక లోపాలు లేనప్పుడే ఈ సమాజం మనల్ని మనుషులుగా గౌరవిస్తుంది.. ప్రేమ పంచుతుంది.. అదే ఏ చిన్న సమస్య ఎదురైనా వారిని అంటరాని వారిగా చూస్తుంది. నా జీవితంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నా పేరు కేథరిన్.. మాది కేరళ. అమ్మా, నాన్న, నేను, అక్క.. ఉన్నంతలోనే హ్యాపీగా బతకడం మాత్రమే మాకు తెలుసు! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే అక్కకు మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేశారు. ఏడాది తిరక్కుండానే ఎన్నారై సంబంధం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అబ్బాయి మంచి వాడు, పైగా లండన్‌లో ఉద్యోగం.. అమ్మానాన్న నచ్చజెప్పడంతో జోసెఫ్‌తో పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. గ్రాండ్‌గా పెళ్లి జరిగింది.. ఆపై లండన్ వెళ్లిపోయాను.

మంచోడని చెప్పడం కాదు కానీ జోసెఫ్ నన్ను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు.. అతని ప్రేమలో మునిగి తేలుతూ ఏడాది ఎంత త్వరగా గడిచిపోయిందంటే అసలు సమయమే తెలిసేది కాదు. అంతలోనే మా బాబు ఆరోన్ పుట్టాడు. ఇక మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా హాయిగా సాగిపోతోన్న నా జీవితంలో ఇంత త్వరగా చీకట్లు కమ్ముకుంటాయని నేను ఊహించలేదు. రోజూలాగే ఆ రోజు కూడా ఆఫీస్‌కి బయల్దేరాడు జోసెఫ్. రోజూ కార్లో వెళ్లే అతడు.. ఆ రోజు కారు రిపేర్ రావడంతో బైక్‌పై వెళ్లాడు. అసలే రద్దీ రోడ్లు, పైగా తనకు బైక్ బాగా స్పీడ్‌గా నడపడం అలవాటు. దీంతో నాకు కాస్త భయమేసింది. అప్పటికీ చెప్పాను.. నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లమని! ఇక సురక్షితంగా ఆఫీస్‌కి చేరుకున్నానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నా. అయితే నేను ఏ విషయంలోనైతే భయపడ్డానో ఆ భయమే నిజమైంది. జోసెఫ్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు తనకు ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయాలవడంతో వారం పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఓవైపు పసివాడు, మరోవైపు ప్రాణాలతో పోరాడుతోన్న భర్త.. ఇలాంటి దయనీయ స్థితి శత్రువుకు కూడా రాకూడదనుకున్నా. కానీ జోసెఫ్ మాత్రం వారం పాటు మృత్యువుతో పోరాడి అలసిపోయాడు. నన్ను, నా బాబును ఒంటరిని చేసి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు.
******
ఈ బాధతో ఏడ్చీ ఏడ్చీ నా కన్నీరు ఇంకిపోయింది.. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు, నా బాబుకు అమ్మానాన్నే అన్నీ అయ్యారు. అమ్మా వాళ్లతో లండన్ నుంచి ఇండియా తిరిగొచ్చేశాను. రోజులు గడిచిపోయాయి.. సంవత్సరాలు మారాయి. ఆరోన్‌కు మూడేళ్లొచ్చాయి. ఇలా అమ్మానాన్నల మీద ఇంకెంత కాలం ఆధారపడి బతకాలి.. అనుకున్నా! అందుకే నా పేరెంట్స్‌ని ఒప్పించి ఓ షాపింగ్ మాల్లో సేల్స్‌గర్ల్‌గా పనిలో చేరాను. నాకొచ్చే జీతంతో నా బాబును పోషించుకోగలిగితే చాలనుకున్నా. ఇలా ఉన్నంతలోనే నా కాళ్ల మీద నేను నిలబడుతూ నా కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ముందుకెళ్తున్నా. ఇదే సమయంలో అహ్మద్ అనే వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. అతను కూడా నేను పనికి వెళ్లే ప్రాంతంలోనే ఉద్యోగం చేస్తుండేవాడు. హాయ్, బై.. తప్ప అతనితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు.. కానీ తను మాత్రం పడీ పడీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. అతని ప్రవర్తన చూసి నాకేదో తేడాగా అనిపించింది. అందుకే అప్పట్నుంచి అతనితో మాట్లాడడం పూర్తిగా మానేశా. కానీ తను మాత్రం నా వెంట పడడం మానలేదు.

ఓ రోజు నా ముందుకొచ్చి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ‘అసలు నా గురించి నీకు, నీ గురించి నాకు ఏం తెలుసని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు.. అయినా నాకు ఇదివరకే పెళ్లైంది.. ఓ కొడుకు కూడా ఉన్నాడు..’ అని చెడామడా కడిగేసి అక్కడ్నుంచి వెళ్లిపోయా. ఇలా నా జీవితం గురించి నిజం తెలిశాకనైనా అతను నన్నొదిలేస్తాడనుకున్నా.. కానీ అతనిలో ఓ రాక్షసుడున్నాడని అప్పుడే నాకు అర్థమైంది. రోజూలాగే ఆ రోజూ పనికి వెళ్తున్నా.. అప్పటికే ఆ మార్గమధ్యలో నాకోసం కాపు కాస్తూ కూర్చొన్న అహ్మద్.. నా రాకను గమనించి నా ముందుకొచ్చాడు. ‘నేను చెప్పింది ఏం చేశావ్?’ అని అడిగాడు.. ‘నీకొక్కసారి చెప్తే అర్థం కాదా?’ అని మళ్లీ అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశా. కానీ అతను నన్ను అడ్డగించి నా ముఖంపై యాసిడ్ పోసి అక్కడ్నుంచి పరారయ్యాడు. నా ముఖమంతా మంటలు, జుట్టంతా కాలిపోతుంది.. బాధ భరించలేక కేకలు పెడుతున్న నన్ను గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే యాసిడ్ నా ముఖాన్ని నామ రూపాల్లేకుండా చేసేసింది. ఒక కన్ను పూర్తిగా కనబడకుండా ఛిద్రమైంది.

దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆపై ఎన్నో సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు అయ్యాయి. నా ముఖం నేనే గుర్తుపట్టలేనంత భయంకరంగా మారిపోయింది. ఇక ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న నాకు ఇరుగుపొరుగు వాళ్ల ఈసడింపులు ఎక్కువయ్యాయి. ‘బరితెగిస్తే ఇలాంటి గతే పడుతుంది’, ‘అది ముఖంలా లేదు.. అమీబాలా ఉంది..’ అంటూ ఎంతోమంది హేళన చేశారు.. కొంతమందైతే నన్నో వింత వ్యక్తిలా చూస్తూ నాపై రాళ్లు విసిరేవారు. ఇలా శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన నాకు అమ్మానాన్నలే ధైర్యం చెప్పారు. ‘ఇతరుల కోసం కాదు.. నీకోసం, నీ బాబు కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి.. ఆత్మవిశ్వాసం నింపుకోవాలి..’ అంటూ నాకు అండగా నిలిచారు. ఈ ఘటన జరిగి పదేళ్లు కావస్తోంది.. అయినా నా ముఖంపై యాసిడ్ తాలూకు విషపు మరకలు నాటి చేదు జ్ఞాపకాల్ని అనుక్షణం గుర్తుచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆ గాయాలు దురద పెడుతూ, నొప్పి పుడుతూ నన్ను వేధిస్తూనే ఉన్నాయి.
******
అయినా వాటిన్నింటినీ పక్కన పెట్టి, ఆ బాధను పంటి బిగువన భరిస్తూ నా కొడుకు భవిష్యత్తుపైనే పూర్తి దృష్టి పెట్టా. నాలాగే సమాజం ఈసడింపుల్ని భరిస్తూ, చేయని తప్పుకు నరకయాతన అనుభవిస్తోన్న ఆమ్లదాడి బాధితులెందరో ఉన్నారు. అలాంటి వారికి నా వంతుగా చేయూతనందిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నా. ఈ క్రమంలో నాకొచ్చిన కుట్లు-అల్లికలు, బ్లౌజ్ డిజైనింగ్.. వంటివి వారికీ ఉచితంగా నేర్పుతున్నా. అలాగే పలు కౌన్సెలింగ్ వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నా. ఇలా నాలాంటి బాధితులకు ఉడతాభక్తిగా సహాయం చేస్తూ వారు నలుగురికి స్ఫూర్తి పంచేలా జీవించేందుకు నా వంతుగా సహాయపడుతున్నా. అయినా ఎవరో చేసిన పనికి మన ముఖాలు దాచుకోవడమెందుకు? నిర్భయంగా అడుగు బయటకు వేద్దాం.. ఎవరేమనుకున్నా.. మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుంటూ, మనపై ఆశలు పెట్టుకున్న వారిని కంటికి రెప్పలా కాచుకుందాం.. మరింతమందికి స్ఫూర్తిగా నిలుద్దాం..!